- 400వ రోజుకు చేరుకున్న రైతుల ఉద్యమం
- రాజధాని గ్రామాల్లో ర్యాలీ చేపట్టిన రైతులు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి (జనవరి 20) 400వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమరావతి రైతులు రాజధాని గ్రామాల్లో ర్యాలీ చేపట్టారు. తుళ్లూరులో ప్రారంభమైన ర్యాలీ రాజధాని పరిధిలోని గ్రామాలలో మీదుగా మందడం వరకు సాగింది. పలువురు రాజకీయ నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం చెప్పిన మాటలకు హైకోర్టు తీర్పుతో అసత్యమని తేలిందని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు. హైకోర్టును కర్నూలుకు తరలించాలని ముఖ్యమంత్రి పదే పదే చేస్తున్న ప్రయత్నాలను రైతులు తప్పుబట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించేవరకు ఉద్యమం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు.
ఇది చదవండి: జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ
ఉద్రిక్తంగానే గొల్లపూడి
మరోవైపు అమరావతి ఉద్యమం 400వ రోజుకు చేరుకోవడంతో గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ నిరసన దీక్షకు దిగారు. దీక్షకు మద్దతు తెలిపేందుకు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఉమ నివాసానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్దకు బయల్దేరిన ఉమ, ధూళిపాళ్లను ఇంటినుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారో లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. బయటకు వెళ్లేందుకు పోలీసులు అడ్డుకోవడతో దేవినేని ఉమ తన ఇంటి ఆవరణలోనే దీక్ష చేపట్టారు. గొల్లపూడి కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. విగ్రహం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఇది చదవండి: ఏకపక్ష నిర్ణయాలతోనే రాజధాని విషాదం