————
(‘LAWS’ FROM ‘THE PROPHET’ BY KAHLIL GIBRAN)
అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
——————
పిల్లలు —
సాగర తీరాల్లో
తదేక ధ్యానంతో
ఇసుక మేడలు కట్టి
వాటిని కూలద్రోసినట్లు
మీరు —
చట్టాల రూపకల్పనలో ఆనందించి
వాటి ఉల్లంఘనలోనూ
ఆనందిస్తారు
ఇసుక మేడలు కట్టేకొద్దీ,
సాగరం మరింత ఇసుకను ఒడ్డుకు తెస్తుంది.
ఆ మేడలు కూల్చినపుడు
మీతో పాటు తానూ నవ్వుతుంది!
నిజానికి సముద్రం
అమాయకులతో ఎప్పుడూ నవ్వుతూంటుంది!
కానీ —
జీవితం సముద్రం కాని వారి,
చట్టాలు ఇసుక మేడలు కాని వారి
—మాటేమిటి?
—జీవితం శిలయై
చట్టం ఉలియై
దానితో, వారి ఇష్టానుసారం చెక్కే వారి మాటేమిటి?
వికలాంగులు —
నాట్యకారులను అసహ్యించుకుంటే —
వారి సంగతి ఏమిటి?
ఎద్దు–
నాగలిని ప్రేమిస్తే?!
లేళ్ళు, దుప్పులూ
విచ్చల విడిగా తిరుగుతూ
దారి తప్పుతున్నాయని
— భావిస్తే?
ముసలి సర్పం–
కుబుసం విడువ లేక,
ఇతరులందరూ —
నిర్లజ్జగా, నగ్నంగా
జీవిస్తున్నారనుకుంటే
—ఏమిటి?
పెళ్లి విందుకు ముందుగా వచ్చి,
సుష్టుగా తిని, ఆయాస పడుతూ–
‘ విందులన్నీ చట్ట ఉల్లంఘన,
విందులిచ్చే వారు చట్ట వ్యతిరేకులు‘
—అనే వారి సంగతేమిటి?
వీపులు సూర్యుడి వైపు పెట్టి
నిలబడ్డ వీరి గురించి
ఏమనగలను?
వారి నీడలనే వారు చూడగలరు
వారి నీడలే వారి చట్టాలు!
సూర్యుడంటే వారికి–
నీడలు విడిచే వాని కింద లెక్క!
కిందికి వంగి, అవనిపై
నీడల జాడ కనుగొనే చట్టాలని
గుర్తించడం ఏమిటి?
కానీ,
సూర్యునికెదురుగా నడిచే మిమ్ములను
భూమిపై ఏ నీడల జాడలు పట్టగలవు?
గాలితో పాటు ప్రయాణించే మీకు
ఏ గాలి దిక్సూచి దారి చూపిస్తుంది?
ఎవరికీ చెందని
జైలు ద్వారం వద్ద
మీ బంధనాలు తెంచుకుంటే–
ఏ మానవ శాసనం మిమ్ములను
పట్టి ఉంచగలదు?
మీరు నాట్యం చేస్తూ–
ఎవరికీ చెందని ఇనుప గొలుసుకు
తగిలి తూలితే–
చట్టాలు చూసి వెరుస్తారు?
మీ వస్త్రాలు మీరే చింపుకొని
ఎవరికీ చెందని దారిలో వదిలితే–
మీపై ఎవరు ఏ తీర్పు ఇవ్వగలరు?
మీరు–
ఢంకా ధ్వని తగ్గించగలరు
వీణా తంత్రులు వదులు చేయగలరు!
కానీ–
కోయిలను పాడవద్దని
శాసించగలరా?
—
Also read: సప్తతి పూర్వార్ధం……లో
Also read: విగ్రహం
Also read: ఇద్దరు సంరక్షక దేవ దూతలు
Also read: యుద్ధమంటే ఏమిటో…..అడుగు
Also read: దేశాన్ని చూసి జాలిపడు