ఒక తప్పుడు మాటను పురస్కరించుకుని రాహుల్ గాంధీకి శిక్ష విధించడం– కేవలం ఒక వ్యక్తికి, లేదా ఒక ప్రతిపక్షరాజకీయనాయకుడికి శిక్ష విధించడం మాత్రమేనా?! కాదు, అంతకుమించి, అది ‘మాట’కు శిక్ష విధించడం! అంతిమంగా ప్రజాస్వామికస్వేచ్ఛకు ప్రాథమిక సాక్ష్యమైన ‘మాట’నే చావగొట్టి చెవులు మూసే పరిస్థితివైపు నడిపించడం!
మాటనే శిక్షించాలనుకున్నప్పుడు, అదీ రోజున రాహుల్ గాంధీ మాట కావచ్చు; రేపు ఇంకెవరిదైనా కావచ్చు. మనుషుల్లో ఎన్ని రకాలుంటారో మాటల్లో అన్ని రకాలుంటాయి. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో తప్పుడు మాటకే శిక్షించడం మొదలుపెడితే న్యాయస్థానాలు చాలతాయా? న్యాయమూర్తులు సరిపోతారా? మాటను శిక్షించడమే మొదలుపెడితే మనిషి గొంతు పెగలుతుందా?! మాట భయపడి మూగవోయినప్పుడు, అది అధికారంలో ఉన్నవారి గొంతు మాత్రమే గట్టిగానూ, ఏకపక్షంగానూ వినిపించే నియంతృత్వమవుతుంది తప్ప ప్రజాస్వామ్యమవుతుందా? మూగ ప్రజాస్వామ్యాన్ని ఎక్కడైనా చూశామా!!!
మోదీ ఇంటిపేరు ఉన్నవారిలోనే దొంగలెందుకున్నారనే అర్థంలో రాహుల్ గాంధీ మాట్లాడింది తప్పే; కనీసమైన రాజకీయ ఇంగితం కూడా లేని వాచాలత. ఈ తొందరపాటుకు క్షమాపణ చెప్పడానికి అహం అడ్డురావలసిన అవసరం లేదు. ఆ మాట తప్పును ఎత్తిచూపి గర్హించడమే ఆయనకు నిజమైన శిక్ష. ఒప్పైన మాటలను అన్నివైపులనుంచీ బిగ్గరగా మాట్లాడుతూ తప్పుడు గొంతు వినిపించకుండా చేయడమే అసలైన పరిష్కారం. సాంప్రదాయికంగా నాగరికసభ్యసమాజాలు అనుసరిస్తున్న పద్ధతి అదే. మన పురాణ ఇతిహాసాల్లో ఎక్కడా తప్పుడు మాటలు మాట్లాడినవారిని శిక్షించిన ఉదాహరణ ఒక్కటీ స్ఫురించడం లేదు. చంపడమో, నాలుక తెగ్గోయడమో వంటి ఆటవికన్యాయం అమలు చేసి ఉంటే అది వేరు; ఇక్కడ అంటున్నది, సభ్యసమాజం ఆమోదించే సాధారణన్యాయసూత్రాలను అనుసరించి విధించే శిక్ష గురించి!
ఇందుకు పూర్తి భిన్నంగా, తన రాజ్యంలోని ఒక పౌరుడు ఒక తప్పుడు మాట అన్నందుకు అతన్ని కాక; తనను, తన అర్ధాంగిని శిక్షించుకున్న రామాయణ ఉదాహరణ ఒకటి కనిపిస్తుంది.
రాహుల్ గాంధీ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో విదేశీయుల ముందు మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం అంతరించిందనీ, పార్లమెంటులో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారనీ అనడమూ తప్పే. ఆ తప్పును ఎత్తి చూపి గర్హించడం, మందలించడం, ఆయనే తన పొరపాటు తెలుసుకునేలా చేయడమే దానికి సిసలైన శిక్ష. ఎప్పుడైనా ఎక్కడైనా ఒప్పు అనేది తన తిరుగులేని నైతికాధికారాన్ని స్థాపించుకుంటూ తప్పును ఏకాకిని చేసి బలహీనపరచడమే నాగరికసమాజామోదం పొందే ఏకైకమార్గం.
రాహుల్ కేంబ్రిడ్జి ఉపన్యాసాన్ని పురస్కరించుకుని, ఆయనను లోక్ సభ సభ్యత్వానికి అనర్హుణ్ణి చేయాలని అధికారపక్ష సభ్యులు డిమాండ్ చేయడం, ఆ కారణంతోనే తమవైపునుంచి రోజులతరబడి పార్లమెంటును స్తంభింపజేయడం చూశాం. అదే జరగబోతున్నదా అన్న అనుమానం అప్పుడే కలిగింది; వేరే కేసు వైపునుంచి చివరికి అదే జరిగింది. దీని వెనుక ఉన్న రాజకీయాన్ని అలా ఉంచుదాం. ఆ కేసులో ఎంత పస ఉంది; అదానీ వ్యవహారంలో మోదీప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఒంటరి సైనికుడిలా అదే పనిగా విమర్శల దాడి చేస్తున్న సమయంలోనే ఆ కేసు హఠాత్తుగా తెర మీదికి వచ్చి శిక్షవిధింపు వరకూ వెళ్ళడంలోని మర్మమేమిటి; లోక్ సభ సభ్యత్వానికి అనర్హుణ్ణి చేసేమేరకు గరిష్ఠశిక్ష వేయవలసినంత తీవ్రత ఆ తప్పులో ఉందా అంటూ జరుగుతున్న చర్చను కూడా అలా ఉంచుదాం. తప్పుడు మాటకే శిక్షించడం మొదలుపెడితే ఇప్పటికే ఎంతమంది నాయకులతో జైళ్ళు కిక్కిరిసి ఉండేవి? స్వతంత్రభారతంలో అలాంటి కేసులు పర్వతప్రమాణానికి ఎలా పెరిగి ఉండేవి?
***
నాకు తెలిసినంతవరకు విదేశీ గడ్డమీద నిలబడి స్వదేశంలోని ప్రతిపక్షాలపై విమర్శలు చేసి నిర్ఘాంతపరచిన మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోదీయే. అది ప్రవాసభారతీయుల ముందు చేసిన విమర్శలే కానీ, విదేశీయుల ముందు చేసినవి కావన్నది కేవలం కుతర్కం మాత్రమే. అయినాసరే, మోదీ వైఖరిని విమర్శించడమే జరిగింది తప్ప అదో కేసుగా మారి చర్యవరకూ వెళ్ళలేదు.
2002లో గుజరాత్ లో జరిగిన ఊచకోతను పురస్కరించుకుని, కారు కింద కుక్కపిల్ల చనిపోయినా బాధపడతామని నరేంద్ర మోదీ ఒక మతంవారిని ఉద్దేశించి అనడం కూడా విమర్శలకు గురైంది తప్ప అదో పరువునష్టం కేసుగా మారి చర్యవరకూ వెళ్లలేదు.
బీజీపీలో కార్యకర్తలు మొదలుకొని అగ్రనాయకుల వరకూ అనేకమంది రాహుల్ గాంధీని ‘పప్పు’ వంటి మాటలతో వ్యక్తిగతంగా అవమానించడం, చిన్నబుచ్చడం; ఆయన విదేశీయాత్రలను ఎద్దేవా చేయడం గత తొమ్మిదేళ్లుగా నిరంతరం చూస్తూ ఉన్నదే. కానీ అవి పరువునష్టం కేసుగా మారి చర్యవరకూ వెళ్లలేదు.
మోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జనరల్ వి. కె. సింగ్ ‘ప్రాస్టిట్యూట్స్’ అనే అర్థంలో పాత్రికేయులను ఉద్దేశించి ‘ప్రెస్టిట్యూట్స్’ అన్నప్పుడు కూడా విమర్శలు వెల్లువెత్తాయి తప్ప, అది పరువునష్టం కేసుగా మారి చర్యవరకూ వెళ్లలేదు. తప్పుడు మాటకు ఎదురయ్యే ప్రతికూలతను చవిచూసి, బహుశా గుణపాఠం నేర్చుకుని ఆయనే క్షమాపణ చెప్పుకున్నారు.
కొన్నేళ్ళ క్రితం జె.ఎన్.యూ కేంద్రంగా ఢిల్లీలో గొడవలు జరిగినప్పుడు మోదీ మంత్రివర్గసభ్యుడు అనురాగ్ ఠాకూర్ ‘గోలీ మారో సాలోంకో’ అంటూ పబ్లిగ్గా పదేపదే ఇచ్చిన పిలుపు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతూనే ఉంది. బాధ్యతాయుత పదవిలో ఉన్న ఒక వ్యక్తి హింసను ప్రేరేపిస్తూ ఇచ్చిన ఆ పిలుపు కేసుగా మారి చర్యదాకా వెళ్లలేదు. ఆయన మంత్రిపదవిలో కొనసాగుతూనే ఉన్నారు.
‘మనలో జాతివివక్ష ఉంటే నల్లవారైన దక్షిణభారతీయులతో ఎలా సహజీవనం చేస్తా’మంటూ ఆర్.ఎస్.ఎస్. పత్రిక పాంచజన్య మాజీ సంపాదకుడు, అప్పటికి రాజ్యసభ సభ్యుడు అయిన తరుణ్ విజయ్ దక్షిణభారతీయుల రంగును ఎత్తిచూపడం కూడా పరువునష్టం కేసుగా మారి చర్యకు దారి తీయలేదు.
***
మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న! తప్పుడు మాటకు కేసుపెట్టి శిక్షించడమే ప్రారంభిస్తే అది ఎక్కడి దాకా వెడుతుంది, ఎక్కడ ఆగుతుంది; ఎంతోమంది తప్పుడు మాటల్ని ఉపేక్షించి కొందరినే కేసులకు, శిక్షలకు గురి చేయడం పాక్షికతను పట్టిచూపి నీతి, న్యాయం గురించిన సార్వత్రికభావనకు ఎలాంటి నష్టం కలిగిస్తుంది?!
రాజకీయాల్లో ఉన్నవారే కాదు, ఏ రంగంలో ఉన్నవారైనా బాధ్యతాయుతంగా సభ్యంగా సంస్కారవంతంగా మాట్లాడవలసిందే. అలాగని ఇంత పెద్ద జనాభా ఉన్న ఒక ప్రజాస్వామికదేశంలో ఔచిత్యపు హద్దుమీరి మాట్లాడే ప్రతి మాటనూ కేసుగా మార్చి న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టగలమా? అది ఆచరణీయం కాకపోగా మాట చుట్టూ కత్తుల బోను నిర్మించి చివరికి ప్రజాస్వామికమైన మాటస్వేచ్ఛనే హుళక్కి చేసేవరకూ వెడుతుంది. తప్పుడు మాటలు ప్రజాస్వామ్యానికి మనం చెల్లించవలసిన మూల్యాలలో ఒకటి. ఒప్పుడు మాటలతో వాటి గొంతు వినిపించకుండా చేయడమే దీనికి ఆచరణీయ పరిష్కారం.
పరువునష్టం దావాలకు గల అవకాశాన్ని మొత్తంగా ఎత్తేయమని చెప్పడం లేదు. వ్యక్తిగతమైన దూషణలు, వ్యక్తుల శీలహననానికి దారితీసే ఆరోపణలు, అభియోగాల సందర్భంలో న్యాయం పొందే అవకాశం వ్యక్తులకు ఉండవలసిందే. అయితే ప్రజాస్వామ్యంతో నేరుగా ముడిపడిన రాజకీయాల్లో ఇలాంటి కేసులు ఎక్సెప్షన్ గా ఉండాలి తప్ప రూల్ కాకూడదు.
25 మార్చి 2023