భగవద్గీత – 56
నేను విశ్వరూపము చూడాలి. ఎట్లా? సరే ఆయనను ధ్యానిస్తాను.
ఎవరాయన? పటములో కనపడే కృష్ణుడు.
ఆయన రూపము ఇలా ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఎన్ని వేల సంవత్సరాలు ధ్యానించినా విశ్వరూపము మనకు కనపడుతుందా? కనపడదు గాక కనపడదు.
నేను వేరు విశ్వరూపము వేరు అనే భావన మన మనస్సులో ఉన్నంతకాలము, మన నుండి వేరే అని అనుకున్నది మనకు కనపడదు.
Also read: కాలస్వరూపం
అన్నిజీవుల రూపములను అనుభవములోనికి తెచ్చుకొని అన్నీ నేనే అని అనుభవించగలిగితే, అది సంపూర్ణ దశ అప్పుడు, విశ్వముయొక్క రూపము నా యందే ఉన్నది అని అర్ధమవుతుంది. అదే విశ్వరూపదర్శనము…
అప్పుడు నేను వేరు, ఇతర జీవులు వేరు అనే భావన పూర్తిగా అదృశ్యమవుతుంది. అంతా ‘‘నేనే’’ అనగా జీవాత్మ పరమాత్మలో ఎల్లప్పుడూ లీనమయి ఉండే స్థితి. అప్పుడు ‘‘నా’’ పనులు ఏవీ ఉండవు అన్నీ ఆ పరమాత్మ చేసే కర్మలే…
`మత్కర్మకృత్` అప్పుడు అన్నిపనులు చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనే భావన నశిస్తుంది ….
చేసే పనియే ఆరాధన! That is, Work is worship state `మత్పరమః` అప్పుడు ప్రతిపని వెళ్ళే దిశ, అసలు ఆ పనులు ఉండేది కూడా పరమాత్మలోనే… ఆయనే లక్ష్యము ’’ దశదిశ’’ ఆయనే.
Also read: విశ్వరూప సందర్శనం
`మద్భక్తః` ఆయనే లక్ష్యమయినప్పుడు ఇతరములింక ఏముంటాయి!
అదే పరమభక్తి `నిర్వైరః`
అన్ని జీవులు, పదార్ధములు అన్నీ నాలోనే ఉన్నాయి అని అనుభవానికి తెచ్చుకున్నప్పుడు వైరమెక్కడ ఉంటుంది?…అది వేరు నేను వేరు అనే భావన ఉంటే వైరము ప్రబలుతుంది. ఒకటే అయినప్పుడు ఇంక వైరమెక్కడిది?
`సంగవర్జితః` ‘‘వేరు ’’ అయినప్పుడు పొందాలి అనే ఆసక్తి ఉంటుంది. ఒకటే అయినప్పుడు? ఆ ఆసక్తి అదృశ్యమవుతుంది.
మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః !
నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ !!
మత్కర్మకృత్ … మత్పరమః…మద్భక్తః … సంగవర్జితః
నిర్వైరః…సర్వభూతేషు … యః … సః… మాం … ఏతి … పాండవ పాండవ … అర్జునా, మత్కర్మకృత్ … నా కొరకు కర్మలు చేయువాడు, మత్పరమః … నాయందాసక్తి గలవాడు, మద్భక్తః … నాయందే భక్తి గలవాడు, సంగవర్జితః … సంగమును విడిచినవాడు, సర్వభూతేషు … సమస్త భూతములందును, నిర్వైరః… వైరము లేనివాడును, యః . .. ఎవడో, సః వాడు, మాం … నన్ను, ఏతి … పొందుచున్నాడు అర్జునా! కర్తవ్యకర్మలను అన్నింటిని నాకే అర్పించు వాడును, మత్పరాయణుడును, నాయందు భక్తిశ్రద్ధలు గలవాడును, ప్రాపంచిక విషయములయందు ఆసక్తిలేని వాడును, ఏ ప్రాణియందును ఏమాత్రము వైరభావము లేనివాడును ఐన పరమ భక్తుడు మాత్రమే నన్ను పొందుచున్నాడు. భగవంతుడు నానుండి వేరుకాదు అనే భావన మన అనుభవములోకి వచ్చినప్పుడు మాత్రమే ఇవి సాధ్యమవుతాయి…
Also read: మోహం తొలగించుకోవడం ఎలా?