పవన్ కళ్యాణ్
- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసేన అధినేత
- ఆలయాల రక్షణపై ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని పవన్ డిమాండ్
- సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్
- ఆర్భాటమే తప్ప చిత్తశుద్ధి లేదని వ్యాఖ్య
ఏపీలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ఈ రోజు ఛలో రామతీర్థానికి మరోసారి పిలుపునిచ్చిన బీజేపీ జనసేనలు దాడులపై ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఆలయాల ఆస్తులు, విగ్రహాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్పష్టత లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దాడులపై ప్రభుత్వ వైఖరేంటో బహిరంగ ప్రకటన చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
బాధ్యతలనుంచి తప్పుకుంటున్న ప్రభుత్వం:
అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటన తర్వాత రాష్ట్రంలోని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని పవన్ గుర్తు చేశారు. అయితే ఇటీవల రామతీర్థం ఘటన తరువాత కూడా ప్రభుత్వం అదేమాట వల్లెవేస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. దేవాదాయశాఖ పరిధిలో 26 వేల ఆలయాలు ఉండగా ఎన్ని ఆలయాలలో సీసీకెమెరాలు అమర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధూప దీప నైవేద్యాలకు నిధులివ్వని ప్రభుత్వం సీసీ కెమెరాల బాధ్యత ఆలయాలదేనని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం తన బాధ్యతలనుంచి తప్పుకునేందుకు సాకులు చెబుతోందని పవన్ విమర్శించారు.
ఇది చదవండి: ప్రజల్లోకి పవన్ కల్యాణ్
ఆలయాల పరిరక్షణపై శ్రద్ధ పెట్టాలని సూచన:
ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వచ్చే కమిషన్ ల మీద ఉన్న శ్రద్ధ ఆలయాల పరిరక్షణపై లేదని పవన్ మండిపడ్డారు. ప్రభుత్వాని దంతా ప్రచార ఆర్బాటమే తప్ప పనుల్లో చిత్తశుద్ధి లేదని పవన్ ఆరోపించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం శ్రద్ధ చూపాలని సూచించారు ఆధునిక సాంకేతికతతో కూడిన కెమెరాలను అమర్చడంతో పాటు వాటిని పర్యవేక్షించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలన్నారు. కాని పక్షంలో కేవలం ప్రకటనలు, ప్రచారం కోసం ప్రభుత్వం సీసీ కెమెరాల గురించి మాట్లాడుతోందని భావించాల్సిఉంటుందన్నారు.
ఇన్నాళ్లూ ఏం చేశారు?
గత ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాలను తిరిగి కడుతున్నామని చెపుతున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలలుంచి ఈ విషయం గుర్తుకు రాకపోవడం శోచనీయమన్నారు. ఆలయాల రక్షణ, పునర్నిర్మాణం పరిపాలనలో భాగమేనని హిందువుల కోసం ప్రత్యేకంగా ఏం చేయనక్కరలేదని పవన్ అన్నారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడుతూ అన్ని మతాల వారిని సమానంగా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైన ఉందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఇది చదవండి: తిరుపతిలో పోటీకి జనసేన సై?