- బీజేపీ జాతీయ నాయకత్వంపైన పవన్ కు పట్టు ఉన్నదా?
- చంద్రబాబునాయుడు ఎత్తుగడలు ఫలించి బీజేపీతో పొత్తు కుదురుతుందా?
- వైఎస్ఆర్ సీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేయాలన్న సంకల్పం నెరవేరుతుందా?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైంది. సంవత్సరంలోపే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ తన వ్యూహ ప్రతివ్యూహ రచనలో మునిగితేలుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు తమ కత్తులకు మరింత పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా జనసేన అధినేత పొత్తులపై తన వైఖరిని స్పష్టం చేశారు. టీడీపి – బిజెపి – జనసేన కలిసి నడిచే దిశగా తన ప్రయత్నాలు తీవ్రంగా ఉంటాయని వ్యాఖ్యనించారు. పొత్తుకు ఇష్టం చూపనివారిని ఎలాగైనా ఒప్పిస్తానని చెబుతున్నారు. ఈ సారి ఓట్లు చీలకుండా చూసి జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని శపథం చేస్తున్నారు. జనసేన ఓటుబ్యాంక్ 7 శాతం నుంచి 30 శాతానికి పెరిగిపోయిందని చెబుతున్నారు. వైసీపీకి అధికారాన్ని దూరం చేయడంలో మేమూ ముందుంటామని వామపక్షాలు అంటున్నాయి. ఎవరెవరు ఏకమైనా, ఎన్ని పార్టీలు కలిసి సాగినా తాము ఒంటరిగానే నిలబడతామని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి చెబుతున్న మాట. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు వస్తాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ డిసెంబర్ లోనే ఎన్నికలు ఉంటాయని పవన్ కల్యాణ్ అంటున్నారు. తెలుగుదేశం కూడా అదే పల్లవి అందుకుంది. అధికార వైసీపీ మాత్రం ఇంతవరకూ ఈ విషయంపై తన వైఖరిని వెల్లడించలేదు.2024లో గతాన్ని మించిన గెలుపును సాధిస్తామనే విశ్వాసాన్ని జగన్ ప్రకటిస్తూనే ఉన్నారు. ఇంటింటికి స్టిక్కర్స్, గడప గడపకు, జగనన్నకు చెబుదాం వంటి అనేక రూపాల్లో ప్రజల్లోకి వెళ్తూ ఓటుబ్యాంక్ ను పదిలపరుచుకొనే దిశగా అధికార పార్టీ ముందుకు సాగుతోంది. ఇక పొత్తుల విషయంలో బిజెపి తన నిర్ణయాన్ని ఇంతవరకూ వ్యక్తం చెయ్యలేదు.
Also read: భారాస భవిష్యత్తు ఎమిటి?
బీజేపీలో టీడీపీ అనుకూల, ప్రతికూల వర్గాలు
టీడీపీకి అనుకూలంగా, వ్యతిరేకంగా రెండు వర్గాలు బిజెపిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు, బంధాలు ఎట్లా ఉన్నా నిర్ణయాధికారం మాత్రం దిల్లీ పెద్దల చేతుల్లోనే ఉంటుందన్నది కాదనలేని వాస్తవం. 2019 ఎన్నికలకు ఒక సంవత్సరం ముందుగానే బీజీపీ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చిందన్న విషయం తెలిసిందే. కాకపోతే, బయటకు వచ్చిన తర్వాత కేంద్రంపై, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, దేశ వ్యాప్తంగా చేసిన పోరాటం చరిత్ర విదితం. దీనితో నరేంద్రమోదీ – చంద్రబాబు మధ్య దూరం బాగా పెరిగిపోయింది. 2019లో నరేంద్రమోదీ అధికారాన్ని మరోమారు చేపట్టారు. చంద్రబాబునాయుడు ఘోరమైన ఫలితాలతో ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయారు. అటు తెలంగాణలోనూ -ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ తనకు ఏమాత్రం ఇష్టంలేని కేసీఆర్, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార పీఠాలను కైవసం చేసుకున్నారు. అట్లా అటు దేశ రాజధానిలోనూ -ఇటు తెలుగురాష్ట్రాలలోనూ తనకు పూర్తి వ్యతిరేక వర్గం చేతుల్లోకి అధికారం వెళ్లిపోయింది. 2019లో ఘోర ఫలితాల తర్వాత చంద్రబాబు తన వ్యూహాన్ని మళ్ళీ మార్చుకున్నారు. నరేంద్రమోదీకి మళ్ళీ దగ్గరవడం కోసం శతవిధాలా ప్రయత్నాలు మొదలెట్టారు. ముందుగా తమ పార్టీకి చెందినవారు, తనకు అత్యంత అనుకూలురైన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి రాజ్యసభ సభ్యులను టీడీపీ నుంచి బీజీపీకి పంపడంలో తెరవెనుక పాత్ర పోషించారనే ప్రచారం పెద్దఎత్తునే వచ్చింది.
Also read: విపక్షాలఐక్యత సంభవమేనా?
జనసేన అధినేత విన్యాసాలు
ఆ తర్వాత, తనకు అనుకూలుడుగా ప్రచారంలో వున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బిజెపితో పొత్తు పెట్టుకొనేలా చంద్రబాబు దిశానిర్దేశం చేశారన్నది మరో ప్రచారం. మొత్తంమీద నరేంద్రమోదీకి మళ్ళీ దగ్గరవడం కోసం చంద్రబాబు వీరప్రయత్నాలు చేస్తున్నారన్నది ప్రధానంగా ప్రచారంలో ఉన్న అంశం. 2019లో అనూహ్యమైన గెలుపును సాధించుకొని ముందుకు సాగడమే కాక, ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో జగన్ మోహన్ రెడ్డి సఖ్యంగా సాగుతుండడం కూడా చంద్రబాబుకు మింగుడుపడని అంశం. 2024లో ఎలాగైనా జగన్ ను గద్దె దింపి తీరాలన్నది ప్రధాన సంకల్పం. దాని కోసం ఎంతమందినైనా కలుపుకొని ముందుకు వెళ్లడమే కాక, జగన్ – మోదీ బంధాన్ని తెగ్గొట్టాలన్నది మరో వ్యూహం. 2024కు చంద్రబాబు వయసు దాదాపు 75కు చేరుకుంటుంది. ఈ లోపు కుమారుడు లోకేష్ ను ముఖ్య భూమికపై చూడాలని పుత్ర వాత్సల్యంతో కూడిన ప్రగాఢ కాంక్ష. జనసేన స్థాపించి రాజకీయాల్లోకి వచ్చినందుకు తన సత్తాను చాటుకోవాలన్నది పవన్ కల్యాణ్ కాంక్ష. ముఖ్యమంత్రి పదవిపై ఆశలేని వారు ఎవరుంటారు? మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే తాము ఆశించిన ప్రయోజనాలు నెరవేరవన్నది చంద్రబాబు, పవన్ ఇద్దరి భయం.
Also read: తుక్కుతుక్కుగా ‘ఉక్కు’ రాజకీయం
విజయభేరి మోగిస్తారా?
ఆంధ్రప్రదేశ్ లో తమ ఉనికిని చాటుకోవాలన్నది బీజీపీ వ్యూహం. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజీపీలో చేరారు. ఆయన కార్యక్షేత్రం, విధులు తేలాల్సివుంది. క్షేత్ర వాస్తవాలను పరిశీలిస్తే జనసేన ఇంకా పటిష్ఠం కాలేదనే చెప్పాలి. చీలిపోయిన ఓటు బ్యాంక్, చెదరిపోయిన క్యాడర్ ను వెనక్కు తెచ్చుకోవడం టీడీపీ ఎదురుగా ఉన్న సవాళ్లు. 10ఏళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత రాకుండా చూసుకోవడం, అసంతృప్తుల నుంచి నష్టం కలగకుండా ఉండడం అధికార వైసీపీకి సవాళ్లుగా నిలిచే అంశాలు. మొత్తంగా చూస్తే ఇంతవరకు టీడీపి -జనసేన – బిజెపి పొత్తుపై స్పష్టత లేదు. దిల్లీ పెద్దలను ఒప్పించేంత శక్తి పవన్ కల్యాణ్ కు ఏ మేరకు ఉందో చూడాలి. ఈ దిశగా చంద్రబాబు చక్రం ఎలా తిప్పుతారో తేలాలి. పొత్తుల కత్తుల సవ్వడి విజయభేరి మోగిస్తుందా, ఒట్టి శబ్దాలకే పరిమితమవుతుందా తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. ఎవరు అతి విశ్వాసంగా ఉన్నా మూల్యం చెల్లించక తప్పదు.
Also read: ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణం