Sunday, December 22, 2024

వీరవిధేయుడు విజేత కాగలరా?

  • మల్లికార్జున ఖడ్గే అనుభవం అక్కరకు వస్తుందా?
  • గాంధీ కుటుంబం ఖడ్గేకు స్వేచ్ఛనిస్తుందా?
  • కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయా?

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చేశారు. అందరూ ముందుగా ఊహించినట్లుగానే గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన మల్లికార్జున ఖడ్గే మంచి మెజారిటీతో గెలుపొందారు. ఈ గెలుపు వెనక అధిష్ఠానం హస్తం ఉందన్నది జగమెరిగిన సత్యం. అధిష్ఠానం అంటే గాంధీ కుటుంబమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోటీగా దిగి ఓడిపోయిన శశిథరూర్ కు 1000పైగా ఓట్లు వచ్చాయి. ఇది కూడా గమనించాల్సిన అంశమే. గాంధీ కుటుంబ పాలనలో నడుస్తున్న పార్టీపై బహిరంగంగానే చాలామంది తమ వ్యతిరేక స్వరాన్ని వినిపించారు. లేఖాస్త్రాలను సంధించారు. జీ 23 గా దీనికి పేరు వచ్చింది. ఈ సంఖ్య కేవలం 23 కాదని చాలామంది ఉన్నారని చెప్పుకున్నారు. అంతర్గత విభేదాలు ఎలా ఉన్నా మొత్తంమీద పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎంచుకున్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని చాటి చెప్పడానికి, గాంధీ కుటుంబం పెత్తనం ముద్ర పోగొట్టుకోడానికి అన్నట్లుగా ఈ ఎన్నికల తంతు పెట్టారు. ఈ ఎంపిక ప్రక్రియ పెద్ద నాటకమని  ఎక్కువమందికి తెలుసు. అధ్యక్ష స్థానంలో అధికారికంగా ఎవరు కుర్చీలో కూర్చున్నా తెరవెనక చక్రం తిప్పేది ముఖ్యంగా సోనియాగాంధీయే అన్నది ఎక్కువగా వినపడే మాట. దేశవ్యాప్తంగా కుదేలైన కాంగ్రెస్ పార్టీకి కేవలం కొత్త అధ్యక్షుడి ఎంపికతో జవజీవాలు వస్తాయన్నది ఒట్టి మాట. కొత్త నెత్తురును ఎక్కించాలి. మంచో చెడో, తప్పో ఒప్పో ఇప్పటికీ ప్రభావశక్తి కలిగిన వ్యక్తులు రాహుల్ గాంధీ,  ప్రియాంక గాంధీ అన్నది వాస్తవం.

Also read: శేషేంద్ర కవీంద్రుడు

గాంధీ కుటుంబం పట్ల ఆరాధనాభావం

2014 నుంచి ఇప్పటి వరకూ వారి ప్రభావం ఎన్నికల ఫలితాల్లో ప్రతిస్పందించకపోయినా, సంప్రదాయ ఓట్ బ్యాంకులో ఎక్కువమంది ఆరాధించేది గాంధీ కుటుంబాన్నే అన్నది నిర్వివాదాంశం. సోనియాగాంధీకి వయసు మీద పడుతోంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఆ పార్టీకి దిక్సూచీలుగా కనిపిస్తున్నది ఆ అక్కా తమ్ముళ్ళే. తమ్ముడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో నడక మొదలు పెట్టాడు. స్పందన బాగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ ప్రభావం కచ్చితంగా ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడే చెప్పలేం. రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు. గతంలో కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకొనే అవకాశాలు ఉంటాయని ప్రత్యర్థి పార్టీ నేతలు సైతం కొందరు రహస్య సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో అంతర్గతంగా చాలా విభేదాలు ఉన్నాయి. నాయకుల మధ్య అంతరాలు ఉన్నాయి. తరాల అంతరాలు కూడా ఉన్నాయి. పాత తరం కంటే కొత్త తరం సంఖ్య తక్కువే అయినా  వారి మద్దతు రాహుల్ వైపే ఉంది. పదవులకు,విలాసాలకు, అధికారంలో ఉండడం వల్ల ఒనగూరే ప్రయోజనాలకు నేతలు దూరమై ఎనిమిదేళ్లు అయిపొయింది. ఎన్నికల సమయానికి 10 ఏళ్ళు పూర్తి కానుంది. బిజెపి ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దింపాలనే ఆలోచన కాంగ్రెస్ తో పాటు మిగిలిన ప్రతిపక్షాలకు కూడా ఉంది.

Also read: భారత్ కు ఐఎంఎఫ్ తీపి కబురు

ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్ళు

కాకపోతే, వీరి మధ్య ఐక్యతే ప్రశ్నార్ధకం. అన్ని తరాల నేతల మధ్య నెలకొన్న అంతరాలను చెరపేస్తానని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తామని, పార్టీకి కొత్త నెత్తురు ఎక్కిస్తానని కొత్త అధ్యక్షుడు ఖర్గే అంటున్నారు. పార్టీలో కీలకమైన నిర్ణయాలన్నీ సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే చూసుకుంటారని అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఖర్గే గెలుపు కచ్చితమనే సంకేతాన్ని ఇవ్వడమే గాక, సోనియాగాంధీ పాత్ర బలంగా ఉంటుందని రాహుల్ మాటల ద్వారా అర్ధమవుతోంది. వివాదరహితుడు, గాంధీ కుటుంబానికి వీర విధేయుడు అని పేరున్న ఖడ్గే తన సమర్ధతను చాటి చెప్పాల్సి వుంది. ఒక్క కర్ణాటకలో తప్ప దక్షిణాదిలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని మరమ్మత్తులు చేసినా పార్టీ పైకి లేచేనా? అనిపిస్తోంది. ఈ ఎనిమిదేళ్లలో కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల పార్టీ భారీ మూల్యం చెల్లించింది. తెలంగాణలో నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు బలంగానే ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ కు శత్రువులుగా కనిపిస్తున్నారు. పిచ్చి పిచ్చి నిర్ణయాల వల్ల పంజాబ్ లో కూడా అధికారాన్ని కోల్పోయారు. చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరిలోనూ చేతులెత్తేశారు. కాంగ్రెస్ వైఫల్యాలకు సంబంధించి అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. మల్లికార్జున ఖడ్గే సీనియర్ నాయకుడు, సౌమ్యుడు, రాజకీయ అనుభవం కలిగి ఉన్నవాడు. పార్టీని పూర్తిగా నమ్ముకొని పార్టీతో ప్రయాణం చేసినవాడు. కాకపోతే 80ఏళ్ళ వృద్ధుడు. 1000 ఓట్లు గెలుచుకున్న శశిథరూర్ ను తక్కువ అంచనా వెయ్యరాదు. సార్వత్రిక ఎన్నికల కంటే ముందు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. వాటిల్లో ఖడ్గే సొంత రాష్ట్రమైన కర్ణాటక కూడా ఉంది. ఇంటగెలిచి తానేంటో చూపించాల్సిన పెద్దబరువు ఆయనపై వుంది. పార్టీని దేశ వ్యాప్తంగా బూత్ స్థాయి నుంచి ప్రక్షాళన చేయాల్సివుంది. పార్టీలో నిరుత్సాహంతో మగ్గుతున్న శ్రేణులకు భవిష్యత్తుపై భరోసా కలిపించాల్సివుంది. విపక్షాలను ఒకతాటిపై తేవాల్సి వుంది. పార్టీ నుంచి దూరమైన నేతలను తిరిగి పార్టీలో చేరేలా చూడాల్సి వుంది. దేశ ప్రజల్లో పార్టీ పట్ల, నాయకత్వం పట్ల పోయిన నమ్మకాన్ని తిరిగి రాబట్టాల్సి వుంది. ఇలా ఎన్నో సవాళ్ళను కొత్త అధ్యక్షుడు ఎదుర్కోవాల్సి వుంది.

Also read: భారత్ ఆకలి రాజ్యమా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles