Thursday, November 21, 2024

కాంగ్రెస్ కు కాయకల్పచికిత్స జరిగేనా?

  • చేసిన తప్పులే చేస్తూ, పడుతూ, లేస్తూ ఎంతకాలం?
  • సంస్థాగత  ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?

“అయ్యవారు ఏంచేస్తున్నారంటే … రాస్తున్నారు… తుడుచుకుంటున్నారు” అనే నానుడి ఒకప్పుడు ప్రసిద్ధంగా వినపడేది. జాతీయ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లాగే ఉంది. దిద్దుబాటు చర్యలు చేపడుతున్నామంటూ ప్రచారం మాత్రం జరుగుతోంది. దిద్దుకోక పోగా,కొత్త తప్పులు చేసుకుంటూ వెళ్తోంది.

Also read: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఎన్నో గుణపాఠాలు

లెక్కలేనన్ని తప్పటడుగులు

ఈ ఎనిమిదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ వేసినన్ని తప్పటడుగులు ఏ పార్టీ వెయ్యలేదు. గతంలో ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు మొదలు, నిన్నటి పాండిచ్చేరి నుంచి నేటి పంజాబ్ ఎన్నికల వరకూ చెప్పాలంటే. ఆ తప్పులపట్టిక చాలా పెద్దది. ఈ మాటలన్నంటున్నది మిగిలిన పార్టీలో, మీడియానో కాదు, స్వపక్ష సభ్యులే పదే పదే చెబుతున్నారు. ప్రక్షాళన చేపట్టండంటూ మొత్తుకుంటున్నారు. వాళ్లంతా కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. ఆ సభ్యుల సంఖ్య 23. వాళ్లు సాదాసీదా సభ్యులు కారు. అందరూ కీలకమైన నేతలే. ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత తాజాగా భేటీ అయ్యారు. మళ్ళీ అదే స్వరాన్ని వినిపించారు. ఆదివారం నాడు దిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. మరింతకాలం పాటు సోనియాగాంధీనే పార్టీకి తాత్కాలిక అధినేత అంటూ ప్రకటించారు. “మాకందరికీ నాయకత్వం వహించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుంటారు. ఆమె నాయకత్వంపై పార్టీలో అంతటి నమ్మకం ఉంది. అందుకే పార్టీనేతలంతా సోనియా గాంధీకే మొగ్గు చూపారు” అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖడ్గే సీడబ్ల్యూసీ అనంతరం మాట్లాడారు. ఈ తరహా ప్రకటన ఇదే మొదటి కాదు. ఎన్నోసార్లు ఇలాగే చెప్పారు, దాని ఫలితం అనుభవిస్తున్నారని దిల్లీకి చెందిన సీనియర్ పాత్రికేయులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజమే, ముగ్గురు గాంధీలు కలిసి ఇప్పటికే కాంగ్రెస్ ను ముంచేశారు. ఈ ఎనిమిదేళ్ల ఫలితాలే దానికి అద్దం పడుతున్నాయి. సంస్థాగత ఎన్నికలే ఇంతవరకూ జరుగలేదు. ఈ రోజు  రేపు అంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. తాజాగా జరిగిన టీమ్ -23 సమావేశంలోనూ, సంస్థాగత ఎన్నికలు అనుకున్న షెడ్యూల్ కంటే ముందే జరిపించండని డిమాండ్ చేశారు. ఆ దిశగా అధిష్టానం ఏమి చెయ్యబోతుందో ఇంకా స్పష్టత రాలేదు.  మరి కొన్ని నెలల్లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అప్పటికైనా ఈ ప్రక్రియ ముగుస్తుందా అన్నది అనుమానమే.

Also read: భారత్ పై అమెరికా ఆంక్షల భారమా?

గాంధీత్రయం తప్పుకుంటుందా?

‘గాంధీ త్రయం’ తప్పుకుంటే కానీ ఆ పార్టీ బాగుపడదని ఎక్కువశాతం రాజకీయ పండితుల అభిప్రాయం. కానీ, గాంధీలు రాజీనామా చేస్తారనే ప్రచారానికి  నేడు తెరపడింది. వాళ్ళ ఏలుబడిలోనే సాగాలన్నది ఏలినవారి అభిమతంగా కనిపిస్తోంది. ఈ త్రయాన్ని పక్కనబెట్టి కొత్తవారికి పార్టీ పగ్గాలను అప్పగించితే ఆ పార్టీకి కనీస మర్యాద మిగులుతుందని వారి అభిప్రాయం కావచ్చు. గులాంనబీ, శశిథరూర్ వంటి పేర్లను కొందరు సూచిస్తున్నారు. శశిథరూర్ దక్షిణాదికి చెందిన నాయకుడు. విద్యాధికుడు. గులాంనబీ కాకలు తీరిన చతురుడు. పార్టీ గురించి వీళ్ళు గట్టిగా తమ వాణిని వినిపిస్తూనే ఉన్నారు. ఇంతకూ గులాం నబీ పార్టీలో ఉంటారా? నరేంద్రమోదీ ఒత్తిడితో రాజకీయాలు వదిలేసి, రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగుతారా ఇంకా తెలియాల్సివుంది.  అదే నిజమైతే, కాంగ్రెస్ పార్టీ మరింత సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉంది. వ్యవస్థాగతంగా క్షేత్రస్థాయిలో పార్టీ ఇంకా చచ్చిపోలేదు. క్యాడర్ ఉంది. దేశవ్యాప్తంగా గెలిచిన సభ్యులు ఉన్నారు. ఇంకా ఛత్తీస్ గడ్, రాజస్థాన్ లో పార్టీ అధికారంలో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కొంత పట్టు ఇంకా మిగిలే వుంది. ఇప్పటికైనా మేలుకోవాలి. సీనియర్ సభ్యుల మాటలకు విలువనివ్వాలి.  క్షేత్ర వాస్తవాలను గ్రహించాలి. ఇప్పటి వరకూ రుచిచూసిన చేదు అనుభవాలు, వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. పార్టీ పట్ల చెదిరిపోయిన విశ్వాసాన్ని తిరిగి తెచ్చుకొనే విధంగా అడుగులు వెయ్యాలి. ప్రజలకు దగ్గరవ్వాలి. అన్నింటికంటే ముందుగా, రాబోయే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆశావహమైన ఫలితాలు రాబట్టుకొని, పరువు నిలబెట్టుకోవాలి. క్షేత్రస్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చెయ్యాలి. మరో ఫ్రంట్ నిర్మాణం నిజంగా జరిగితే, అందులో అధినాయకత్వం సంగతి ఎలా ఉన్నా, కనీసం  పార్టీని భాగస్వామ్యంలోకి ఆహ్వానించే పరిస్థితినైనా తెచ్చుకోవాలి. గెలుపుఓటములు సహజం. వివేకంగా,ఆచరణాత్మకంగా నడిస్తే కాంగ్రెస్ కనీసం బతికి బట్టకడుతుంది.

Also read: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్న ఉక్రెయిన్ – రష్యా యుద్ధం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles