Sunday, December 22, 2024

విశాఖ ఉక్కుపై పునరాలోచన చేయరా?

  • ఎన్నికలున్న రాష్ట్రాలలోనే యూటర్న్ తీసుకుంటారా?
  • ప్రైవేటుపరం చేకుండా కర్మాగారాన్ని నడపలేరా?
  • రాజకీయ పార్టీలు రాజీ మార్గాన్ని వదిలిపెట్టవా?

దేశంలోని పలు రాష్ట్రాల్లో,ముఖ్యంగా కీలకమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, గెలుపే ప్రధాన లక్ష్యంగా బిజెపి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఆచి తూచి అడుగులు వేస్తోంది. ప్రతి సందర్భాన్నీ తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. వ్యతిరేకత పెరగకుండా చూసుకుంటోంది. అందులో భాగంగానే, వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకుంది. దేశాన్ని ఒక ఊపు ఊపిన రైతు సంఘాలు ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించాయి  కూడా.

Also read: నిష్క్రమించిన నిలువెత్తు తెలుగుదనం

అపూర్వమైన రైతు ఉద్యమం

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఈ స్థాయిలో రైతు ఉద్యమం జరగడం ఇదే తొలిసారిగా చరిత్రకెక్కింది. రైతుల భీషణ ప్రతినకు,ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇరు వర్గాల తీరుపై కొన్ని విమర్శలు చెలరేగినప్పటికీ, కథ సుఖాంతమైంది. ఆందోళనలు చేసిన వైనంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ, ఉద్యమం నడచిన తీరు సామాన్యమైంది కాదు. మోదీ ప్రభుత్వం నిర్ణయాలను వాపసు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువని పేరుకెక్కింది. ప్రజావ్యతిరేకత క్షేమంకరం కాదని తెలుసుకున్నప్పుడు పాలకులు వెనకడుగు వేయడం అభినందనీయం, వివేకభరితం. అదే స్ఫూర్తితో, ‘విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ’ను ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయాన్ని కూడా కేంద్రం విరమించుకుంటే మంచిపేరు మూటగట్టుకున్నట్లవుతుంది. రైతు సంఘాలు ఎంతటి మహోగ్రంగా ఉద్యమ రంగంలో నడిచాయో, అదే ప్రేరణను నింపుకొని తెలుగువారు కదంతొక్కితే  కేంద్రం దిగిరాక తప్పదు. ఎన్నికల్లో బలాబలాలు, గెలుపు ఓటములు ఎప్పటికీ ఒకే రీతిలో ఉండవు. ప్రజాబలమే శాశ్వతమైన బలం. జనం నుంచి తిరుగుబాటు రానంత వరకు మాత్రమే పాలకులు బలంగా ఉంటారు. ఆ సత్యం తెలుసుకున్నవారు మంచిపాలకులుగా మిగులుతారు. ఈరోజు రైతు ఉద్యమం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాము. ఇంతకంటే ఎన్నోరెట్లు శక్తివంతంగా, స్వచ్ఛంగా, సుదీర్ఘంగా ‘ విశాఖ ఉక్కు ఉద్యమం’ సాగింది. ‘ఉక్కు మహిళ’గా పేరుకెక్కిన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సైతం దిగిరాక తప్పలేదు. తెలుగువారి తడాఖా చూపించిన గొప్ప ఉద్యమం అది! ఇప్పటి బిజెపి నాయకుల వలె అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే, అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అందునా, ఇందిరాగాంధీ వంటి అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి ఏలికగా ఉన్నారు. ఇప్పుడు బిజెపి ఎంత బలంగా ఉందో, అప్పుడు కాంగ్రెస్ అంతే బలంగా ఉంది. కాకపోతే, అప్పుడు ఉద్యమాన్ని నడిపించిన నాయకులు నిష్కళంక దేశభక్తులు, ధీరోదాత్తులు, సచ్చరిత్రులు. కనుకనే, తెలుగవారంతా ఏకమై ఆ నేతల వెంట  కలసి నడిచారు. విద్యార్థులు, యువత వెల్లువెత్తి ఉద్యమాన్ని ఊర్రూతలూగించారు. ధన, మాన, ప్రాణాలు పోయినా లెక్క చెయ్యలేదు. అంతిమంగా ఉక్కుపరిశ్రమను విశాఖపట్నంలో స్థాపించేలా కేంద్రం మెడలు వంచారు. అంతటి ఘన చరిత్రకు ప్రతీక విశాఖ ఉక్కుఉద్యమం.

Also read: భారత్, రష్యాల చారిత్రక సంబంధాలు

రాజీ మార్గంలో రాజకీయ పార్టీలు, ప్రజాబలమే ప్రత్యామ్నాయం

ఇప్పుడు  ప్రైవేటుపరం కావడానికి అంతా సిద్ధమైంది. దానిని అడ్డుకోడానికి కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు నిరాఘాటంగా ఉద్యమం చేస్తూనే ఉన్నాయి. కానీ ఆ శక్తి సరిపోవడం లేదు. ఉద్యమాన్ని బలంగా నడిపే పరిస్థితిలో రాజకీయ పార్టీలు లేవన్నది చేదు నిజం. ప్రజాబలమే ప్రత్యామ్నాయం. తెలుగు ప్రాంతాలు రెండుగా విడిపోయినప్పటి నుంచీ, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు కష్టాలు పెరుగుతూ వస్తున్నాయి. ఉమ్మడి అంశాలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. విభజన హామీలు నెరవేరకపోగా, ఒక్కొక్కటీ వీగిపోతున్నాయి. అప్పులకుప్పగా తయారైన ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అందిస్తున్న సాయం అంతమాత్రమే. కొత్త పరిశ్రమల స్థాపన ఎలా ఉన్నా, మనుగడలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కదిలించకుండా ఉండడం కనీస మర్యాద. వీటిని ఏ మాత్రం పరిగణన లోనికి తీసుకోకుండా కేంద్రం ముందుకు వెళ్లడం అన్యాయమని మేధావులు మండిపడుతున్నారు. రైతు సంఘాల ప్రధాన నాయకులందరూ ఉక్కు పరిరక్షణకు మద్దతు పలికారు. రాకేష్ సింగ్ టికాయిత్ విశాఖపట్నం వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు. జాతీయ స్థాయి కార్మిక సంఘాల నేతలు కూడా సంఘీభావం తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక, కార్మిక సంఘాలు ఉద్యమస్ఫూర్తితోనే ముందుకు వెళ్తున్నాయి. ప్రైవేటుపరం చేయకుండా, యధాతధంగా నడపడానికి ఎన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయో, వాటన్నింటినీ నిపుణులు ఇప్పటికే తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికల రూపంలో  సమర్పించింది. ఇన్ని జరిగినా  కేంద్రంలో కదలిక రావడం లేదు. ఇప్పటికైనా మించి పోయింది లేదు. కేంద్రం పునరాలోచిస్తే మంచిది.

Also read: రోశయ్య జీవితం ఫలప్రదం, జయప్రదం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles