‘‘మట్టికీ, బంగారానికీ మధ్య ఎంతో భేదం ఉంది. కానీ, బ్రాహ్మణునికీ, చండాలునికీ మధ్య అటువంటి తేడా ఏమీ లేదు. ఎండు కట్టెలను రాపిడి చేస్తే అగ్ని పుట్టినట్టు బ్రాహ్మణుడు పుట్టలేదు. ఆకాశం లేదా గాలి నుండి బ్రాహ్మణులు ఊడిపడలేదు. భూమిని తొలుచుకొని పైకిరాలేదు. చండాలుడు ఒక స్త్రీగర్భం నుంచి పుట్టినట్టే బ్రాహ్మణులు కూడా పుట్టారు. మానవులందరికీ ఒకే రకమైన అవయవాలు ఉన్నాయి. వారి శరీర నిర్మాణంలో ఏ విధమైన భిన్నత్వం లేదు. అలాంటప్పుడు బ్రాహ్మణులను భిన్నమైన జాతిగా ఎందుకు చూడాలి? మనుషుల మధ్య అసమానతను పాటించడం ప్రకృతి విరుద్ధం’’ – ‘బౌద్ధం అంటే ఏమిటీ?’ గ్రంథ రచయిత ప్రొఫెసర్ పోకల లక్ష్మీనరసు – అంబేడ్కర్ ను ప్రభావితం చేసిన ఆధునిక బౌద్ధ ఉద్యమకారుడు.
ఏ సంస్కృతిలోనైనా పండుగలు, పర్వదినాలు జరుపుకోవాలంటే కేలండర్ అత్యవసరం. ప్రపంచంలో ఒక్కొక్క మతం ఒక్కొక్క కేలండర్ రూపొందించుకుంది. రోమన్ లు తమ కాలంలో రోమన్ కేలండర్ ఏర్పరచుకున్నారు. తర్వాత కాలంలో క్రీస్తు పుట్టిన తేదీని అనుసరించి కొంచెం అటూఇటుగా వాళ్ళు గ్రిగేరియన్ కేలండర్ వాడుకలోకి తెచ్చుకున్నారు. ఇస్లాం కూడా మహ్మద్ సమయాన్ని అనుసరించి మక్కా,మదీనాకు వెళ్ళడానికి అనుకూల సమయాలు నిర్ణయించుకున్నారు. అలాగే, భారత దేశంలో శక సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని, సాధారణ శకం 78 నుండి, అంటే బౌద్ధరాజు కనిష్కుడి కాలం నుండి బౌద్ధుల కేలండర్ వాడుకలోకి వచ్చింది. బుద్ధుడి కాలం నుండి ఉన్న యుగాబ్ది కేలండర్ ను బట్టి బౌద్ధదేశాలన్నీ తమ పండుగలు, పర్యదినాలు ఏర్పరచుకున్నాయి. కనిష్కుడు భారత దేశంలో బౌద్ధధమ్మాన్ని ప్రచారం చేసినప్పుడు ఈ శక సంవత్సరానికి చాలా ప్రాముఖ్యం పెరిగింది. పురాతన శిలాశాసనాలన్నింటిలో ఈ కేలండర్ ను బట్టే అప్పటి కాలాన్ని సూచిస్తూ వచ్చారు. తొమ్మిదో శతాబ్దంలో తొలిసారి విక్రమనామ సంవత్సరానికి సంబందించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది కూడా శక సంవత్సరం లాంటిదే. కానీ, వీటి మధ్య 15రోజులు తేడా ఉంటుంది. సిథియన్లు కూడా బౌద్దులే. వారు కూడా దీన్నే వాడేవారు అయితే, వారు దీన్ని మాల్వా సంవత్సరం అని అనేవారు. సాధారణ శకానికి పూర్వం 58 బీసీఈ నుండి వారు ఈ మాల్వా సంవత్సరం ప్రారంభించుకున్నారు. ఇదే మాల్వాను 9వ శతాబ్దం తర్వాత, వారు దాన్ని విక్రమనామ సంవత్సరమన్నారు.
భారతీయులంతా ఇప్పుడు శక సంవత్సరాన్నే ఉపయోగిస్తున్నారు. ఈ రోజు హిందూ కేలండర్ అని దేన్నయితే అంటున్నామో, అది హిందువులు రూపొందించుకున్నది కాదు. అది బౌధ్ధుల కేలండర్! అందుకే అందులో మొదటి నెల ‘చైత్యం’ అని ఉంటుంది. బుద్ధుల చైత్యం – స్థూపాల ప్రతీకగా వారు చైత్యంతో ప్రారంభించుకున్నారు. దాన్ని సంస్కృతీకరించి వైదిక మతస్థులు చైత్రం అని అన్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం బౌద్ధ కేలండర్ నే స్వీకరించింది. బౌద్ధ చక్రాన్నీ, అశోక స్థూపాల్ని, సింహాల్ని భారత ప్రభుత్వం తమ అధికార చిహ్నాలుగా చేసుకుంది. ఆ కేలండర్ చూసే బ్రాహ్మనిజానికి సంబంధించిన పురోహితులు దక్షిణ తీసుకుని తిథి, వార, నక్షత్రు చెపుతారు. అంటే దానితో వ్యాపారం చేసుకోవడం ప్రారంభించారన్నమాట! నాసా (NASA) కోట్ల రూపాయలు ఖర్చు చేసి సూర్యచంద్రుల కదలికల్ని తెలుసుకుంటుందనీ, అదే విషయం తాము ఇక్కడ కొద్దిపాటి దక్షిణ తీసుకుని సరిగా చెపుతుంటామని ప్రచారం చేసుకున్నారు. కొందరు అమాయకులు, ఎంతో మంది మూర్ఖశిఖామణులు ఉన్న దేశం కాబట్టి, ఇక్కడ వారి వ్యాపారం సజావుగా సాగుతూ వస్తోంది. ఇది మన రుషిపుంగవులు రూపొందించిన పంచాంగమని, దాని ప్రకారమే కేలండర్ వాడుకలోకి వచ్చిందనీ మనువాదులు ప్రచారం చేసుకున్నారు. అలా బౌద్ధ కేలండర్ కు కూడా అన్యాయం జరిగింది.
బ్రాహ్మణిజానికి వకాల్తా పుచ్చుకునేవారు ఒక చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేరు. శక సంవత్సరం అనే పదం పంచాంగాల్లో, కేలండర్ లలో ఎందుకుందీ? శక అంటే ఎవ్వరిదీ? శాక్యగణం ఎవ్వరిదీ? అది బుద్ధుడిది కదా? ప్రపంచంలోని మతాలకు ఎవరి కేలండర్ వారికి ఉంటే, మరి బ్రాహ్మనిజానికి ప్రత్యేకంగ ఒక కేలండర్ ఎందుకు లేదూ? బౌద్ధ కేలండర్ నిర్థారించిన ప్రకారమే వైదిక మతస్తులు పండగలు ఎందుకు జరుపుకుంటున్నారూ? వంటి ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. బౌద్ధాన్నినాశనం చేసే పనిలో వైదికుల బౌద్ధుల కేలండర్ ను కూడా వదలలేదు. ఇప్పుడు దేశంలో వాడుకలో ఉన్న కేలండర్ బౌద్ధులదే – ఒక రకంగా వారు కుట్రపూరితంగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకున్నారు. నిజమే! కానీ, వెలుగుల్ని కప్పేయడం, సత్యాన్ని దాచడం ఎవరి వల్లా కాదు. సత్యాలు బయటకొస్తున్నాయి. వెలుగులు విస్తరిస్తున్నాయి. ప్రతిచోటా బయటపడుతున్న బౌద్ధ శిల్పాలు గత చరిత్రను కళ్ళకు కట్టిస్తున్నాయి. వెలుగుల్ని తట్టుకోలేనివారు, సత్యాన్ని భరించలేనివారు – కల్పిత పాత్రలకు ఆలయాలు కట్టి మురిసిపోయే మూర్ఖశిఖామణులుంటారు తప్పదు! చెడు ఉంటేనే కదా మంచి విలువ తెలిసొచ్చేది.
‘సర్వ భాషలకు జనని మా సంస్కృతం’- అని గొప్పగా చెప్పుకుంటారే గాని, సరైన ఆధారాలు ఇవ్వలేరు. ఈ దేశానికి వలస వచ్చిన ఆర్యులు, తమతో తెచ్చిన సంస్కృతం ఒక మాండలికమనీ, దానికి లిపిలేదనీ ఒప్పుకోరు. వారు ఒప్పుకోకపోయినా చారిత్రక ఆధారాలు ఇలా ఉన్నాయి. వారు వచ్చేనాటికి ఈ దేశంలో నాగరి లిపి ఉంది. ఆ భాష ఎవరిదీ? ఈ దేశ మూలవాసులైన నాగజాతి ఆదివాసుల భాష. నాగరి లిపిలో వారి సంస్కృతాన్ని రాసుకుని, నాగరిని దేవనాగరి అన్నారు. తమ సంస్కృతాన్ని ఏకంగా దేవభాష అని ఉన్నతీకరించుకున్నారు. బుద్ధుడికాలంలో ప్రజల భాష పాలిలోనే బుద్ధుడు తన బోధనల్ని బోధించాడు. అశోకుడి శిలాశాసనాలన్నీ పాలి, ప్రాకృత భాషల్లో ఉన్పాయి. ప్రాకృతం అంటే ప్రకృతిసిద్ధంగా ఏర్పడింది అని- సంస్కృతం అంటే సంస్కరించబడిందనీ అర్థాలు. సంస్కరించబడింది మూలభాష కాలేదు కదా? పాలి, ప్రాకృతం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన భాషలు. ఇటీవల ఒక విదేశీ పరిశోధకుడు ఫ్రెంచి భాషలో ఇరవైకి పైగా పాలి భాషా పదాలు ఉన్నట్టు నిర్థారించాడు. తర్వాత కాలాలలో ఏర్పడుతూ వచ్చిన భాషలమీద ప్రాచీన భాషల ప్రభావం తప్పక ఉంటుంది. లిపి లేని ఒక మాండలిక-సంస్కృత భాష సర్వభాషలకు జనని కాగలదా?
ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. నాగజాతివారంతా బౌద్ధులు. వారు అధిక సంఖ్యలో ఉన్న ప్రదేశాలన్నీ నాగ పేరుతో మొదలవుతాయి. కశ్మీర్ లో అనంత్ నాగ్, మహారాష్ట్రలో నాగపూర్ వంటివి. బౌద్ధానికీ, నాగవంశాలనికీ ఉన్న అవినాభావ సంబంధం వల్లనే డాక్టర్ అంబేడ్కర్ బౌద్ధం నాగపూర్ లో స్వీకరించారు. ఇక ధమ్మ లిపి గురించి చూద్దాం. ధమ్మ అనేది పాలిభాషాపదం. దానికి ‘‘ధరించేద’’ అని అర్థం. లేదా వహించేది – ఏ మాటల్ని మనసు ధరించి లేదా వహించి –మనసును ఆవహించి దుఃఖపడదో – ఏ పలుకులు వినడం వల్ల మనసు మలినరహితం అవుతుందో అదే ధమ్మపథం! ధమ్మపథం త్రిపీటకాల్లో – బుద్దక నికాయంలో భాగం. ఇవి బుద్ధుడు ప్రత్యక్షంగా చెప్పిన గాధలు కావు. బుద్ధుని బోధనల సారం! బుద్ధుడి సందేశాల్ని సంస్కృతంలోకి అనువదిస్తామనీ, అందుకు అనుమతించమనీ యమేలుడు-తేలకుడు అనే ఇద్దరు భిక్షువులు బుద్ధుణ్ణి అడిగారు. అందుకు బుద్ధుడు సమ్మతించలేదు. పైగా, -‘వద్దు’- అని వారించాడు. ‘నా సందేశాల్ని ఎప్పుడూ సంస్కృతంలోకి మార్చొద్దు’’- అని స్పష్టం చేశాడు. ఎందుకంటే తను చెప్పిన దానికి పెడార్థాలు తీసి, వక్రీకరించి, ధమ్మాన్ని అపఖ్యాతిపాలు చేస్తారని ఆయన ఆనాడే గ్రహించాడు.
బుద్ధుడు 14 రకాల జ్ఞానాల్ని అందించాడని అంటాడు – భదంతు జ్ఞాన జ్యోతి. ఈయన బుద్ధుణ్ణి ఒక ‘జ్ఞాన శిల్పకళాకారుడి’గా కూడా వర్ణించాడు. అది తథాగతుడైన సమ్యక్ సంభుద్ధుడికే సాధ్యం – అని అన్నాడాయన. అలాగే మరో విషయం కూడా చూడండి. వైదిక మతస్థులు స్వంతం చేసుకున్న కాషాయరంగు ఎవరిదీ? అది బుద్ధుడిది! బుద్ధుడి జీవికకు ప్రతీక! అది ప్రేమ, కరుణ, క్షమలకు ప్రతీక! ఈ కాషాయరంగు ఛత్రపతి శివాజీ శౌర్యానికీ, పరమత సహనానికీ ప్రతీక! ఈ కాషాయం రంగే అమరవీరుడైన ‘షహీద్ ఆజం’ భగత్ సింగ్ త్యాగానికి ప్రతీక! బుద్ధుడి తర్వాత కాషాయాన్ని వాడిన శివాజీ, భగత్ సింగ్ లు దేశప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. దిగజార్చలేదు. వారు ఏ ధార్మిక భావనల్ని ప్రచారం చేయలేదు. కాషాయపు స్థాయిని తగ్గించలేదు. సమకాలీనంలో ఆ రంగును దౌర్జన్యానికీ, దోపిడికి, అధికారమదానికీ, అసహనానికీ వాడుకుంటున్నది ఎవరో ఇప్పుడు అందరికీ తెలుసు. జైశ్రీరామ్ నినాదంతో ప్రజల మానాల్ని, ప్రాణాల్ని దోపిడి చేస్తూ, ఇళ్ళమీదికి బుల్ డోజర్లు పంపిస్తూ, తమది డబుల్ ఇంజన్ సర్కార్ అని డప్పు కొట్టుకుంటున్నది ఎవరో ఇప్పుడు అందరికీ తెలుసు. ఈ కాషాయాన్ని అడ్డుపెట్టుకునే కదా వీరు గుజరాత్-మణిపూర్ మారణకాండలు జరిపించారూ? ప్రపంచ దేశాలలో దేశానికున్న పరువుప్రతిష్ఠల్ని దిగజార్చారూ? నిట్టనిలువునా కూల్చేశారూ? కాల్చేశారూ? అందుకే మహాకవి శ్రీశ్రీ అన్నాడు ‘‘కుష్టువ్యాధి ఉన్నోడినైనా ముట్టుకో- కానీ మతపిచ్చి ఉన్నోడిజోలికి వెళ్ళకు. ఎందుకంటే వారు కనబడే మనుషులకంటే కనరాని మతాలకే ఎక్కువ విలువిస్తారు’’- అని!
తారాదేవి (స్త్రీబోధిసత్వ) విగ్రహాలు మార్చి దుర్గ, కాళి, సరస్వతి, లక్ష్మి, పార్వతి వంటి విగ్రహాలుగా చెలామణిలోకి తెచ్చి, తమ జీవనాధారం చూసుకున్న హైదవపురోహితులు, తమ చారిత్రక తప్పిదాన్ని గ్రహించలేకపోయారు. అయితే, మరి ఆ దేవతల విగ్రహాలపైన, చుట్టుపక్కల బుద్దుడి ఆకృతిలో ఎందుకున్నట్టూ? నిజాల్ని అన్వేషించేవారికి విషయం అర్థం అవుతుంది. కళ్ళముందు ఉన్నా చూడకుండా, అర్థం చేసుకోకుండా. మెదళ్ళు మూసుకుని – ఊరికే మనోభావాలు దెబ్బతీసుకునేవారికి ఏం చెప్పగలం? ఇంతెందుకూ? ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ’- అనే పదాలు వినగానే ఇవి హైందవానికి సంబంధించినవి అనిపిస్తుంది. కానీ ఈ పదాలు మొదట ఉచ్ఛరించింది గౌతమ బుద్ధుడు. ఆయన పాలి భాషలో చెప్పిందే సంస్కృతంలోకి మార్చుకుని బ్రాహ్మణార్యులు ప్రచారం చేసుకున్నారు. ఏ చిన్న విషయం కూడా వారు మార్చుకోకుండా వదిలేయలేదు. అయితే, బ్రాహ్మణిజానికి భజన చేస్తూ తిరిగే బహుజన -పిచ్చిజనం వాస్తవాలు గ్రహించలేకపోతున్నారు. కళ్ళగంతలు విప్పేస్తే, పరాయీకరణ మానేస్తే, నిజాలు కనిపిస్తాయి. ప్రస్తుతం మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే నాటకాలు, డ్రామాలు చూసి బాధపడుతూ భోరున ఏడుస్తున్నాం. వాస్తవాలకు మాత్రం స్పందించలేకపోతున్నాం. ఈ పరిస్థితిలోంచి బయటపడాలి!
(రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ – మెల్బోర్న్ నుంచి)