- ధర్మపురిలో మెరిసిన మాణిక్యాలు
- తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సీఏ పరీక్షల్లో విజయం
అంతగా సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతం నుంచి ఇద్దరు విద్యార్థులు అత్యంత క్లిష్టతరమైన చార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఔరా అనిపించారు. సాటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయకుండా తమపై పెట్టిన నమ్మకానికి ఫ్రతిఫలం చూపించారు. గ్రామీణ ప్రాంతమైన ధర్మపురికి చెందిన గాజుల విజయ్ కుమార్, కొండ వామన్ లు సీఎ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించండతో వారి కుటుంబాలతో పాటు వారి గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. గాజుల విజయ్ కుమార్ ధర్మపురి శివారు గ్రామమైన బుద్ధిష్ట్ పల్లి. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. విజయ్ తల్లి దండ్రులకు పొలం పనుల్లో సాయపడుతూ సీఎ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. కొండ వామన్ తల్లిదండ్రులు కిరాణా దుకాణం నడుపుతూ వచ్చే అరకొర ఆదాయంతో కుమారుడ్ని సీఏ చదివించారు. ఇద్దరూ ధర్మపురికి చెందిన వారు కావడం ఒకేసారి ఉత్తీర్ణులు కావడంతో గ్రామస్థులలు వీరిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.