Thursday, November 7, 2024

స్వయంభూ చల్లగుళ్ల నరసింహారావు

డాక్టర్ యలమంచిలిశివాజీ

CM told to shift administration
డాక్డర్ యలమంచిలి శివాజీ

నరసింహారావు, నేను ఇద్దరం ఆచార్య రంగా, రాజగోపాలనాయుడు, లచ్చన్న, సుంకర నేసిన తాడులోని ముక్కలం. స్వేచ్ఛావాద విధానాల ద్వారానే మానవ జాతి అభ్యున్నతి సాధ్యమని విశ్వసించేవాళ్లం.  

ప్రజాస్వామిక విధానాల ద్వారానే సామాజిక పురోగతి సాధ్యమవుతుందని భావిస్తూ, ఉన్నత మానవ విలువలను మా జీవిత విలువలుగా స్వీకరించాం. మా బంధానికి అర్ధ శతాబ్దం వయసు. 1972 ‘జై ఆంధ్ర’ ఉద్యమంలో దగ్గరయిన  మేము ఇంతకాలం ఒకే కుటుంబంగా పయనించాం. 1975 జూన్‌ 12వ తేదీ ‘భారతదేశంలో విప్లవం సాధ్యమా? ’అనే చిన్న పుస్తకాన్ని ప్రచురించిన నరసింహారావు  దానిని నాచేత ఆవిష్కరింపజేశారు. ఆ సమావేశం పూర్తిగావించి, బెజవాడ బీసెంట్‌రోడ్డులో నడిచి వెళుతున్నాం. ఒక చిన్న పలక మీద ‘ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు’ అనే వార్త రాసి పందిరి గుంజకు వేలాడతీశారు. అది చూసి మేము ఒక ఆటోకు మైకు కట్టి ఆ తీర్పు ప్రకారం ప్రధాని రాజీనామా చేయాలని న్యూ ఇండియా హోటల్‌ సెంటర్‌లో బహిరంగ సభ అని ప్రచారం చేసి మల్లాది సుబ్బమ్మ గారి అధ్యక్షతన సభ నిర్వహించాం. విప్లవం మీద వెలువరించిన పుస్తకంలో ఏమి ఉటంకించబడిందో చూడకుండానే అదేదో నిషిద్ధ సాహిత్యమని భావించారో, మేము ప్రధాని రాజీనామాను డిమాండ్‌ చేస్తూ సభ నిర్వహించామనో, మే నెల 7వ తేదీన విజయవాడలో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ బహిరంగ సభ జరిపామనో, ఏమైతేనేమి నన్ను 1975 జూన్‌ 25 రాత్రి అంతరంగిక భద్రతా చట్టం కింద నిర్బంధించి రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. ఆరోజు కుండపోత వర్షం. మా నాన్న కనుమూరు నుంచి ఒక బియ్యం మూట తీసుకుని, అసలు నేను ఏమైపోయానో అని వెతికి, నరసింహారావు గారింటిలో ఉన్న నన్ను ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత నడిరాత్రి 2, 3 గంటలకు పోలీసులొచ్చి అరెస్టు చేయడం, వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించడానికి ముందు రాత్రే నన్ను నిర్బంధించడం, అప్పట్లో రాజమండ్రి కారాగారంలో కాకలు తీరిన కమ్యూనిస్టు యోధులు, ఆర్‌.ఎస్‌.ఎస్‌., ఆనందమార్గ్ సభ్యులు, కాంగ్రెసేతర పక్షాల నేతలు అనేక మంది పెద్ద నేతలతో సహజీవనం చేసే సదవకాశం, జైలులో మా అందరికీ బయట విశేషాలు అందించడం, హైకోర్టు విచారణకు హైదరాబాద్‌ వెళ్లేప్పుడు విజయవాడలో రైలు ఎక్కి రాత్రంతా కబుర్లు చెప్పి, తిరిగి మళ్లీ బస్సులో విజయవాడ రావటం, మళ్లీ రాజమండ్రి వెళ్లేప్పుడు కూడా అదే వరస. మేము ఎక్కడ నిరాశ, నిస్పృహలకు గురవుతామోననే ఆదుర్దా , దాన్ని పోగొట్టడానికే ఈ ప్రయాస. ఇక అత్యవసర పరిస్థితి తర్వాత 6వ లోక్‌సభ ఎన్నికలు ప్రకటించిన రోజున నరసింహారావు గారింట్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఐక్య  ప్రతిపక్షం రాబోతున్నది.. ఒకే గుర్తుపై అధికార పార్టీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు పోటీ చేస్తాయని ప్రకటించాము. ‘మీకెలా తెలుసు?’ అని ప్రశ్నించారు. మా లోక్‌దళ్‌ పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి సమాచారం అందిందని సమాధానం. ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి  ఐ.వెంకట్రావు, సంపాదకులు  నండూరి రామ్మోహనరావుకి ఫోన్‌ చేసి శివాజీ ఇలా చెప్పారు. మనం ప్రచురించవచ్చా? అని వాకబు చేశారు. అప్పటి నుంచి నా పత్రికా సమావేశాలన్నీ నరసింహారావు గారింటనే. అప్పటికే శ్రీయుతులు వాసిరెడ్డి సత్యనారాయణ, సురేష్, వంశీ, రామచంద్రరావు, శాస్త్రి, శ్రీరాములు, మాధవరావు, ఎం.వెంకటేశ్వరరావు, తిలక్, శ్రీనివాస్, ఆర్‌.వి.ఆర్‌.కృష్ణారావు వంటి సీనియర్‌ జర్నలిస్టులు విలేకరులుగా ఉండేవారు. నేను వివిధ పత్రికల్లో అడపాదడపా వ్యాసాలు రాసినా, నా మొదటి పుస్తకం ‘మీరు- మీ ఆరోగ్యం’ పుస్తకాన్ని నరసింహారావు పూనిక మీద రాశాను. ప్రతిరాత్రి పొద్దుపోయాక నరసింహారావుకు లక్ష్మణుడు లాంటి తమ్ముడు నారాయణరావు గుంటూరు వచ్చి మా ఇంటి దగ్గర పడుకునేవాడు. నేను తెల్లవార్లు రాసిన కాగితాలు అక్కడే పడేసి తెల్లవారుజామున నిద్రపోయేవాడిని. నేను లేవకముందే ఆ కాగితాలు తీసుకుని నారాయణ విజయవాడ వెళ్లిపోయేవాడు. అలా వారం రోజుల్లో ఆ పుస్తకం రాయడం.. మరో వారం రోజుల్లో పది వేల ప్రతులు అచ్చువేశారు. 1977 ఎన్నికల ప్రచారానికి కేంద్రం నుంచి జగజ్జీవన్‌రాం, ఫెర్నాండెజ్, సురేంద్రమోహన్, రాజ్‌నారాయణ్, అశోక్‌మెహతా, భానుప్రతాప్‌సింగ్‌ వంటి నాయకులు రావడం, వారి పర్యటన కార్యక్రమాలు, బహిరంగ సభలు, ఉపన్యాసాల అనువాదం, పాత్రికేయ సమావేశాలు.. అలా గడిచాయి. జనతా పార్టీ రాజకీయ శిక్షణ శిబిరం నిర్వహించాం. గొల్లపూడిలోని ఉన్నత పాఠశాలలో అక్కడ హెడ్మాస్టర్‌గా ఉన్న శ్రీ చలసాని మోహన్‌దాసు గారు, సురేంద్ర మోహన్, రూథర్‌దత్, మధులిమాయే, నానాజీదేశ్‌ముఖ్‌ వంటి వారు యువ నాయకులకు, రాజకీయ జిజ్ఞాసువులకు ఓనమాలు దిద్దించారు. భారతీయ జనసంఘ్‌ తొలితరం నాయకులు శ్రీ బాలరాజ్‌ మధీస్‌ ఉపన్యాసాన్ని అనువాదం చేసే అవకాశం నాకు దక్కింది. ఆ క్రమశిక్షణ శిబిరంలోనే శ్రీ చౌదరీ చరణ్‌సింగ్‌ ఆర్థిక విధానాలపై రచించిన Gandhian blueprint అనే ఆంగ్ల గ్రంథాన్ని ‘గాంధీపథంలో..’ అనే పేరుతో తెలుగులో ప్రచురించాం. ఆ తర్వాత ‘కర్షక ప్రధాని’ అనే పేరుతో మరొక పుస్తకం.. వాటి ప్రచురణలో నరసింహారావు నేతృత్వం ప్రత్యేకంగా చేప్పే పనిలేదు.

జనతా ప్రయోగం విఫలం కావడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్న సమయంలో మద్రాసు వెళ్లి ఎన్టీరామారావు గారిని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించడం, ప్రాంతీయ పార్టీని స్థాపించమని నచ్చ చెప్పడం, అది కార్యరూపం దాల్చిన కొద్ది రోజులకే విజయవాడ పి.డబ్ల్యు.డి. మైదానంలో ఎన్టీఆర్‌ బహిరంగ సభ. బెజవాడ వీధులన్నీ జనమే జనం.  ‘తెలుగుదేశం పార్టీ’ ఆవిర్భావంలో ‘ఈ కాంగ్రెస్ తెలుగు జాతిని రక్షిస్తుందా? ’అనే పేరుతో నరసింహారావు ముందుమాటతో చిన్న పుస్తకం.. 5000 ప్రతులు ప్రచురించాం.  ఆ పుస్తకాన్ని ఎన్టీఆర్‌ ఎంతో ప్రశంసించి.. శిక్షణ శిబిరాల్లో పాల్గొనే వారికి పంచేవారు. వివిధ పత్రికల్లో అచ్చయిన నా వ్యాసాల నుంచి ఎంపిక చేసిన వాటిని ఏర్చి,కూర్చి 800 పేజీల బృహద్గ్రంధాన్ని ‘మా ప్రజలు- మా రాజకీయాలు’ అనే పేరుతో ప్రచురించారు.  దానికి అవర్‌ ఇండియా మినూ మాసానీ ముందుమాట రాశారు. అది 1984 నాటి మాట. దాదాపు నలభై సంవత్సరాల క్రితం అప్పట్లో పత్రికల ఎడిటోరియల్‌ గదుల్లో ఈ పుస్తకం భద్రపరచి.. ఏదైనా రాసేటప్పుడు అనుమానం వస్తే దానిని రిఫర్‌ చేసేవారు. మినూ మాసానీ రాసిన ముందుమాటను తెలుగులోకి తర్జుమా చేయడానికి రెండుమూడు రోజుల పాటు కసరత్తు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నరసింహారావు నేతృత్వంలో ఎదురీత, ప్రతిధ్వని, అన్నదాత-  సుఖీభవ, Against odds వంటి పుస్తకాలు వెలువరించాం. ఇవన్నీ ఒక ఎత్తైతే Dale Cornegie, Stephen Covey, James Cleanలు లేని లోటును తెలుగు పాఠకులకు నరసింహారావు తీర్చేవారు. వ్యక్తిత్వ వికాసాన్ని తెలుగు వారికి పరిచయం చేసి, ప్రాచుర్యంలోకి తెచ్చారు. నరసింహారావు స్వయంభూ.. ఏ కళాశాలలోనూ చదువుకోలేదు. కేవలం స్వయంకృషితో తవ్వీన్‌సింగ్, జేమ్స్‌ క్లీన్, ఫ్రీడా మొఫాషీ, మాక్స్‌ రోజ్‌లిన్, స్టీఫెన్‌ కేవి, విల్‌ డ్యురాంట్‌ వాల్టేవిటేమన్, హెరాల్డ్‌ లస్కీ వంటి వారి రచనలను ఔపాసన పట్టారు. వారికి ఏ రకమైన డిగ్రీలు లేవు. నండూరి వారు, చలం, జాషువా, రావూరి భరద్వాజ, తుమ్మల సీతారామమూర్తి, వాల్టేవిటేమన్‌ వంటి వారికి పట్టాలు లేవు కానీ వారి రచనల మీద పరిశోధనలు చేసి వారికి డాక్టరేట్‌లు వచ్చాయి. అదే మాదిరి నరసింహారావు రచనలపై పరిశోధన చేసిన డాక్టర్‌ లక్ష్మీవాసవి నాగార్జున విశ్వవిద్యాలయం నుండి 2020, మార్చి 6న డాక్టరేట్‌ అందుకుంది.

రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, రోశయ్య, భవనం, బొత్స, పాలడుగు, పిన్నమనేని, బుద్ధప్రసాద్, లచ్చన్న, సుంకర, వడ్డే, వైయల్పీ, వెంకయ్యనాయుడు, హరిబాబు, రావెల సోమయ్య.. ఇలా అందరూ నరసింహారావు గారికి సన్నిహితులే.. అంతరంగికులే.

ఆయన విశ్వాసాలనూ, విధానాలనూ పూర్తిగా వ్యతిరేకించేవారైనా, ఆయన ప్రజ్ఞాపాటవాలను కాదనలేరు. ఆయన విషయ విజ్ఞతను వేలెత్తి చూపలేరు. ఆయనొక నడిచే ఎన్‌సైక్లోపీడియా.

వాటన్నింటికీ మించి నరసింహారావు నమ్మకమైన, నిజమైన స్నేహితుడు. ఆపదలో, ఇబ్బందుల్లో ఉన్న తన స్నేహితులను ఆదుకోవడానికి.. ఏదైనా మానసిక సంక్షోభంలో చిక్కుకున్న తన వారిని ఓదార్చడానికి.. సాంత్వన కల్పించి.. వారిలో ధైర్యం నింపడానికి ఎంతటి శ్రమదమాదులైన వెనుకాడని తత్వం. దానికి తగ్గట్టుగానే వారి శ్రీమతి జ్యోతి, కుమారుడు హర్ష, కోడలు పద్మశ్రీ, తమ్ముడు నారాయణరావు, ఆయన శ్రీమతి శశికళ, వారి అమ్మాయి మేఘన, ఆమె భర్త అనిల్, తల్లి కృపాదేవి, తోబుట్టువు దేవకి, బావ యలవర్తి చిన్నయసూరి, మామగారు మోహన్‌దాసు, అత్తగారు సరోజినీదేవిలు నరసింహారావు వెనుక కొండంత అండగా నిలిచి కుటుంబ భారాన్ని పంచుకున్నారు. దాంతో నరసింహారావు పూర్తి శక్తియుక్తులను సమాజహితం కోసం వెచ్చించారు. వాళ్ల మనవడు విశిష్ట రూపంలోనే గాక, తాత చెప్పిన వ్యక్తిత్వ వికాసంలోని అంశాలన్నీ వంటపట్టించుకున్నాడు. వాడికి హర్యానా, ఉత్తరప్రదేశ్‌ జాట్ల నుంచి ఒక ‘చౌదరాణి’ని తెచ్చి పెళ్లి చేస్తానని పరిహాసమాడారు. గత 50 ఏళ్లుగా కలిసి నడిచిన నరసింహారావు లేని లోకం నాకు శూన్యంగా కన్పిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles