నాగులపల్లి భాస్కరరావు
ముదునూరు, న్యూఢిల్లీ
చల్లగుళ్ళ (రేపు) నరసింహారావు (సినరా) మంచి మిత్రుడు – ఎంతో మందికి, ఎన్నో సంవత్సరాల నుంచి. మిత్రుడికి పర్యాయపదం కూడా. ఈ రోజుల్లో అట్లాంటి మిత్రుడు ఉండటం అరుదు. ఆయన అలుపెరుగని రచయిత, ఆలోచనాపరుడు, ప్రజాసమస్యలని విశ్లేషించడమే కాక పరిష్కారాలని గురించి నిరంతర శోధన చేసిన రచయిత. ఎంతోమంది పెద్దలని, యువకులను, కుటుంబాలను ప్రభావితం చేయడమే కాక ఎంతోమంది రాజకీయ నాయకులకు, అన్ని పార్టీల వాళ్ళకి మార్గదర్శకుడు కూడా. అది ఇతరులు గ్రహించినా గ్రహించకపోయినా బాధలేదు. తిరోగమనం ఎరుగని నరసింహారావు మన మధ్య లేడనేది – ఆలోచనలకు సంబంధించినది ఇప్పుడు. అది వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయం కూడా.
సినారా చేసిన కృషి ఏంతో, ఎంత గొప్పదో గత రెండుమూడు రోజులుగా పార్టీలకి అతీతంగా వచ్చిన స్పందన ఎన్నో సంవత్సరాల తర్వాత చూస్తున్నాం. నాకు చాలా సంవత్సరాల కిందట దిల్లీలో కుష్వంత్ సింగ్ చనిపోయిన రోజు, ఆ తర్వాత వచ్చిన స్పందన గుర్తుకొస్తోంది. ఎంతో మంది పాత కొత్త స్నేహితులకే కాదు ఇంకా ఎంత మందికో స్నేహం గొప్పదనాన్ని గుర్తు చేస్తుంది. మాటలు తూటాలు అయినప్పటికీ, జర్నలిస్టులు ప్రజాజీవితంలో ఏ విధంగా ఉండాలో కూడా ఒక ఆదర్శవంతమైన విధంగా, ఎంతో గర్వంగా జీవించారు. నాయకులకు పాఠాలు నేర్పిన ఉద్దండుడు సినరా. ఆయనే ఒక పాఠం-ఇప్పుడు.
ప్రభుత్వాన్ని,అధికారంలో ఉన్న నాయకులను విమర్శించాలంటే ఎన్నో గుండెలు కావాలనే ఈ రోజుల్లో చలించకుండా, హుందాగా, ధైర్యంగా మళ్ళీమళ్ళీ చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు? ఎవ్వరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా వ్యక్తిత్వానికి మచ్చరాకుండా దర్జాగా బతికి బట్టకట్టిన జర్నలిస్టు సినరా. క్రమశిక్షణ తక్కువగా ఉన్న జర్నలిజంలో క్రమశిక్షణతో పాటు ధైర్యాన్ని చాటిచెప్పిన వ్యక్తి. నిజానికి నిర్భీతి తోడైతే దృక్పథాలు మారవచ్చు. మారతాయి అని చూపించిన మేధావి సినరా. ప్రతి విషయంలో కొంత అన్వేషణ (రీసెర్చ్) అవసరం. అంకెల అవసరాన్ని చూపించిన రచయిత సినరా. ఆలోచనా విధానాన్ని మార్చగలిగితేనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన సినరా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు అంత తేలికగా చెరిగిపోయేవి కావు. ఆయన లేడనే రేపు నిజం నమ్మలేనిది. అట్లాంటి నిజాలే, జ్ఞాపకాలే ప్రగతికి మూలాలు.
ఫోను చేసి చిన్న విషయం అని పెద్ద ఆలోచనని బయటపెట్టేవాడు. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించవలసిన అవసంర లేదు. అయితే ఆయనతో వాదించాలి. వాదన ద్వారానే దృక్పథాలు, మంచిచెడులు బలయపడతాయని నమ్మాడు. వ్యతిరేకించి వాదించడంలోనే ఉంది మజా అని నమ్మిన వ్యక్తి.
నేను1966లో అమెరికా నుంచి రాసిన ‘పోలిటిక్స్ ఆఫ్ లీడర్ షిప్ ఇన్ ఇండియా- స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (Politics of leadership in India- State of Andhra Pradesh) అనే పుస్తకం (విజయవాడలో ప్రచురించబడింది) ద్వారా మా పరిచయాలు మొదలైతే నేను 1970లో విజయవాడ వచ్చినప్పుడు కలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత విజయవాడ వచ్చిన ప్రతిసారీ కలసి ఎన్నో విషయాల, పుట్టుపూర్వోత్తరాలు మట్లాడుకున్నాం. ఆయన అదే విధంగా ఎంతోమందిని పురికొల్పి వాళ్ళ ఆలోచనలకి తోడ్పడ్డాడు. వ్యక్తిత్వం ఉన్నప్పుడే చెప్పేదానికి, రాసేదానికి విలువ కదా అనే నిజాన్ని మళ్ళీమళ్ళీ గుర్తు చేసిన మిత్రుడు సినరా ఉన్నట్టా – లేనట్టా?
ఆయన విశ్లీషణలో ఉన్న ఆవేదనతో టిలివిజన్ మాద్యమంలో ఉన్న లోటుపాట్లు కలసి విశ్లేషణల రూపురేఖలే మారిపోయాయి. చాలా బాధపడ్డాడు ఈ పరిణామాలు చూసి. టెలివిజన్ విశ్లేషణకు లోనైకాకుండా ఉంటే సినారా మనమధ్య నవ్వుతూ కనిపించేవారు ఇంకా ఎన్నో సంవత్సరాలు అని అనిపిస్తుంది నాకు. ఎంతో మందికి ఆత్మస్థయిర్యాన్ని నేర్పిన వ్యక్తి టెలివిజన్ విశ్లేషణలు హద్దు దాటితే ఏమవుతుందో గ్రహించాలి. ‘సినరా ఎఫెక్ట్’ని గుర్తించాలి. సి నరసింహారావు జీవన విధానం, రచనల తీరు, విశ్లేషణా ధోరణి, పద్ధతుల గురించి జర్నలిజం స్కూళ్ళు అధ్యయనం చేయాలి. కొత్త ధోరణులకు తోడ్పడాలని అదే సినారాకి సరైన నివాళి అవుతుందని భావిస్తా.
మంచి మిత్రుని కోల్పోయాం