- ఆఫీసులకు వెడితేనే మెరుగైన పని
- కరోనాలో దెబ్బతిన్న భారత్ పని సంస్కృతి
- మనకంటే బంగ్లాదేశ్ నయమని నిరూపించుకున్నది
కరోనా కాలం మొదలైనప్పటి నుంచీ ప్రపంచ వ్యాప్తంగా, ‘వర్క్ ఫ్రం హోం’ సంస్కృతి వేగవంతమైంది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత కూడా ఐటీ రంగంలో ఇంకా అది కొనసాగుతోంది. కరోనా ఉధృతమైన వేళల్లో మీడియా మొదలు మరికొన్ని రంగాలు కూడా ఈ పనిసంస్కృతిని అలవాటు చేసుకున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు చాలా వరకూ తగ్గుముఖం పట్టాయి. కొన్ని దేశాల్లో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ, నాల్గో వేవ్ విషయంలో పెద్దగా భయపడనక్కర్లేదని వైద్య నిపుణులు కొందరు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఎక్కువ దేశాల్లో ఆంక్షలు సడలించారు.
Also read: యుద్ధపర్వంలో ఎత్తులు పైఎత్తులు
ఆఫీసులకు ఉద్యోగాలను రప్పించుకునే యత్నం
ఈ నేపథ్యంలో ‘వర్క్ ఫ్రమ్ హోం’ ను సడలించే దిశగా కొన్ని ఐటీ సంస్థలు ఆలోచిస్తున్నాయి. పెద్ద కంపెనీలు మాత్రం ఉద్యోగులను రప్పించుకోవాలని సూచిస్తున్నాయి. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి ‘వర్క్ ఫ్రమ్ హోం’కు ముగింపు పలకడమే క్షేమదాయకమని సూచిస్తున్నారు. ఐటీ ఉద్యోగాలేకాక,చదువులు, దైనందిన అవసరాలకు సంబంధించిన సేవలు ఆన్ లైన్ విధానంలోనే ఎక్కువపాళ్ళు జరగడం మన దేశంలోనూ వేళ్లూనుకుంది.రవాణా ఖర్చు తగ్గిపోవడం, మౌలిక సదుపాయాల వ్యయం అదుపులోకి రావడం, సమయం సద్వినియోగం కావడం మొదలైనవి ‘ఇంటి నుంచి పని’ వల్ల లాభించే అంశాలు. కష్టపడే తత్త్వం,సృజన, అత్యుత్తమ ఫలితాల సాధన మొదలైనవి మృగ్యమైపోతాయని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నెట్ వేగంలో అవరోధాలు మొదలైన సాంకేతిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. కరోనా కాలంలో మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మనం ఉత్పాదకతలో వెనుకబడిపోయామని నివేదికలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్ వంటి దేశాలు మనకంటే ముందుండడం గమనార్హం. ఐటీ సేవల్లో ఒకప్పుడు మనం అందరికంటే అగ్రభాగాన ఉండేవాళ్ళం. కరోనాకు జన్మభూమి చైనా. కొంతకాలం ఉత్పాదకతలో కొంత ఫలితాలు తగ్గుముఖం పట్టినా, అక్కడ మళ్ళీ వేగం పుంజుకుంది.భారతీయులలో కష్టపడే తత్వం క్రమంగా తగ్గుముఖం పడుతోందని పరిశీలకులు అంటున్నారు. కరోనా కాలంలో,బద్ధకం బాగా ఆక్రమించి,కష్టపడే సంస్కృతి తగ్గిపోతున్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరిందని మేనేజ్ మెంట్ నిపుణులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జర్మనీ ఇప్పటికీ ఆదర్శంగా ఉందని వారు కితాబునిస్తున్నారు. రోజుకు 16 గంటలకు తక్కువ కాకుండా పనిచేసే లక్షణం జర్నన్ లలో ఇప్పటికీ సజీవంగా ఉండడం అభినందనీయం.
Also read: మరోసారి పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్
ఐటీ సేవల్లో భారత్ అగ్రగామి
ప్రపంచ దేశాల్లో ఐటీ సేవల్లో భారతీయులకు ఎంతో గుర్తింపు ఇప్పటికీ ఉంది. ‘పనిసంస్కృతి’ని (వర్క్ కల్చర్) పదిలంగా కాపాడుకుంటే భారతీయులు అగ్రగామిగా నిలుస్తారనడంలో సందేహం లేదు.చైనాను ఢీకొట్టాలంటే మనం వేగాన్ని పెంచుకోవాల్సిందే. పనిలో,ఉత్పాదకతలో, విద్యాసముపార్జనలో, జ్ఞాన సంపదను పెంచుకోవడంలో వేగం ప్రతిఫలించాలి.ఆన్ లైన్ విద్యా విధానం వల్ల కొన్ని లాభాలు ఉన్నప్పటికీ,అక్కడ శరీరం తప్ప ఆత్మ ఉండదని మనోవిజ్ఞానశాస్త్ర నిపుణులు కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇతరులతో కలిసిపోయే తత్త్వం,మానవ సంబంధాలు, తోటివారి నుంచి నేర్చుకోవడం, ఇచ్చిపుచ్చుకొనే లక్షణాలపై ‘వర్క్ ఫ్రమ్ హోం’ దుష్ప్రభావాలను చూపిస్తుందని ఫిన్ టెక్ వ్యవస్థాపకుడు కునాల్ షా అంటున్నారు.మొత్తంమీద, ఇంటి నుంచి పని,ఆన్ లైన్ చదువులు మొదలైనవి దీర్ఘకాలంలో విధ్వంసకర సంస్కృతిని స్థాపిస్తాయని కొందరు ఐటీ దిగ్గజాలు, మేనేజ్ మెంట్ గురువులు, మానసిక శాస్త్ర నిపుణులు గట్టిగా అభిప్రాయపడుతున్నారు.ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం ఎంత అవసరమో, మానవస్పర్శను ( హ్యూమన్ టచ్ ) పోగొట్టుకోకుండా చూసుకోవడం అంతకంటే అవసరం.పనిలో,వేసే ప్రతి అడుగులో వేగం,తేజం అన్నింటికంటే ముఖ్యం. విద్యావిధానంలో సంస్కరణల దిశగా భారత ప్రభుత్వం కదులుతోంది. ఆ కదలికలో ప్రాచీన సంప్రదాయ విధానం,ఆధునిక పోకడలు కలిసి సాగితే? భారత్ అన్నింటా విభిన్నంగా, అగ్రగామిగా నిలుస్తుందని విశ్వసించవచ్చు.
Also read: ‘కశ్మీర్ ఫైల్స్’ కలవరం, కలకలం