సంపద సృష్టిద్దాం -16
ఇది నిజంగా జరిగిందో లేదో తెలీదు గానీ అమెరికాలో ఒక కథ ప్రచారంలో ఉంది. ఫోర్డ్ కార్ల యజమాని హెన్రీ ఫోర్డును అమాయకుడని బయటకు ప్రచారం చేయాలని కొందరు ఉబలాడపడ్డారట. ఆ మేధావుల బృందాన్ని ఫోర్డ్ ఆహ్వానించి, వారిని ప్రశ్నలు వేయమన్నాడట. వారే ప్రశ్న వేసినా సాధ్యమైనంత వరకు వారికి జవాబివ్వగలనని ధీమాగా చెప్పాడట. అమెరికాలో శక్తిమంతులైన పారిశ్రామికవేత్తల బృందం సమావేశమై ఫోర్డ్ పై ప్రశ్నల వర్షం కురిపించిందట. వారి ప్రశ్నను అడిగిన వెంటనే తన ముందున్న కొన్ని ఫోన్లలో ఒకదానిని తీసుకుని తన అసిస్టెంట్లలో ఒకరిని పిలిచేవాడట. వారొచ్చి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేవారట. తన సమస్యలు ఎంత క్లిష్టమైనవైనా వాటిని పరిష్కరించగల సమర్ధులను తన ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటానని, ఇంతకంటే ముఖ్యమైన అంశాల గురించి ఆలోచించటానికి తన మెదడును ఖాళీగా ఉంచుకుంటానని చెప్పి ఆ చర్చను ముగించాడట హెన్రీ ఫోర్డ్.
Also read: డైరీ రాద్దామా!..
వ్యవస్థను నిర్మించడమే వ్యాపారం
అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఆలోచించుకోగలగడం. అది కేవలం కొంతమంది మాత్రమే చేయగలరన్న ఫోర్డ్ సూక్తిని ఈ కథ నిరూపిస్తుంది. అయితే నేను చెప్పదలచుకున్నది ఇది కాదు. సాధారణంగా ఉద్యోగిగా కొన్నాళ్లు గడిపాక మూడు కారణాలతో ఎవరైనా వ్యాపారం చేద్దామని బయల్దేరతారు. అంటే ఇ క్వాడ్రెంట్ నుంచి బి క్వాడ్రెంట్‌కు బదిలీ కావాలనుకుంటారు. ఆ మూడు కారణాలలో మొదటిది చేస్తున్న పని పట్ల విసుగు. రెండవ కారణం పొదుపు చేసి కాస్త డబ్బు ఆదా చేయడం. మూడవ కారణం ఆర్థిక స్వాతంత్య్రం గురించి అవగాహన ఏర్పడి వ్యాపారం చేయాలనుకోవడం. కాని కేవలం నాయకత్వ లక్షణాలు ఉన్నవారు మాత్రమే వ్యాపారం చేయగలరని వారికెవరూ చెప్పరు. మన చేతిలో ఉన్న విద్యతో, కళతో, నైపుణ్యంతో డబ్బు సంపాదించడం రెండవ ఎస్ క్వాడ్రెంట్ (స్వయం ఉపాధి) విభాగానికి చెందుతుంది. వ్యాపారం అంటే అది కాదు. మనుషులను మేనేజ్ చేయడమే వ్యాపారం. వ్యాపారం చేసే వ్యక్తి ఆ మొత్తం వ్యవస్థకు బాధ్యత వహిస్తాడు. సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేసుకుని ఆ వ్యవస్థను నడిపే బాధ్యతను వ్యాపారవేత్త తీసుకుంటాడు. అందుకే మూడవదైన బి విభాగంలో విజయం సాధించడానికి వ్యవస్థను నియంత్రించగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి, వ్యక్తులకు నాయకత్వం వహించే సామర్ధ్యం కలిగి ఉండాలి.
Also read: ఆర్థిక స్వేచ్ఛకు ముందర…
చాలామంది తమ దగ్గర ఒక కొత్త ప్రొడక్ట్ ఉందని, కొత్త ఐడియా ఉందని.. దాంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్నట్టు చెప్తుంటారు. తమ దగ్గర ఉన్నలాంటి ప్రొడక్ట్ లేదా సర్వీస్ మార్కెట్‌లో లేదని గర్వంగా చెప్తుంటారు. కాని మనం గుర్తించాల్సింది ఏమంటే, మెరుగైన ప్రొడక్ట్ లేదా సర్వీస్ కలకాలం మనలేదు. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడలేదు. కాని, మెరుగైన వ్యాపార వ్యవస్థను నిర్మించగలగడం నేర్చుకుంటే ఎంత పాత ప్రొడక్టయినా ఫరవాలేదు. మన వ్యాపారానికి తిరుగుండదు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, బిల్ గేట్స్ ఎలాంటి కొత్త ప్రొడక్టునూ తయారు చేయలేదు. ఇతరుల ప్రొడక్టులను కొనుగోలు చేసుకుని శక్తిమంతమైన వ్యాపార వ్యవస్థను నిర్మించగలిగాడు. ఒక అర్థ దశాబ్దకాలం పాటు వ్యవస్థను నిర్మించడానికి రాత్రి పగలు శ్రమించాడు. ఇక జీవితకాలమంతా పని చేయనవసరం లేకుండా చేసుకోగలిగాడు. వ్యాపార వ్యవస్థను నియంత్రించటం, వ్యక్తులకు నాయకత్వం వహించే సామర్ధ్యం సంపాదించడమే కష్టం. చాలా శ్రమతో నేర్చుకోవలసిన పనులు. (వీటి కోసమే వ్యాపారవేత్తలంతా తమ బిడ్డలను బిజినెస్ స్కూళ్లకు పంపుతారు). ఇప్పుడు బిల్ గేట్స్ తన ఆస్తులను ఎన్నిసార్లు ఉదారంగా దానం చేసాడో మనకు తెలిసిందే. ఎంత దానం చేసినా తరగని ఆస్తులు. ఎలాగంటే నిరంతరం ఆదాయం వస్తూనే ఉండడం వల్ల ఉన్నదంతా దానం చేసినా, మరుసటి రోజు మళ్లీ ఆదాయం తయారు.
Also read: మనం మారితేనే మన ఆర్థిక పరిస్థితి మారేది
అడుగు – నమ్ము – పొందు
సంపద సృష్టికర్తలంతా ఈ రహస్యం తెలుసుకోవాలి. మనం ఒక్కరమే రెక్కలు ముక్యలయ్యేలా రేయింబవళ్లు కష్టపడితే బాగా ధనం సంపాదించగలం అనుకోవడం భ్రమ మాత్రమే. అంతులేని సంపద పోగేయడం ఇతరుల సమయం, ఇతరుల డబ్బు వాడుకోవడం తెలిస్తేనే సాధ్యమవుతుంది. ఇ, ఎస్ క్వాడ్రెంట్లలో బతికే వ్యక్తులు కష్టపడేదానికి మాత్రమే ఆదాయం పొందుతారు. అదర్ పీపుల్స్ టైం, అదర్ పీపుల్స్ మనీ వాడేవారంతా బి, ఐ క్వాడ్రెంట్లలో జీవిస్తుంటారు. ఇక్కడ విజయవంతం కావడానికి భిన్నమైన సాంకేతిక నైపుణ్యాలు, ఆలోచన విధానం అవసరం. ఏదైనా వ్యాపారం చేయడం ద్వారా సంపద సృష్టించాలనుకున్న వారంతా నేర్చుకోవలసింది ఒకటే. ఒక వ్యవస్థను సొంతం చేసుకోవటం, ఆ వ్యవస్థలో వ్యక్తులు మీ కోసం పనిచేసేలా చూడడం మీ లక్ష్యం కావాలి. ఇది మూడు రకాలుగా జరుగుతుంది. స్వయంగా మీరే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అంటే సంప్రదాయ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేదా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మొదటిది. దీనికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమవుతాయి. రెండవది, అప్పటికే ఉన్న వ్యవస్థను కొనుగోలు చేయడం అంటే ఫ్రాంచైజీ తీసుకోవటం. పెట్రోల్ బంక్‌లు, మోటార్ సైకిళ్లు, కార్లు అమ్మే వ్యాపారాలు దీనికి ఉదాహరణ. మూడవది నెట్‌వర్క్ మార్కెటింగ్. పెట్టుబడులు అవసరం లేదు, రాయల్టీలు చెల్లించనవసరం లేదు. దీని గురించి వివరంగా మరోసారి మాట్లాడుకుందాం. బి విభాగంలో అంటే వ్యాపారంలో విజయవంతం కావడానికి రెండు విషయాలు నేర్చుకోవాలి. ఎవరైనా ఏమనుకుంటారో అనే బిడియం, తిరస్కారానికి గురవుతామేమోనన్న భయం పోగొట్టుకోవడం మొదటి విషయం. నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి. మనుషులతో కలిసి పనిచేయటం, వారిలో ప్రేరణ కలిగించటం ముఖ్యమన్నదే రెండో విషయం.
Also read: సమయానికి వేద్దాం కళ్లెం
తప్పక చేయండి: యూట్యూబ్‌లో లూయీస్ హే పాజిటివ్ అఫర్మేషన్స్ వినండి. అయితే ఇవి ఇంగ్లిషులో మాత్రమే లభిస్తున్నాయి. తొలి తరానికి చెందిన ఆకర్షణ సిద్ధాంత ప్రచారకురాలైన లూయీస్ హే చాలా స్పష్టంగా మన మనసుతో మనం ఎలా మాట్లాడుకోవాలో నేర్పిస్తారు. తెల్లవారు జామున ప్రతి రోజూ ఒక పది నిమషాలు ఈవిడను వినడం ద్వారా మనతో మనం చేసే సంభాషణ మరింత శక్తిమంతం కాగలదు.
Also read: బకెట్లు మోసే ప్రపంచం
–దుప్పల రవికుమార్