- కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూత
- సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు కామ్రేడ్ బూర్గుల నర్సింగరావు కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నర్సింగరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. వామపక్ష పార్టీల నాయకులు సురవరం సుధాకర రెడ్డి, చాడ వెంకట్ రెడ్డితో పాటు పలువురు నాయకులు నర్సింగరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నర్సింగరావు అహర్నిశలు కమ్యూనిస్ట్ ఉద్యమ పురోభివృద్ధికి కృషి చేశారని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఆయన మరణం వామపక్షాలకు తీరని లోటని అన్నారు.
ముఖ్యమంత్రి సంతాపం:
నర్సింగరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాలలో బూర్గుల పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నో ఉద్యమాలకు బూర్గుల నాయకత్వం వహించి ముందుకు నడిపించారని అన్నారు. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బూర్గుల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన యోధుడు నర్సింగరావు అని కొనియాడారు. తెలంగాణకు బూర్గుల చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.