(18 ఏళ్ళకు పైగా మాకు పంచిన నిస్వార్థ ప్రేమ)
అనుబంధం ఏర్పర్చుకునే ప్రతీ జీవి సుఖాన్నీ, దుఃఖాన్ని కూడా ఆర్ద్రతతో సహానుభూతి చెందడమే నాకు తెలిసిన మానవత. రెండు దశాబ్దాల పాటు మాలో ఒకరిగా, కుటుంబ సభ్యులతో పాటూ తాను కూడా సంతోషాల్లో, విచారంలో కొనసాగి అంతులేని ఆనందాన్ని అందించి, చురుకుగా, సందడిగా, హుందాగా బతికిన మా “బంటీ” ఈరోజు ఏప్రిల్ 16,2023 ఆదివారం ఉదయం 11.30 కి మమ్మల్నందర్నీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది!
కళ్ళు వీడని బుజ్జి పిల్లగా వచ్చి దాదాపు 18 ఏళ్ళు మాతో కలగలిసిపోయింది. ఏదైనా ఊరెళ్ళి ఇంటికొస్తే దాని ప్రేమను తట్టు కోవడం సాధ్యమయ్యేది కాదు. అమ్మా, నాన్న లనైతే మీదపడి గారాలుపోయికాని వదిలేది కాదు. నాన్న పోయిన తర్వాత చాలా బాధ పడింది. బాగా ఇనేక్టివ్ ఐపోయింది. మా ఇంట్లో రికార్డు సృష్టించి ఇన్నేళ్ళపాటు ఉన్న కుక్క మరోటి లేదు. తాత, మామ్మ బతికుండగా ప్రతి కుక్కనూ రాముడనే పిలిచేవారు. నాకు గుర్తున్న మొదటి కుక్క రాముడే. రావుడూ, వైటీ, జిమ్మీ, సోనీ, మోనీ, జూలీ, బంటీ..!
బంటీ ప్రత్యేకమైన జీవి. తనకి నచ్చితే డిమాండ్ చేసి మరీ సాధించేది, నచ్చకపోతే అటువైపు కూడా చూసేది కాదు. ఇంట్లో దానికి నచ్చినచోట నచ్చినట్లు పడుకునే హక్కున్న ఏకైక ప్రాణది. చలికాలం దుప్పట్లో, ఎండాకాలం చల్లదనంలో, వర్షాకాలం వెచ్చ దనంలో పడకేసేది. ఉన్నది అడుగెత్తే ఐనా, వయసులో ఉన్నప్పుడు అది చేసిన అల్లరీ, తీసిన పరుగులు,వేసిన అరుపులు మర్చి పోలేం. మాంసాహారంతోపాటు, మగ్గినపళ్ళూ, కూరగాయలు అన్నీ తినేది. అమ్మా నాన్న లతో తెల్లవారుజామున కాఫీతో మొదలెట్టి కేరట్ లూ , సీతాఫలాలైతే గుజ్జు తిని పిక్క ఉమ్మేసే తీరు మమ్మల్ని ఆశ్చర్యపరిచేది. ఒకప్పుడు మా ఇంటి పై కాకిని కూడా వాలని వ్వని బంటీ, తర్వాత కాలంలో పిల్లులతో కూడా ఏమాత్రం వైరం లేకుండా కలుపు గోలుగా మసలడం విచిత్రమనిపించేది !
అదెంతగా మాకు అలవాటు పడిందంటే, డాడీ దీనికి బంతి అని పేరు పెట్టాల్సింది అనేవారు, బంగారం అని పిలిచేవారు. బయట మేమేం కుక్కలని చూసినా వాటిని కూడా బంటీ అని పిలుచుకునేవాళ్ళం. చిన్న కుక్క బొమ్మొకటి ఇంట్లోని గూట్లో ఉంచుకుని, దానిని బంటీ అని పిలుచుకునేవాళ్ళం. ఫ్రెండ్స్ బంటీగాడి కోసమని నాన్ వెజ్ తీసుకుని వచ్చేవాళ్ళు. దానికిష్టపని మరమరాలు మొదలు కొన్ని రకాల పదార్థాలు అమ్మ ఇంట్లో ఎప్పుడూ ఉంచు కునేది. దాని కోసం ఎవరో ఒకరు ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సి వచ్చేది. నేనూ, రాణీ షిఫ్టయ్యాక మొన్న మా ఇంటికి కూడా వచ్చి ఓ రెండు వారాలు ఉంది!
అంత చురుకయిన జీవి హఠాత్తుగా నీరసించిపోవడం తట్టుకోలేకపోయాం. ఇప్పుడిక ఎన్నో జ్ఞాపకాల్ని వదిలేసి మౌనంగా ఇక సెలవంటూ వెళ్ళిపోయింది. ఇంట్లో ఎన్నో మంచిచెడులకి ప్రత్యక్ష సాక్షంగా నిలిచింది. మా ఇంట్లో అనే కాదు, ఊర్లో ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది. లెక్కలేనం తమంది పిల్లలకి జీవితంలో సుస్థిర జ్ఞాపకం గా మిగిలిపోయింది. దానిని చూసిన వాళ్ళు, దాంతో ఏ కాస్తయినా ఆడిన వాళ్ళు దాన్నిక ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి అద్భుతం అది. అలా ఎల్లల్లేని ఎన్నో అనుభూతుల్ని మాకు ప్రసాదించిన ‘బంటీ’ గాడి ఆత్మీయ స్మృతికి ప్రేమపూర్వకంగా ఈ చిరు నివాళి!
–గౌరవ్