- ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
- సభ్యులకు కొవిడ్ నిబంధనలు తప్పనిసరి
పార్లమెంటు వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేటినెట్ ఉప సంఘం నిర్ణయించినట్లు సమాచారం. తొలివిడతగా జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. అనంతరం మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడతగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వార్షిక బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జనవరి 29న ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. అనంతరం పార్లమెంటు వాయిదా పడుతుంది. జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు.
కరోనా కారణంగా గత సంవత్సరం పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు. అంతకుముందు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పలువురుఎంపీలు, కేంద్ర మంత్రులకూ కరోనా సోకింది. దీంతో సమావేశాలను అర్థాంతరంగా వాయిదా వేశారు.
ఇదీ చదవండి: సెంట్రల్ విస్టాకు సుప్రీంకోర్టు పచ్చజెండా
ఆర్థిక నిపుణులతో నిర్మలా సీతారామన్ మంతనాలు
మరోవైపు ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థికశాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రముఖ ఆర్థిక నిపుణులు, వాణిజ్యవేత్తలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై కేంద్ర కేబినెట్ నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంటు సభ్యులు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా అమలుచేయనున్నారు. సభ్యులు మాస్క్ ధరించాల్సిఉంటుంది. సమావేశాలకు ముందు పార్లమెంటును పూర్తిగా శానిటైజేషన్ చేయనున్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాల నిర్వహణ కేంద్ర ప్రభుత్వానికి గట్టి సవాలుగా మారనున్నాయి. ముఖ్యంగా రైతు సమస్యలపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో పార్లమెంటు సమావేశాలకు ముందు జరిపే అఖిలపక్షభేటీపై ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి:మెట్టుదిగని సర్కార్, రాజీపడని రైతు