- ఆశనిరాశల సయ్యాట
- సంపన్నులను వదిలి వేతనజీవులపైన భారం
- పైన పటారం, లోన లొటారం
బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు అనగానే దాని చుట్టూ బోలెడు ఆశలు పెట్టుకోవడం, తీరా ప్రకటించిన తర్వాత నిరాశపడడం సర్వ సాధారణంగా జరుగుతున్న అంశం. ఈ ఏడు కూడా దానికి మినహాయింపు కాదని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. “ఆశనిరాశల దాగుడుమూతల ఆట” గానే ఈ బడ్జెట్ ను ఎక్కువమంది భావిస్తున్నారు. అంకెలగారడిగానే అభివర్ణిస్తున్నారు. పైనుంచి చూస్తే చాలా గొప్పగా కనిపిస్తుందని, లోపలికి వెళ్లి సమగ్రంగా విశ్లేషిస్తే, లోటుపాటులన్నీ బట్టబయలవుతాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా, వేతన జీవులకు, సగటు మనిషికి ఈసారి కూడా మొండిచెయ్యే ఎదురైందనే మాటలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ బడ్జెట్ తెలుగురాష్ట్రాలను పూర్తిగా నిరాశపరిచిందని రెండు రాష్ట్రాలకు చెందిన అన్ని రాజకీయ పక్షాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కార్పొరేట్ వర్గాలు మాత్రం హర్షిస్తున్నాయి. మూలధనం వ్యయం 35.4 శాతం పెంచడం, ద్రవ్యలోటు విషయంలో వేసుకున్న ప్రణాళికలు, భూతాపం తగ్గించే దిశగా పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించడం, నగరాల సర్వతోముఖ అభివృద్ధి వైపు ప్రణాళికలు రచించడం మొదలైన అంశాలు అభినందనీయాలని కొందరు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also read: శీతాకాలంలో కశ్మీర్ లో మంటలు
ఆరోగ్యరంగంపై శీతకన్ను
ఐన్ కమ్ టాక్స్ కు ఫైల్ చేసిన తర్వాత సవరణకు రెండేళ్ల వెసులుబాటు కల్పించడాన్ని కూడా మంచి చర్యగానే చూస్తున్నారు. ఆరోగ్య రంగంపై బృహత్ ప్రణాళికలు రచించి, పెద్దమొత్తంలో బడ్జెట్ కేటాయింపులు జరగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేట్ పరం చేశే అంశంపైన తీవ్ర వ్యతిరేకలు వ్యక్తమయ్యాయి. ఈ విధానాన్ని ప్రభుత్వం సమర్ధించుకోవడం పట్ల ఆర్ధిక రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టబద్ధ పాలన దిశగా అడుగులు వేయడానికి ఖర్చుల కోసం కేటాయింపులు జరగకపోవడాన్ని పాలనా రంగ నిపుణులు తప్పుబడుతున్నారు.
Also read: మళ్ళీ కస్సుబుస్సు అంటున్న పెగాసెస్
సవాళ్ళు ఎదుర్కోనేందుకు సంసిద్ధత ఏదీ?
చిన్న పట్టణాల అభివృద్ధి అనే అంశాన్ని పూర్తిగా విస్మరించినట్లు ఈ బడ్జెట్ కేటాయింపులు చెబుతున్నాయని ప్రభుత్వ విధానాల పరిశోధకులు అంటున్నారు. ఆర్ధిక సర్వే నిర్వహణ ద్వారా బడ్జెట్ లో పరిష్కారాలు కనిపిస్తాయనే దాన్ని ఉత్తుత్తి మాటలుగానే చూడాల్సి వస్తోందని వామపక్షాలు మండిపడుతున్నాయి. దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సవాళ్లకు పరిష్కారాలు లభించే విధంగా బడ్జెట్ రూపకల్పన జరగలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజల ఆదాయాన్ని పెంచి, తద్వారా కొనుగోలుశక్తిని బలోపేతం చేసే చర్యలు ఈ బడ్జెట్ లో కనిపించలేదనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. చిన్న -మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చే వాతావరణం కూడా కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. దేశంలో 10 శాతం మంది దగ్గరే 75 శాతం ఆస్తులు, ఆదాయాలు ఉన్నాయని, ఆర్ధిక అసమానతలు తొలగనంతకాలం నిజమైన అభివృద్ధి జరగనట్లేనని ఆర్ధికశాస్త్ర నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉద్యోగఉపాధులు పెరిగి, దేశ ప్రజల ఆదాయం మెరుగయ్యే ఆలోచనలు ఈ బడ్జెట్ లో కనిపించడం లేదని సామాజిక ఆర్ధిక రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. కార్పొరేట్ వర్గాలకు రాయితీలు కల్పించడంపై దృష్టి సారించే ప్రభుత్వం దేశ సమగ్ర ఆర్ధిక వృద్ధిపై సమగ్ర ప్రణాళికలు రచించలేదని ఈ బడ్జెట్ తేట తెల్లం చేస్తోందని సామాజిక ఆర్ధిక శాస్త్ర నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పన్నుల రూపకల్పనలో ఆ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
Also read: అత్యంత ప్రమాదకరమైన వైరస్ భయం!
రైతులకు మొండిచెయ్యి
సూపర్ రిచ్ ( అత్యధిక ధనవంతులు) పై పన్నులు పెంచి, ఆ ఆదాయాన్ని దేశ అభివృద్ధికి కేటాయించడం బదులు, వేతన జీవుల రక్తం పిండడం పైనే ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి సారించాయని వేతన జీవులు మండిపడుతున్నారు. నదుల అనుసంధానం ద్వారా తెలుగు రాష్ట్రాలకు కీడే ఎక్కువ జరుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. పన్నుల వాటాలో,అప్పుల విషయంలో రెండు రాష్ట్రాలకు ఆశించిన ప్రయోజనం దక్కడం లేదని ఇరు రాష్ట్రాల నేతలు విమర్శిస్తున్నారు. అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు లభిస్తే, ఉపాధి కల్పనకు చేదోడుగా ఉంటుందని, ఈ బడ్జెట్ లో అది ప్రతిస్పందించలేదని ఔత్సాహికులు అంటున్నారు. వ్యవసాయం రంగం కూడా విస్మరణకు గురయ్యిందని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రభుత్వ పెద్దలు మాటఇచ్చినా, ఆచరణలో శూన్యమని రైతు సంఘాలు అంటున్నాయి. ప్రత్యామ్నాయ పంటలకు ఎటువంటి కేటాయింపులు జరుగలేదని,గిట్టుబాటు ధరల విషయంలో గ్యారంటీ ఉండేట్లు చట్టబద్ధత చేయాలనే డిమాండ్ కు ఇంతవరకూ కదలిక రాలేదని, రైతులకు అప్పుల భారం ఎక్కువైపోయిందని, మొత్తంగా ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి మరోసారి అన్యాయం జరిగిందని రైతు సంఘాలు బడ్జెట్ పై పెదవి విరుస్తున్నాయి. చిన్న,మధ్య తరగతి పరిశ్రమల విషయానికి వస్తే,ఉత్పత్తితో పాటు వినిమయంపైనా రాయితీలు ఉండాలని, ఈ బడ్జెట్ లో వినిమయం అనే అంశం విస్మరణకు గురయిందని చిన్న, మధ్య తరగతికి చెందిన పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. ద్రవ్యోల్బణం భవిష్యత్తులో పెద్ద సవాల్ గా నిలుస్తుందని, దానిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం మరింత కసరత్తులు చెయ్యాలని ఆర్ధిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. హంగర్ ఇండెక్స్ లో మన దేశం 101 స్థానంలో ఉందని, తక్షణం దీనిపై దృష్టి సారించాలని మేధావులు చెబుతున్నారు.గోడౌన్లలో ఆహార ధాన్యాలు మగ్గిపోతున్నాయని వారు గుర్తు చేస్తున్నారు.
Also read: విజయపథంలో బీజేపీ, ఆప్?
సమన్వయలోపం
రాబడి -ఖర్చు విషయంలో మరింత అప్రమత్తం అవ్వాలని, అప్పులు – కేటాయింపులు – పన్నుల మధ్య సమన్వయం సాధించాలని హితవు పలుకుతున్నారు. కరోనా దుష్ప్రభావాలు అన్ని రంగాలపైనా పడ్డాయి.ఇంకా చాలా రంగాలు కోలుకోవాల్సి ఉంది. అదుపులేని అధిక ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం, ఉపాధిలేమి దేశానికి పెద్ద సవాళ్లు విసురుతున్నాయి. సమాజంలో ఆర్ధిక అసమానతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. బడ్జెట్ రూపకల్పనలో భవిష్యత్తులోనైనా అందరికీ, అన్ని రంగాలకు సమన్యాయం, తగున్యాయం జరుగుతాయని ఆశిద్దాం. బడ్జెట్ -2022పై ఇంకా సమగ్ర విశ్లేషణ జరగాల్సిఉంది.