- నగదు సమీకరణకు భారీ కసరత్తు
- సంక్షేమ పథకాలపై వేటు వేయనున్న మోదీ సర్కార్
దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. కరోనా ఎఫెక్ట్ తో మందగించిన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు నింపేందుకు కేంద్రం పలు ప్రణాళికాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రోజు రోజుకు పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలతో సామాన్యులు ఆర్థికంగా కుంగిపోతున్నారు. ఆర్థిక వనరుల సమీకరణ పేరుతో ఖర్చు తగ్గించుకునేందుకు పలు ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా గ్యాస్ సిలెండర్ పై ఇస్తున్న సబ్సిడీ ఉపసంహరణకు వీలయిన మార్గాలపై కసరత్తు చేస్తోంది.
సబ్సిడీపై భారీగా కోత :
2021-22 బడ్జెట్‌లో పెట్రోలియం సబ్సిడీ కోసం కేంద్రం సుమారు 13 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. 2019-20 సంవత్సరంలో కేటాయించిన దానికంటే ఇవి చాలా తక్కువని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీంతో గ్యాస్ సబ్సిడీని దశల వారీగా తగ్గించడం లేదా కుదిరితే మొత్తం సబ్సిడీకి ఒకేసారి మంగళం పాడే ఎత్తుగడలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. ప్రభుత్వం రంగ సంస్థలలో వాటాలను అమ్మి భారీగా నగదు సమీకరించేందుకు మోదీ సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి పలు ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలను విక్రయించి ప్రైవేటు సంస్థలకు దీటుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం యోచిస్తోంది. దీంతో పాటు సబ్సిడీలు, సంక్షేమ పథకాలను కూడా సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో సంక్షేమ పథకాలకు భారీగా కోత పెట్టనుంది. పలు పథకాల ద్వారా ఇప్పటికే అందిస్తున్న సబ్సిడీలను దశల వారీగా రాబోయే రెండు మూడేళ్లలో తగ్గించే యోచనలో ఉంది.
Also Read: ఆరు స్తంభాల ఆత్మ నిర్భర బడ్జెట్
సబ్సిడీ ఎత్తివేతకు కసరత్తు:
కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పధకం ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు సబ్సిడీతో కూడిన ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్, సిలిండర్ అందిస్తోంది. ఉజ్వల పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు ఎనిమిది కోట్ల మంది వినియోగదారులు లబ్ది పొందుతున్నారు. అయితే ప్రస్తుతం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ కింద కేంద్రం అల్పాదాయ వర్గాలకు ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీని అందిస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 28 కోట్ల ఎల్‌పిజి వినియోగదారులు ఉండగా వీరిలో సుమారు కోటి యాభై లక్షల మంది సబ్సిడీకి అనర్హులు. వార్షిక ఆదాయం 10 లక్షలకు మించి ఉంటే సబ్సిడీని కట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసే సమయంలో వినియోగదారు ఐచ్ఛికంగా సబ్సిడీ వద్దనుకుంటే నిర్ణయంతీసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే దీనికి అంత పెద్దగా స్పందన లేకపోవడంతో ఇక సబ్సిడీపై కోత విధించే దిశగా చర్యలు చేపట్టింది.
Also Read: బడ్జెట్ పద్మనాభాలు పారిశ్రామిక వేత్తలు