Thursday, December 26, 2024

బహుజన విముక్తి మార్గం – బౌద్ధం!

వేద ప్రమాణం కశ్యచిత్ కతృవాదః

 స్నానే ధర్మేచ్చా జాతి వాదప లేపః

 సంతాపారమ్ఛః పాపహానాయ చేతి

 ద్వస్త ప్రజ్ఞానాం పంచలింగాని జాఢ్యే”

“వేదాల్ని ప్రమాణంగా స్వీకరించడం, ఈశ్వరుడనే కర్త ఒకడున్నాడనడం, స్నానాలు చేసి పుణ్యాలు సంపాదించాలనుకోవడం, కులాన్ని చూసుకు అభిమాన పడడం పాపపరిహారార్ధం ఉపవాసం చేయడం బుద్ధిహీనుల జడత్వానికి నిదర్శనాలు” అంటాడు ఏడవ శతాబ్దానికి చెందిన బౌద్ధ తాత్వికుడు, తార్కికుడు అయిన ధర్మకీర్తి.  భారతీయ తాత్విక చింతనను ప్రభావితం చేసిన మతాల్ని రెండుగా విభజిస్తే అవి బ్రాహ్మణ మతాలు, శ్రమణక మతాలనీ,  బ్రాహ్మణ మతాలు యజ్ఞయాగాలు, జపతపాలు, జంతుబలుల్ని పాటించగా, శ్రమణక మతాలు బుద్ధినీ, సంఘాన్నీ, జ్ఞానార్జన మార్గాల్నీ ఆచరించాయంటారు ప్రఖ్యాత చరిత్రకారుడు, సోషలిస్టు పితామహుడు ఆచార్య నరేంద్రదేవ్ తన “బౌద్ధ దర్మ సారం” అనే గ్రంథంలో!

శ్రమణక మతాల సాంస్కృతిక పయనానికి, పరిణామానికీ విశిష్టమైన స్థానం ఉంది. కానీ, దురదృష్టవశాత్తు మనకి వాటి గురించిన అధ్యయనం, పరిశోధన ఎక్కువ జరగలేదు. మనిషి కేంద్రంగా మాట్లాడిన బుద్దుడు మొదట్నుంచీ ప్రపంచానికి కాంతిని ప్రకాశింపజేస్తూనే ఉన్నాడు. ఎడ్విన్ ఆర్నాల్డ్ బుద్దుడ్ని “జగత్తుకి వెలుగు” అంటే, పాత వాసనలు పూర్తిగా పోనివ్వకుండా దాశరథి రంగాచార్య, “బుద్దుడు కలియుగంలో తొలి ఆచార్యుడు.. నాకు బుద్దుడు అయస్కాంతం” అన్నారు. మొదట్నుంచీ బౌద్ధాన్ని కబళించడానికి ప్రపంచవ్యాప్తంగా జరగని ప్రయత్నాలు లేవు.  మన దేశంలో సనాతనం కూడా ఇందుకు అతీతం కాదు. అందుకే బుద్దుడ్ని ఏకంగా విష్ణుమూర్తి అవతారంగా చేసుకుంది. ఐనా, బౌద్ధాన్ని చూసి భయ పడుతూనే ఉంది. ఎందుకంటే, బౌద్ధానికి జ్ఞానాన్వేషణే కానీ బలప్రదర్శన కాదు. అహింసా విధానమేకానీ హింసోన్మాదం కాదు. ఈ దేశంలో బౌద్ధం విలసిల్లిన కాలమే నిజమైన ‘స్వర్ణయుగం’ అందుకనే మహాకవి గురజాడ ఒంగోలు మునిసుబ్రమణ్యానికి రాసిన లేఖలో, “బౌద్ధం అణగదొక్కబడినప్పుడే భారతదేశం మత పరంగా ఆత్మహత్య చేసుకుంది.” అంటారు!

బౌద్ధం ప్రధానంగా శ్రమణక మతమే కానీ, శుద్ధ ఆధ్యాత్మిక మతం కాదు. భౌతిక ప్రపంచ వాస్తవికత గురించే కానీ పరలోక సంబంధిత పదజాలం బౌద్ధంలో లేదు. ఇంకా, కచ్చితంగా చెప్పాలంటే, నాటి హేతుబద్ధ శ్రమణక మతాలైన చార్వాక లోకాయతాల నవీన రూపమే బౌద్ధం. ఈ దేశంలో తలెత్తిన శ్రమణక మతాలన్నీ బహుజన ఉద్యమ స్రవంతులే కానీ బ్రాహ్మణీయవర్గ స్వరూపాలు కావు. అందుకే, ప్రజాశ్రేణుల్లో విస్తృతంగా సాగిన వీటిని అసలు ఒక ‘మతం’ గా గుర్తించాలా, వద్దా? అనే మీమాంస కూడా ఆలోచనాపరుల్లో ఉండేది. విశిష్ట బౌద్ధ తాత్వికుడు, సంఘ సంస్కర్త, డా. బి. ఆర్. అంబేద్కర్ ని ప్రభావితం చేసిన ఆంధ్రుడు ప్రొఫెసర్ పోకల లక్ష్మీనరసు అందుకనే “అసలు బౌద్ధాన్ని మతం అనవచ్చా?” అని ప్రశ్నించారు కూడా. విలక్షణమైన తాత్వికత, విప్లవాత్మక సాత్వికత, కలగలిసిన మానవీయ వైజ్ఞానిక నైతిక మధ్యే మార్గంగా మాత్రమే బౌద్ధాన్ని చూడటం సమంజసం తప్పా ఒక మతంగా కాదనే వైఖరే ఇందుకు కారణం!

మనిషికి మతం అవసరం అని అంబేద్కర్ ఉద్ఘాటించినది సమతావాద మార్గాల గురించే కాని అసమానతలతో నిండిన తంతులూ, తతంగాల మతాల్ని గురించి కాదు. డా. బి. ఆర్. అంబేద్కర్ బౌద్ధ ధర్మ స్వీకారాన్ని కూడా అలా చూడటమే సమంజసం. అది కేవలం ఒక మతం నుండి మరో మతానికి మారడం కాదు. భారతీయ సాంస్కృతిక వికాసానికి దోహదం చేసిన జ్ఞాన మార్గానికి తరలడం. శతాబ్దాల దోపిడీ, పీడన తర్వాత ఒక స్వేచ్ఛాయుత స్వతంత్ర పథంలో నడవడం. ఈ దేశంలో సుమారు వెయ్యేళ్ళు ప్రజాపక్ష వ్యవస్థగా, ప్రజాతంత్ర నిర్మాణంగా విలసిల్లిన ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక స్రవంతిలో స్వచ్ఛందంగా భాగం కావడం. అణచివేతకు గురైన అసంఖ్యాక బహుజనుల ఆశయాలకీ, ఆకాంక్షలకి అండగా నిలబడేందుకొక వేదికను ఏర్పరచడం. మొత్తంగా, అసమానతలు లేని సమసమాజాన్ని ఆచరణాత్మకంగా కాంక్షించడం. అందుకే, ఈనాటికీ అంబేద్కర్ బౌద్ధ స్వీకారం ఆధ్యాత్మికవేత్తల్నీ, సనాతన వాదుల్నీ  భయ పెడుతుంది. లక్షలాది మంది ప్రజలు వారి ఉనికిని ఉన్నతీకరించు కోవడానికి చేసిన ఒక తిరుగుబాటు సనాతనవాదుల్ని కలవర పరుస్తుంది. అతికొద్ది మంది ఆలోచనాపరులే తప్పా ఆనాడు కూడా అంబేద్కర్ ధర్మదీక్షను అర్ధం చేసుకున్న వారు లేరు!

దేశవ్యాప్తంగా అనేక స్రవంతులకి చెందిన వారు బాబాసాహెబ్ పై అవాకులు చెవాకులు పేలుతూ విమర్శిస్తున్న కాలంలో, మహాపండిత్ రాహుల్ సాంకృత్యాయన్ బౌద్ధ ధర్మ స్వీకారం తర్వాత అంబేద్కర్ ని స్వయంగా కలిసి తన సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాక ఏకంగా “నవదీక్షిత బౌద్ధులు’’ అనే రచన కూడా చేసారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధస్వీకారం ఏదో ఆషామాషీ వ్యవహారం కాదనీ సంవత్సరాల పాటు ఆయనలో జరిగిన సంఘర్షణ సారమనీ తెలుస్తుంది. అంబేద్కర్ మహత్తర రచన ‘బుద్ధుడు – అతని ధర్మం’ ని హిందీలోకి అనువాదం చేసిన మహోన్నత బౌద్ధ మేధావి, అంబేద్కర్ సహచరుడు డా. భదంత ఆనంద కౌసల్యాయన్ ” అగర్ బాబా నా హోతే” (బాబాసాహెబే కనుక లేకుంటే?) అనే తన గ్రంథంలో అంబేద్కర్ కి బౌద్ధం పట్ల ప్రారంభం నుండీ ఉన్న అవ్యాజమైన ప్రేమాభిమానాల్ని పేర్కొంటారు!

భారతీయ సామాజికక్రమంలో  అసమానతలకి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా, చరిత్రలో నిల్చి కుట్రలు, కుతంత్రాలతో కనుమరుగైన బౌద్ధాన్ని బాబాసాహెబ్ ఎంచుకోవడం ఈ దేశపు అణగారిన ప్రజల్ని ఒక శక్తివంతమైన వైధానిక మార్గానికి సంధానం చేయాడానికే ననేది స్పష్టం. ఆ రకంగా, బౌద్ధం ఒక ప్రాపంచిక విముక్తి సిద్ధాంతమే కానీ పరలోకాన్నీ, పునర్జన్మను బోధించే మతం ఎంతమాత్రమూ కాదు. “చరథ బిక్కవే చారికం ,బహుజన హితాయ, బహుజన సుఖాయ, లోకానుకంపాయ’ అని నినదించిన బౌద్దానిది సామాజిక విప్లవోద్యమ బహుజన విమోచన మార్గమే కానీ ఆత్మ, పరమాత్మలపై ఆధారపడిన అలౌకిక విధానం కానేకాదు. విశ్వాసాలకు అతీతంగా, కర్మకాండలకు విరుద్ధంగా,  మానవుడే ప్రమాణంగా, మానవతా ప్రధానంగా పునరుద్ధరించబడిన బౌద్ధం నవీన మానవవాద దృక్పథంతో కూడిన “నవయానం” అవుతుందే కానీ, అదెప్పటికీ కూడా అసమానత్వంతో నిండిన సనాతనం లో భాగం కాదు, కాబోదు.

జై భీమ్, జై భారత్!

(అక్టోబర్ 14,బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ ధర్మదీక్ష మహోత్సవం సందర్భంగా…)

గౌరవ్

బహుజన బౌద్ధ సమాఖ్య

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles