14 అక్టోబర్ 1956న నాగపూర్ లో ఆరు లక్షల మందితో బౌద్ధం స్వీకరిస్తూ డా. బి.ఆర్. అంబేడ్కర్ చేసిన 22 ప్రమాణాలు ఇలా ఉన్నాయి. అందొక చారిత్రాత్మక ఘట్టం. కొన్ని వేల ఏళ్ళ పాటు ఈ దేశంలో వర్థిల్లిన జీవన విధానాన్ని ఆయన ‘నవయానం’ పేరుతో పునరుద్ధరించారు. దాని ప్రభావం అక్కడక్కడ సమకాలీనంలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కులమతాల్ని త్యజించి వేలమంది బౌద్ధం స్వీకరిస్తున్నారు. ఈ కృషిలో స్వయం సైనిక్ దళ్ – సమతా సైనిక్ దళ్ (SSD)ల పాత్ర విశేషంగా ఉంది.
- బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను నేను విశ్వసించను, పూజించను. దేవుడి అవతారాలని భావించబడుతున్న రాముణ్ణి, కృష్ణుణ్ణి నేను విశ్వసించను, పూజించను.
- గౌరీ-గణపతి వంటి దేవీదేవతలను కడా నేను విశ్వసించను, పూజించను.
- దేవుడి అవతారాలను విశ్వసించను.
- బుద్ధుడు విష్ణుమూర్తి అవతారాలలో ఒకడని విశ్వసించను. అదొక పిచ్చిపనని , అదొక అబద్ధపు ప్రచారమని నమ్ముతాను.
- శ్రాద్ధకర్మలు నిర్వహించను. పిండ ప్రదానం చేయను.
- బుద్ధుడి బోధనలు అతిక్రమించే విధంగా వ్యవహరించను.
- బ్రాహ్మణులతో ఏ పూజాకార్యక్రమాలు జరిపించను.
- మానవ సమానత్వాన్ని సంపూర్ణంగా నమ్ముతాను.
- సమాజంలో సమానత్వ స్థాపనకు సంపూర్ణంగా కృషి చేస్తాను.
- బుద్ధుడి అష్టసమ్యన్ మార్గాన్ని అనుసరిస్తాను.
- బుద్ధుడు నియమించిన పది పరిపూర్ణత్వ – పరిమితులు అనుసరిస్తాను.
- జీవరాసులన్నింటి పట్ల ప్రేమ – సుహృద్భావంతో వ్యవహరిస్తాను. వాటన్నింటినీ కాపాడుకుంటాను.
- దొంగతనం చేయను.
- అబద్ధాలు చెప్పను.
- కామ, క్రోధాలకు సంబంధించిన నేరాలు చేయను.
- మద్యపానానికి గాని, మాదక ద్రవ్యాలకు గానీ బానిసను కాను. (13-17 వరకూ ఉన్నవి నైతికతకు సంబంధించిన అయిదు ముఖ్య సూత్రాలు)
- నిత్య జీవితంలో ఆర్యాష్టాంగమార్గాలు NOBLE EIGHT FOLD PATH (పాలి: అరియ అత్తంగిక మగ్గ) అనుసరిస్తాను. (1. సరైన దృష్టికోణం 2. సరైన పరిష్కారం 3.సరైన మాట 4. సరైన గుణం 5. సరైన జీవన విధానం 6. సరైన ప్రయత్నం 7. సరైన ప్రజ్ఞ 8. సరైన సమాధి. ఈ ఎనిమిది మార్గాలు ప్రతిఫలించే విధంగా బుద్ధుడి ధమ్మచక్రం రూపొందించబడింది)
- అసమానతను, అమానవీయ కార్యాలను ప్రోత్సహిస్తూ, ప్రగతి నిరోధకంగా ఉన్న హిందూమమతాన్ని త్యజించి, నేను బౌద్ధాన్ని స్వీకరిస్తున్నాను.
- బౌద్ధధమ్మం మాత్రమే మానవాళికి మేలు చేస్తుందని నమ్ముతున్నాను.
- బౌద్ధం స్వీకరించడం వల్ల నాకు ఒక కొత్త జన్మ లభించినట్లు భావిస్తున్నాను.
- ఇక నుండి నా జీవితాన్ని బుద్ధుడి బోధనలను అనుసరించి మాత్రమే తీర్చిదిద్దుకుంటానని, బౌద్ధధమ్మం ప్రకారమే జీవిస్తాననీ మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నాగపూర్ లో ధమ్మదీక్ష తీసుకున్న ఆ స్థలం ‘దీక్షభూమి’గా ప్రసిద్ధికెక్కింది. అక్కడ ఈ ఇరవై రెండు ప్రమాణాలతో ఒక శిలాఫలకం ఏర్పాటయింది.
Also read: వాల్మీకి రామాయణంలో రాముడు దేవుడు కాదు
(మెల్బోర్న్ నుంచి)