Saturday, November 23, 2024

రైతు ఉద్యమాన్ని బలపర్చిన బుద్ధుడు

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వ్యవసాయం గురించి ఓ మాట చెప్పారు. Everything else can wait, but not agriculture అని! కాలాలు మారిపోవచ్చు. కాని, మనిషి ప్రాథమిక అవసరాలలో అతి ముఖ్యమైన ఆహారోత్పత్తి ఆగకూడదు. ఆలోచన, బాధ్యత లేనివారే దానికి విఘాతం కలిగిస్తారు. 2021లో కూడా అదే చూశాం. భారత ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాల్ని రైతులు తిప్పికొట్టారు. 14 నెలల పాటు ఉద్యమించిన రైతులు కేంద్ర ప్రభుత్వపు మెడలు వంచగలిగారు. 750 మంది రైతులు ప్రాణత్యాగం చేయాల్సివచ్చినా, ఉద్యమ తీవ్రతను తగ్గించుకోలేదు. విధిలేక ప్రభుత్వం నల్ల చట్టాల్ని వెనక్కి తీసుకుంది. ఒకప్పుడు గౌతమ బుద్ధుడు కూడా వ్యవసాయదారులకు వెన్నుదన్నుగా నిలబడ్డాడు. వారి ఉద్యమాన్ని బలపరిచాడు. ఫలితంగానే తన అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది వైదిక ధర్మకర్తలకు నచ్చలేదు. అందుకే ఘర్షణలు జరిగాయి.

Buddhist Monks Join Farmers In Their Agitation
రైతు ఉద్యమంలో పాల్గొన్న బౌద్ధభిక్షువులు

యజ్ఞయాగాల్లో పశువుల్ని ముఖ్యంగా గోవుల్ని, ఎద్దుల్ని బలి ఇవ్వడం ఒకప్పుడు వేద సాంప్రదాయంలో నిత్యకృత్యంగా ఉండేది. ఆ చర్యతో వ్యవసాయం చేసేవారికి పశువుల కొరత ఏర్పడి, వ్యవసాయం కుంటుపడింది. పశువుల మాంసం నిలువ ఉండదు. కానీ, అవే పశువుల్ని యజ్ఞాల పేరిట వధించకుండా, వాటిని వ్యవసాయానికి ఉపయోగిస్తే అనేక రకాల తృణధాన్యాలను పండించుకోవచ్చు. ఆ ధాన్యం సమాజానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది ఆకలి తీరుతుంది – అది ఆ నాటి వ్యవసాయదారులు గ్రహించారు. అందుకే రైతులు తిరగబడ్డారు. యజ్ఞగుండాల్ని ధ్వంసం చేశారు. వారు అనుకున్న దానికి వ్యతిరేకంగా సమాజ పరిస్థితులు మారిపోవడం వల్ల – వేద రుషులు, బ్రాహ్మణులు నాటి వ్యవసాయదారుల్ని ‘రాక్షసులు’ అని పిలిచి – తమ ఉక్రోషం వెళ్ళగక్కుకున్నారు. దేవతలు ఎలాగైతే కల్పితాలో, రాక్షసులు, దయ్యాలు, భూతాలు అన్ని కల్పితాలే కదా? వాస్తవాలు గ్రహిద్దామనుకునేవారికి విషయం బోధపడుతుంది. ఆ నాటి యజ్ఞ సంస్కృతికి, పశుబలికి వ్యతిరేకంగా వ్యవసాయదారులు చేసిన తిరుగుబాటు, అహింసా సిద్ధాంతానికి దారి తీసింది. దాన్నే బుద్ధుడు ఒక తాత్త్విక సిద్ధాంతంగా ప్రతిపాదించాడు. క్రతువుల్ని, పశుబలుల్ని, యజ్ఞయాగాల్ని తీవ్రంగా నిరసించాడు. అది వ్యవసాయదారులకు బలాన్నిచ్చింది. బుద్ధధమ్మం సమాజం మీద బలంగా ప్రభావం చూపుతున్న కాలం గనక, రైతులోకం – బుద్ధుడి అహింసా సిద్ధాంతాన్నే కాక, ఇతర అంశాల్ని కూడా తలకెత్తుకుంది. ఎలాగయితేనేం వ్యవసాయం అభివృద్ధి చెందింది.

Also read: మనిషి పక్షాన గొంతెత్తిన – పేరలింగం

మొత్తానికి మొత్తంగా కాకపోయినా, బుద్ధుని అహింసా సిద్ధాంతం జంతు బలిని ఆపింది. యజ్ఞసంస్కృతిని అడ్డుకుంది. ఆ పరిణామం సమాజంలో గుణాత్మకమైన మార్పుకు దోహదం చేసింది. మరొక రకంగా వ్యవసాయాభివృద్ధికి, ఉత్పత్తి శక్తుల పెరుగుదలకు బౌద్ధం కారణమయ్యింది. సమాజంలో అధిక సంఖ్యాకులకు పని దొరికింది. జనం ధాన్యం పండించడం కొనసాగించారు. మాంసాహారం మీద ఆధారపడ్డ సమాజం క్రమక్రమంగా శాకాహారంలోకి మారడం జరిగింది. నైతికతను స్థాపంచడంలోనే కాదు, బౌద్ధం ఇతరత్రా మానవ ప్రవృత్తిలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. జాలి, కరుణ, మానవత్వం వంటి లక్షణాలకు విలువ పెరిగింది. ఏ కాలంలోనైనా ‘రైతుల్ని బాధించినవారు ప్రగతికాముకులు కాదు’- అని తేలింది.

Also read: ఇవి కేవలం భారత దేశంలోనే జరుగుతాయి!

ఇది ఇలా ఉంటే, మరో వైపు వైదిక ధర్మప్రబోధకుల, మనువాదుల పనులు మరోలా ఉండేవి. వీరి స్మృతులు మానవీయ విలువలకు పెద్ద విఘాతం కలిగించేవి. ఇందులో మనువు ఏమన్నాడంటే – ‘‘ధర్మాన్ని కులకట్టుబాట్లని దాటినవారితో మిథ్యాచారులతో – స్వంతంత్రంగా ఆలోచించేవారితో అంటే – హేతువాదులతో ఎవరూ మాట్లాడగూడదు-’’ అని. (మనుస్మృతి 430)ఇందులో చెప్పిన ధర్మం, కులాలు మనువు ఏర్పరిచినవే – అంటే నిర్ద్వంద్వంగా అతను చెప్పింది చెప్పినట్టుగా ఆచరించాలని ఆదేశించడం. ఇదీ మన స్మృతులు మనకు అందించిన గొప్ప సంస్కృతి. భారతీయ సంస్కృతి అంటే ఇదా? ప్రస్తుతం సంఘ్ పరివార్ వారు తిరగతోడుతున్నది ఈ సంస్కృతినేనా? శ్రమ చేసేవారు ఆలోచించగూడదు. ఆలోచించేవారు శ్రమించగూడదు. అదీగాక, ఆలోచించేవారితో మాట్లాడగూడదు. ఇదెక్కడి న్యాయం? ధర్మం నాలుగు పాదాల మీద నడవాలని అంటారే? అదేమైనా జంతువా నాలుగు పాదాలమీద నడవటానికీ? అక్కడ వారు చెప్పేది నాలుగు పాదాలు కాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలు. అవి అలాగే విభజించబడే ఉండాలని మనువాదుల భావన. సంకరం జరగగూడదని వారి భయం. అసలైత సంకరం జరిగిన తర్వాత ఏర్పడిన ‘మిశ్రమసంతతి’లోంచే ఇప్పటి ఈ మానవజాతి అంతా పుట్టుకొచ్చింది. వాస్తవాలు తెలుసుకోకుండా రాసుకున్న అనాగరిక, అమానవీయ రచన- మనుస్మృతి.

Also read: భిన్నత్వంలో ఏకత్వం: మా‘నవ’వాదం

బ్రాహ్మణుడు నాగలి తాకకూడదు. కానీ, శూద్రులు కష్టపడి పండించినింది తీరిగ్గా కూర్చొని భోంచయ్యొచ్చు. పైగా తమ ఊకదంపుడు ధర్మోపన్యాసాలుగా మార్చి…నిరంతరం చెపుతూ ఉండొచ్చు. ఇదేం పద్ధతి? ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, శారీకర శ్రమను చాలా నీచంగా చూశాయి.శారీరక శ్రమ చేసేవారిని పందులతో, కుక్కలతో సమానం చేశాయి (చాందోగ్యోపనిషత్ 5-10-8) శారీరక శ్రమ తప్పించుకుని, ఉన్నత స్థానం ఆక్రమించిన వీరు, సమాజాన్ని ముందుకు నిడిపే ఆలోచనలేమైనా చేశారా? అంటే అదీ లేదు. ఎంతసేపూ వెనకచూపే కదా?బౌద్ధం – హిందూ మతంలో భాగం అని కొందరు వాదిస్తుంటారు. మరి అదే నిజమైతే, లక్షలమంది బౌద్ధ భిక్షువుల్ని నరికి – నలంద, తక్షశిల లాంటి ఆనాటి బౌద్ధవిశ్వవిద్యాలయాల్ని ధ్వసం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒకప్పటి బౌద్ధారామాల్ని బలవంతంగా ఆలయాలుగా ఎందుకు మార్చుకున్నారు? హిందూ దేవుళ్ళ అవతారాలలో బుద్ధుణ్ణి ఎందుకు చేర్చుకున్నారు?  ఈ దేశాన్నుంచి బుద్ధుడి ఆలోచనా విధానాన్ని పారద్రోలడానికి చేసిన కుట్రలు కాదా ఇవన్నీ?

Life of the Buddha
బుద్ధుడి జీవితంలో వ్యవసాయదారుల ఉద్యమాల సమర్థన

తాను బౌద్ధానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చానన్నది డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చాలా వివరంగా చెప్పుకున్నారు – ‘‘నేను ఎందుకు బౌద్ధానికి ప్రాధాన్యత ఇచ్చానంటే… అది మూడు సిద్ధాంతాల కలయిక! మతాలన్నీ భగవంతుడు, ఆత్మ, మరణానంతర జీవితం, పునర్జన్మల గురించి చెపుతాయి. బౌద్ధం – ప్రజ్ఞ గురించి బోధిస్తుంది. మూఢనమ్మకాలకూ, అతీత శక్తులకూ వ్యతిరేకంగా కరుణను బోధిస్తుంది. సమతను బోధిస్తుంది. భూమి మీద ఆనందంగా బతకడానికి ప్రతి వ్యక్తికీ ఇవి అవసరం. బౌద్ధం లోని ఈ మూడు అంశాలు నన్ను ఆకర్షించాయి. ఆ మూడు సిద్ధాంతాలే ప్రపంచాన్ని ప్రభావితం చేయాలి!

‘‘భగవంతుడు గానీ, ఆత్మగానీ, సమాజాన్ని కాపాడలేవు. నా సామాజిక తాత్త్వికత మూడు మాటల్లో ఇమిడి ఉంది. 1. స్వేచ్ఛ. 2. సమానవత్వం. 3.సౌభ్రాతృత్వం’’ అని అన్నారు అంబేడ్కర్.

Also read: మనువాదుల ఇటీవలి పరిశోధనలు

చెమటను, కష్టాన్ని దోపిడీ చేసేవారికి వ్యతిరేకంగా మార్క్సు, ఏంగిల్స్ నిలబడ్డారు. ఒక రకంగా ఆ కాలంలో బౌద్ధం చేసిందే తర్వాతి కాలంలో మార్క్సిజం చేసింది. అంటే, బౌద్ధానికి దాదాపు ఆధునిక రూపమే మార్క్సిజం. అంతిమంగా మానవీయ విలువల పరిరక్షణే వీటి ధ్యేయం! అయితే, కాలానుగుణంగా మారిన ఆధునిక సమాజపు అవసరాలకు తగినట్టు మార్క్సిజం రూపుదిద్దుకుంది. ఇంకా ఇంకా అనేక అంశాల్ని చేర్చుకుంటూ అది విశాలం అవుతుందే తప్ప, చాదస్తాలతో కుంచించుకు పోదు. పండు వృక్షాలు నేలవాలక తప్పదు. కొత్త మొలకలదే కదా రాబోయే కాలం? ఏ ఇజమైనా సరే, సైన్సును కలుపుకుంటూ, దాన్ని సమర్థించుకుంటూ పోవాల్సిందే! నిరంతరం సాగే ప్రవాహం లాంటిది విజ్ఞానశాస్త్రం. అది అన్ని రకాల జీవన విధానాల్ని ఒరుసుకుంటూ, తనదైన వినూత్న శైలిలో ముందుకు సాగుతుంది. నిలువ వున్న నీటి గుంటల లాంటివే మతాలు. నిలువ ఉన్న నీరు ఎప్పుడైనా మురికిగా మారాల్సిందే! జీవన విధానాలైనా, జీవన శైలులైనా, ఆలోచనా విధానాలైనా ప్రవాహాల్లాగా జలజల పారుతున్నప్పుడే అవి కొంతవరకు స్వచ్ఛంగా ఉండే అవకాశాలు ఉంటాయి.

Also read: బహుజన చక్రవర్తి అశోకుడు ఎందుకు ‘గ్రేట్’?

ఒక సారి బుద్ధుణ్ణి అశ్వలాయనుడు అనే అతను వెతుక్కుంటూ వచ్చి వాదనకు దిగాడు. బ్రాహ్మణులు బ్రహ్మముఖం నుండి పుట్టారనీ, వారే శ్రేష్టులన్నది – ఆయన వాదన! అందుకు బుద్ధుడు ఇలా చెప్పాడు – ‘‘ఓయీ, అశ్వలాయనా! బ్రాహ్మణస్త్రీ రుతుమతి అవుతుంది. గర్భిణి అవుతుంది. శిశువును కంటుంది. శిశువుకు పాలిచ్చి ఆలనాపాలనా చూసుకుంటుంది. ఇతర వర్గాల్లో, ఇతర కులాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఏ మాత్రం తేడా లేదు. అయినప్పుడు కొందరు బ్రహ్మముఖం నుండి పుట్టడమేమిటీ? ప్రకృతి విరుద్ధం కదా?’’- అని ప్రశ్నించాడు బుద్ధుడు. దానితో కులవ్యవస్థ దుర్మార్గాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు కూడా! స్మృతుల కాలానికి కులవ్యవస్థ దారుణంగా తయారైంది. నాలుగో వర్గంగా గుర్తింపబడిన శూద్రుల పరిస్థితి చాలా చాలా దిగజారింది. సరే, మనమిప్పుడు  ఆధునిక దృక్పథంతో ఆలోచిస్తే  – అసలు బ్రహ్మ కల్పిత పాత్ర కదా? ఓ కల్పిత పాత్రకు వాస్తవంగా ఉన్న ఈ మనుషులు పుట్టడమేమిటీ?  పొసగని వ్యవహారంగా ఉంది.

‘‘ప్రశాంతంగా కూర్చుని ఉన్నప్పుడు మీ స్వీయ తప్పిదాలపై దృష్టి సారించండి. మిత్రులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇతరుల తప్పొప్పుల చిట్టా తెరవకండి’’- అన్నాడు సాక్యముని బుద్ధుడు. నిజమే- ఊరికే వారి మనోభావాల్ని దెబ్బతీసుకోకుండా, తమ తమ పూర్వీకులు చేసిన తప్పిదాలేమిటీ? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అనేది ఆలోచించుకుంటే బావుంటుంది. అబద్ధమే రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి రోజూ మనం నిజాన్ని ప్రచారంలో ఉంచుతూ ఉండాలి. తప్పదు- ‘‘మార్క్సిజం అర్థమైతే బౌద్ధం బాగా అర్థమవుతుంది’’ – అన్నాడు రాహుల్ సాంకృత్యాయన్. దీని గురించి నేటి యువతరం సీరియస్ గా ఆలోచించాలి. అంతేకాదు, సైన్సును పక్కన పెట్టే ఇజాలు, రాజకీయ పార్టీలు, నేతలు,మతాలు, మతప్రచారకులు, మనుషులు…అన్నింటికి అన్ని – అందరికందరూ ఇంకా ఇంకా మూఢత్వంలో కొట్టుకుంటున్నారని మనం అర్థం చేసుకోవాలి. మార్పుకోసం పథకాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఆచరణల పెడుతూ ఉండాలి! మరో వైపు ప్రజావ్యతిరేక ప్రభుత్వాల్ని నిలదీస్తూనే ఉండాలి. ఇటీవల కొనసాగిన రైతు ఉద్యమం నుంచి దేశప్రజలంతా స్ఫూర్తిని పొందాలి.

Also read: మనుస్మృతిలో మాంసభక్షణ గూర్చి ఏముంది?

(రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles