Thursday, November 21, 2024

ప్రకృతి శరణం గచ్ఛామి

బుద్ధం శరణం గచ్ఛామి

ధర్మం శరణం గచ్ఛామి

సంఘం శరణం గచ్ఛామి

అనే దాంట్లో మూడు విషయాలున్నాయి. 1.బుద్ధం 2. ధర్మం. 3 సంఘం. బుద్ధం శరణం అంటే బుద్ధుణ్ణి శరణుకోరమని కాదు. తనని శరణు కోరమని. తనని గురువుగానో, దేవుడిగానో భావించమని బుద్ధుడు ఎప్పుడూ చెప్పలేదు. బుద్ధం అంటే జ్ఞానం-అని అర్థం! జ్ఞానోదయమైంది గనుకనే సిద్ధార్ఠుడు బుద్ధుడయ్యాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవల్సిందేమంటే జ్ఞానాన్ని శరణు కోరి ముందుకు సాగండి అని. అలాగే, ధర్మం అంటే ప్రకృతి ధర్మం అని అర్థం. ప్రకృతి ధర్మానుసారంగా నడుచుకోండని – అంతేగాని మనిషి మధ్యలోకల్పించుకున్న ఏవో ధర్మాలకు కట్టుబడి ఉండమని కాదు. ప్రకృతి ధర్మాలను అర్థం చేసుకుని, ప్రకృతిలో గల కార్యకారణ సంబంధాల్ని అర్థం చేసుకుని ముందుకు సాగండి అని! ‘ధర్మోరక్షతి రక్షిత:’ – అంటే ప్రకృతి ధర్మాన్ని రక్షించుకుంటే – ఆ ప్రకృతి ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని. తర్వాత సంఘం – నీ చుట్టూ ఉన్న సంఘాన్నీ, దాని కట్టుబాట్లనూ గుర్తిస్తూ అందులో ఒదుగుతూ, ఇమిడిపోతూ మాత్రమే ముందుకు సాగమని అర్థం.

Also read: కరోనా నేర్పిన కొత్త పాఠాలు

ముందుగా జ్ఞానం

ఈ వరుసలో బుద్ధం (జ్ఞానం, వివేకం) ఎందుకు మొదటగా వచ్చిందీ? అంటే, ముందు రావల్సింది అదే గనక! ప్రకృతిలో గల జంతువృక్ష సంపదలో మనిషి కూడా ఒకడు. అతడు తనని తాను గుర్తించుకున్నాడు. తను వృక్షాన్ని కాదు అని మొట గుర్తించుకున్నాడు. తర్వాత జంతు దశ నుండి పరిణామం చెందుతూ మానవుడిగా మారాడన్న విషయం గుర్తించుకున్నాడు. అలా గుర్తించుకునే జ్ఞానం వృక్షాలకూ, జంతువులకూ లేదు. ఆ జ్ఞానం, ఆ స్పృహ ఉన్నవాడు గనకనే వృక్షాల్ని, జంతువుల్ని, నదుల్ని, సముద్రాల్ని, కొండల్ని, పర్వతాల్ని, అగ్నిని, వాయువును, మేఘాల్ని, గ్రహాల్ని, సూర్యుణ్ణి అన్నింటినీ గుర్తించగలిగాడు. ఆధునిక జీవశాస్త్రం చెప్పిన పరిణామ శాస్త్రం లోని అంశాలు ఇవే.

Also read: దయ చేసి దిగిపోండి: అరుంధతీరాయ్

ఈ సృష్టిలో తనెవరో తను తెలుసుకుని, తన చుట్టూ ఉన్న పరిసరాల్ని అవగతం చేసుకుని, తన కళ్ళ ఎదుట కనిపంచని ఎన్నో అంశాల్ని కాలక్రమంలో అవగాహన చేసుకుంటూ క్రమక్రమంగా ఆధునికుడవుతూ వచ్చాడు. ఇక్కడ వేల  సంవత్సరాల క్రితం సాధారణ యుగానికి ముందు (Before common era) బుద్ధుడు చెప్పింది కూడా అదే. ఆయన చెప్పిన ధమ్మం – అంటే ధర్మం – అదే ప్రకృతి ధర్మం – దానికి కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలు అర్థం కావాలంటే కార్యకారణ సంబంధాల్ని అర్థం చేసుకోవాలి. ఆధునిక హేతువాదులు, వైజ్ఞానిక పరిశోధకులూ చెపుతున్నదీ అదే. ప్రకృతికీ, ప్రకృతి నియమాలకూ ఒదిగి, పరిశీలనకు, పరిశోధనలకు పూనుకున్న వైజ్ఞానికులు మాత్రమే అనునిత్యం కొత్త కొత్త అంశాలు వెలికితీయగలుగుతున్నారు. అందుకు బుద్ధుడు చెప్పిన రెండో అంశం – ప్రకృతి ధర్మం!

Also read: ‘రే’ ను గూర్చి రేఖామాత్రంగా

మనిషి సంఘజీవి

ఇక మూడోది సంఘం – మనిషి సంఘజీవి – అనేది బుద్ధుడు గ్రహించాడు. మొదట చిన్న చిన్న గుహల్లో గుంపులుగా బతకడం దగ్గర్నుంచి కుటుంబ వ్యవస్థ నుంచి ఒక సమాజం దాకా – ఏర్పడటం జరుగుతూ వచ్చింది. స్వార్థం, ఈర్ష్య, పగ, ప్రతీకారం వంటివి సహజ లక్షణాలుగా స్థిరపడుతూ వచ్చాయి. బలవంతులు పాలకులై న్యాయం, ధర్మం, నైతికత నిలపడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. సమాజంలో కొందరు దోపిళ్ళు, అఘాయిత్యాలు కూడా చేశారు. మానవ జీవితంలో సంఘం ఒక ప్రధాన పాత్ర వహిస్తుందని బుద్ధుడు గ్రహించాడు. అందువల్ల ఆయన చెప్పిన అంశాల్లో దాన్ని మూడో అంశంగా చేర్చాడు. రాజకుమారుడైన సిద్ధార్థుడికి జ్ఞానోదయం కావడం – అంటే ఆయన బుద్ధుడు కావడం – సుఖజీవితాన్నిచ్చే నగర జీవితంలోంచి అరణ్యంలోకి పోయినప్పుడు ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రేమిస్తూ, అధ్యయనం చేస్తూ విషయాలు అర్థం చేసుకున్నాడు. జీవరాసులన్నింటికీ ఆధారమవుతూ వస్తున్న మొక్కల్ని, పూల, వృక్షాల గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాడు. కీటకాలు నిర్వర్తిస్తున్న విధుల్ని గమనించాడు. క్రూరజంతువుల స్వభావాల్ని, అవి నిర్వహిస్తున్న పాత్రనూ గ్రహించాడు. ఆకాశాన్ని, మబ్బుల్ని, వర్షాల్ని, ఎండల్ని, కనిపించే సూర్యచంద్రుల్ని గమనించి – కనిపించేదే కాదు, కనిపించని మహావిశ్వం ఇంకా ఇంకా ఉంది – అని ఊహించాడు. వాటన్నిటి మధ్య మావన జీవితం  ఏమిటి? అని ప్రశ్నించుకున్నాడు. అసలు కార్యకారణ సంబంధాన్ని కనిపెట్టగలిగాడు గనకనే ఈ విశ్వాన్ని నిడిపించే శక్తి ఏదీ లేదని ఘంటాపథంగా చెప్పగలిగాడు. జంతువులు ఒకదానికి మరొకటి సమాయం చేసుకోవడం చూసి, మనిషి కూడా అలాంటి సేవాభావంతోనే ఉండాలన్నాడు. దయ, ప్రేమ, స్నేహం, సాహార్ద్రత, మంచి పలుకు, మన్నన వల్లనే మనిషి విలువ పెరుగుందన్నది అర్థం చేసుకున్నాడు. జంతు ప్రవర్తన కన్నా మనిషి విలువ పెరుగుతుందన్నది అర్థం చేసుకున్నాడు. జంతు ప్రవర్తన కన్నా మనషి స్వభావం మిన్నగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. బుద్ధుడి కంటే ముందే చార్వాకులు సమాజంలో హేతుబద్ధత కావాలన్నారు. ఎన్నో ప్రశ్నలు సంధించారు.  బుద్ధుడి ఆలోచనలు రూపుదిద్దుకోవడంలో అవి కూడా కొంతవరకూ ఉపయోగపడ్డాయి. వాటన్నిటి ఫలితంగా ఒక నూతన జీవన విధానానికి రూపకల్పన జరిగింది.

Also read: భారత్ లో మిగిలింది మనువాద మార్క్సిజమా?

ఇప్పుడు ఈ 21వ వైజ్ఞానిక శతాబ్దంలో ఇవన్నీ మనకు చాలా ప్రకృతిని అర్థం చేసుకుని, జీవహింసను నిరసిస్తూ, మానవ ప్రవృత్తిని విశ్లేషిస్తూ బుద్ధుడు తన జ్ఞాన సారాన్ని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు. ఇదంతా సులభంగా ఏమీ జరగలేదు. అందరు రాజకుమారుల్లాగా సిద్ధార్థుడు కూడా సుఖాలనుభవిస్తూ రాజభవనంలో గడిపి ఉంటే ఈ రోజు ప్రపంచానికి శాంతి, అహింసల దివ్వసందేశాన్ని అందించిన బుద్ధుడు ఉండేవాడు కాదు. అందువల్ల, మనమేమిటీ? మన ధ్యేయమేమిటీ? మనం మన సమాజానికి ఏమివ్వగలం? అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటూ ఉండాలి! మనమిప్పుడు బుద్ధుడి కాలంలో లేము. సుమారు రెండున్నర వేల సంవత్సరాలు ముందుకు నడిచి వచ్చాం. అంటే అన్ని విషయాలలోనూ అన్ని రెట్ల పరిపక్వత సాధించినవారిగా నిలబడాలి కదా!

Also read: ‘రామ్ చరిత్ మానస్’ లో తులసీదాసు ఏమి రాశారు?

సంకుచిత ధర్మం

నిచ్చెనమెట్ల కులవ్యవస్థతో సమాజాన్ని విడగొట్టిన  వైదికుల మనుధర్మశాస్త్రం – నా ధర్మం, నీ ధర్మం, కులధర్మం, మతధర్మం, రాజధర్మం, స్వధర్మం- అంటూ ఒక సంకుచిత ధర్మాన్ని ప్రబోధించింది. వారు ‘‘ధర్మో రక్షత రక్షిత:’’ – అని అంటే, ఈ కుల ధర్మాలు ఇలాగే వర్థిల్లాలి. వాటివల్ల ధర్మం రక్షించబడుతుంది అని వారి భావం. ధర్మం అంటే ప్రకృతి ధర్మం అనే విశాలదృక్పథానికి వారు ఎదగలేక పోయారు. ఎదిగిన బౌద్ధాన్ని నాశనం చేసి, తమ సంకుచిత ధర్మాలతో జీవితాల్ని దుర్భరం  చేశారు. పైగా అబద్ధాలతో ఆధిపత్యంలో కొనసాగినా, వారిలోని డొల్లతనం కొట్టొచినట్టు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ప్రకృతి అంటే జీవులు, గ్రహాలు, నదులు మాత్రమే కాదు. జీవరాసుల్లో ప్రతి అణువులోని ఎలక్ట్రాన్లూ, ప్రోటాన్లూ, న్యూట్రాన్లూ కూడా ప్రకృతే. రేడియో తరంగాలు, 5 జీబీ తరంగాలూ ప్రకృతే. విషరసాయనాల పర్యవసానాలు, కాలుష్యాలు వాటి కారకాలూ ప్రకృతే.  మానవత్వ పరిరక్షణ ప్రకృతిలో ఎలా భాగమో, మానవ విధ్వంసం కూడా ప్రకృతిలో భాగమే. ఇవన్నీ బుద్ధుడి కాలానికి లేవు- వెలుగలోకి రాలేదు. కాలం గడుస్తున్న కొద్దీ మనిషికి కొత్తకొత్త సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఒకరకంగా ఇప్పుడు ప్రకృతి ధర్మం అం – అది మానవుడి ‘‘ప్రకృతి-వికృతుల పర్యవసానం!’’ ఎన్నెన్ని మార్పులు వచ్చినా, బుద్ధుడు ఇంకా ఈ కాలానికి ఎందుకు అవసరం అంటే…ఆయన బోధించిన సత్యం-చిత్తశుద్ధి-కార్యకారణ సంబంధం-నైతిక విలువలు- దేవుడు లేడన్న వాస్తవం వల్ల- అవసరం! ఇవి ఇప్పటికీ, ఎప్పటికీ మానవ జాతికి అవసరమైనవే.

Also read: మహామానవతావాది – సర్ చార్లీ చాప్లిన్

‘నేను’ను జయించినవాడు బుద్ధుడు

‘నేను’ను జయించినవాడు బుద్ధుడు. నేను నడుస్తున్నాను. నేను తింటున్నాను – అంటూ ఏదో వ్యవహరాంలో వాడడంలో తప్పులేదు కానీ, నేను, నా స్థాయి, నా హోదా, నా వంశం – ఇలా మిగతా ప్రపంచం నుండి విడివడి తమకు తాము ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించుకుని కొందరు భ్రమలో బతుకుతుంటారు. అలాంటి భావానికి బుద్ధుడు వ్యతిరేకం. మానవజాతి అంతా ఒకటే – అందరూ సమానులే అయినప్పుడు నేను నేను అంటూ విర్రవీగడంలో అర్థం లేదంటాడు బుద్ధుడు. ఆయన ఎక్కడైనా ‘నేను’ అనే పదాన్ని వాడవల్సివస్తే ‘తథాగతుడు’ అని వాడేవాడు. తథాగతుడు అంటే సత్యాన్ని తెలుసుకున్నవాడు – అని అర్థం. ఉదాహరణకు ఎవరైనా ‘నేను రాస్తున్నాను’ అని అన్నారనుకోండి. మన మామూలు పరిభాషలో నేను అనేది కర్త. రాయడం అనేది క్రియ. కాని బుద్ధుడి ప్రకారం నేను అనే కర్త అక్కడ లేడు. మరి కర్త ఎవరూ? అంటే రాయాలి అనే గాఢమైన కోరికే కర్త.  ఇలా అనుకున్నప్పుడు నేను అనే మనిషి అక్కడ ఉండడు కదా? ‘‘రాయాలి’’ అనే సంస్కారం మాత్రమే ఉంటుంది. రాయాలన్న కోరిక కారణమైతే, జరిగే కార్యం – రాయడం. ఈ కార్యకారణ సంబంధం అనేది బుద్ధుడి బోధనల్లో ఒక సూక్ష్మమైన అంశం! దీనినే బౌద్ధులు ప్రతీత్వ సముత్పాతం/ధర్మచక్ర ప్రవర్తితం-అని అంటారు.

Also read: బౌద్ధ మార్క్సిస్టు – రాహుల్ సాంకృత్యాయన్

వైదిక ధర్మ  పునరుద్ధరణ

వైదిక ధర్మాన్ని పునరుద్ధరించుకునే క్రమంలో – జన జీవితంతో గాఢంగా ముడివడి ఉన్న ఆ నాటి బౌద్ధంలోని ఎన్నో అంశాల్ని వైదికులు స్వీకరించారు. యజ్ఞయాగాల్లో జంతుబలులు మానేశారు. అహింసను పాటించారు. శాకాహారులుగా మారిపోయారు. జంతుబలులకు ప్రత్యామ్నాయంగా గుళ్ళల్లో కొబ్బరికాయలు, గుమ్మడికాయలు పగలగొట్టి, రక్తానికి సంకేతంగా అందులో ఎర్రటి కుంకుమ చల్లటం ప్రారంభించారు.  బౌద్ధ భిక్షువులు శిరోముండనం (గుండు) చేయించుకుంటే, దాన్ని వైదికులు కూడా పాటించారు. అయితే అందులో తాము భిన్నంగా కనిపించాలని వెనక చిన్న పిలక వదిలేసేవారు. అది ఆచారమైపోయింది. ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. చాలా పదాలు పాళీ భాషలోంచి తీసుకున్నారు. అలా అలా చివరకు బుద్ధుణ్ణే తమ దశావతారాలలో కలుపుకున్నారు. భౌద్ధారామాలు కూలగొట్టి ఆలయాలుగా మార్చుకున్నారు. ఈ దేశంలో ఒక వెయ్యేళ్ళు కొనసాగిన బౌద్ధాన్ని నాశనం చేసి, హైదవధర్మాన్ని బలోపేతం చేయడానికి చాలా చాలా చేశారు. అదంతా కాలక్రమంలో నడుస్తూ వచ్చిన చరిత్రగా మన కళ్ళముందే ఉంది!

Also read: మన పురాణ పాత్రల మూలాలు ఈజిప్టులో ఉన్నాయా?

(మే 26 బుద్ధజయంతి)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles