Tuesday, January 21, 2025

బుద్ధుడు, విష్ణుమూర్తి అవతారాలలో ఒకడు కాదు!

బౌద్ధ సాహిత్యంలో పురాణాల ప్రసక్తి గానీ, హిందూ దేవీదేవతల పేర్లు గానీ లేవు. కానీ, రామాయణంలో బుద్ధ శబ్దం ఉంది. అంటే అది బుద్ధుడి తర్వాత కాలంలో వెలువడిన రచనగా మనం అర్థం చేసుకోవాలి. బుద్ధుడి కాలం నాటి భాష ప్రాకృత భాష. అదే అప్పటి ప్రజల భాష. ప్రాకృత అంటే ప్రకృతి. స్వభావసిద్ధంగా ఏర్పడింది అని అర్థం. ప్రాకృతానికి మరో రూపం పాలి భాష. ఈ భాషను ధమ్మ లిపిలో రాస్తారు. దేశంలో దొరికిన అతి ప్రాచీన శిలాఫలకాలు, స్థూపాలు, బౌద్ధ సంప్రదాయానికి చెందినవి. మరీ ముఖ్యంగా అశోకుడి కాలం నాటివే – ఎక్కువగా లభించాయి. ప్రాకృత భాష సంస్కరించబడి సంస్కృత భాష అయ్యింది. మొదట అది సంభాషణలకు మాత్రమే ప రిమితమైన లిపి లేని ఒక మాండలిక భాష. అది ఆర్యుల వ్యవహారిక భాష. భారత దేశంవచ్చాక, ఇక్కడి నాగరి లిపిలో దాన్ని రాసుకున్నారు. దానికి దేవ శబ్దం  కలిపి ఆ లిపిని దేవనాగరి లిపి అని అన్నారు. అలాగే సంస్కృతాన్ని ఏకంగా ఉన్నతీకరించుకుని దేవభాష అన్నారు.

Also read: దిల్ కి బాత్

అబద్ధాలు నిలవవు – అనడానికి ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే, సంస్కృత భాషలో ఉన్న శిలాఫలకాలు దొరకలేదు. అలాంటప్పుడు సనాతనం- అంటే ఏదవుతుందీ? బౌద్ధ ధమ్మం – ధమ్మలిపి- ప్రాకృత (పాలి) భాష సనాతనమవుతాయి. చారిత్రక ప్రమాణాల మీద కదా మనం ఏ నిర్ణయమైనా తీసుకునేది? సంస్కృతం, పురాణాలు, వైదికధర్మం వగైరాలన్నీ సనాతనం అని ప్రచారం చేసుకోవడమే తప్ప, అందుకు ఆధారాలు లేవు. అందువల్ల సనాతన మంటే బౌద్ధ ధమ్మం, బౌద్ధ సంస్కృతి అని చెప్పుకోవాల్సి ఉంటుంది. చివరికి బుద్ధుడు చెప్పిన ‘వేదన’ నుండే వైదిక మత ప్రబోధకులు వేదం – అనే పదం సృష్టించుకున్నారు. మన దేశంలో పురాతన సింధూ నాగరికత బయటపడింది. హరప్పా-మొహంజోదారో శిధిలాలలో అవతారాల ఆనవాళ్ళు దొరికితే, వైదిక ధర్మమే సనాతనమైంది అని భావించేవాళ్ళం. కానీ, దొరకలేదు. దొరికే అవకాశమూ లేదు. కారణం అవన్నీ కల్పితాలు కాబట్టి! వాస్తవాలకే ఆధారాలు దొరుకుతాయి. కానీ, ఊహలకు, కల్పనలకూ దొరకవు కదా? అక్కడ అప్పటి నాగరికతకు, సభ్యతకూ ఆధారాలు దొరికాయి. శిలాఫలకాల మీద ఒక లిపి కూడా దొరికింది. అయితే  ఆ లిపిని ఎవరూ చదవలేకపోయారు. కానీ, అది ద్రావిడ భాషా లిపులకు దగ్గరగా ఉన్నట్టు నిపుణులు తేల్చారు.

Also read: సంత్ కబీర్ మానవవాద కవితలు

చైనా, జపాన్, ఇండోనేషియా, థాయ్ లాండ్ వంటి ఆసియా దేశాలలో బౌద్ధం ఇంకా ఎందుకు ఉచ్ఛస్థితిలో ఉంది? భారత దేశంలో ఎందుకు సన్నగిల్లిందీ? – అంటే ఇక్కడ బౌద్ధాన్ని వక్రీకరించి రాసుకున్న వేదాలున్నాయి. బౌద్ధారామాల్ని కొల్లగొట్టి మార్చుకున్న దేవాలయాలున్నాయి. రామాయణంలో నాస్తికుల గూర్చి, చార్వాకుల గూర్చి, బుద్ధుడి గూర్చిన ప్రసక్తి ఉందంటేనే తెలుస్తోంది కదా? వారంతా పురాణకాలానికి ముందువారని! వారి ఆలోచనా విధానం పురాణ కాలానికంటే ముందు కాలం నాటిదని!! ఒరిజనల్ ఒరిజనలే- కాపీ పేస్ట్ కాపీ పేస్టే! రుగ్వేదంలో  స్తూపాల వర్ణన ఉందంటే, అది రాయబడక మందే బౌద్ధ స్తూపాలు విరివిగా దేశంలో ఉన్నట్టే కదా? బౌద్ధులు విరివిగా ఉన్న దేశాలలో అష్టాంగమార్గం  – అహింస-మధ్యమార్గం – శాంతి – కొత్త దిశ వంటివి అక్కడి ప్రజల జీవితాల్లో అంతర్భాగమైపొయ్యాయి.  ఇక్కడ మన దేశంలో ఎందుకు కాలేకపొయ్యాయి అంటే ఇక్కడ అంతా కలుషితమైపోయింది కదా? బౌద్ధారామాలు, శిల్పాలు, స్థూపాలు విదేశీ దండయాత్రల వల్ల కొంతవరకు నాశనమైతే, ఇక్కడి బ్రాహ్మణార్యుల, వైదిక ధర్మ ప్రబోధకుల నిర్వాకం వల్ల విగతాది నాశనమైంది. పైగా మనువాద భావజాలాన్ని బలవంతంగా జనం మెదడ్లకు ఎక్కించి, అది తరతరాలుగా కొనసాగేట్లు  చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. బుద్ధుణ్ణి దశావతారాలలో కలుపుకున్నది ఆయన బోధనలు నిలుపుకోవడానికి కాదు. నలిపిపారెయ్యడానికి – నాశనం చెయ్యడానికి అనేది ముందు అర్థం చేసుకోవాలి!

Also read: ప్రపంచ తాత్త్వికతా దినం

ఇటు హిందూపురాణాలు, అటు బౌద్ధ సాహిత్యం క్షణ్ణంగా అధ్యయనం చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ప్రకారం (జాతీ భేద క ఉచ్ఛేద్/Annihilation of Caste వంటి పుస్తకాలు) అవతారవాదం అంతా అబద్ధం. విష్ణు దశావతారాలలో బుద్ధుడు తొమ్మిదో అవతారమని ప్రచారరం చేయడంలో నిజం లేదు. ఎందుకంటే అవతార వాదమే తప్పుల తడక. ఉదాహరణకు హరివంశంలో విష్ణు ఆరు అవతారాలు ఎత్తాడని ఉంటే, నారయణీయంలో పది అవతారాలు ఎత్తాడని ఉంది.  వరాహపురాణంలో పదకొండు అవతారాలు ఎత్తాడనీ ఆ చివరిదైన అవతారం బుద్ధుడిదనీ రాసుకున్నారు. అలాగే వాయుపురాణంలో విష్ణు పన్నెండు అవతారాలు ఎత్తాడని రాసుకుంటే, భగవత్ పురాణంలో ఇరవై రెండు అవతారాలు ఎత్తాడనీ, అందులో ఇరవై ఒకటవ అవతారం బుద్ధుడిదనీ రాసుకున్నారు. మనం ఇక్కడ అర్థంచేసుకోవాల్సింది ఏమంటే వేదాల రచన, పురాణాల రచన సుదీర్ఘకాలం పాటు సాగింది. కాలానుగుణంగా ఎవరికి తోచింది వాళ్ళు రాసుకున్నారు. అవతారాలకు నిర్దుష్టంగా ఒక సంఖ్య లేకపోవడం, అందులో బుద్ధుడి వరుస సంఖ్య మారుతూ ఉండడం అనుమానాలకు దారితీస్తుంది కదా? ఊహలకు, కల్పితాలకు ప్రామాణికత ఉండదు. కారణం, వాటికి ఏ రకమైన ఆధారాలు ఉండవు కాబట్టి!

Also read: ఇల్లు కూడా మనిషి లాంటిదే!

‘‘అవతారాలకు ఆధారాలేవీ?’- అని వైదిక ధర్మ ప్రబోధకులను, ప్రవచన కారులను అడిగి చూడండి. జవాబు చెప్పలేరు. సరికదా క్షణంలో తోకముడిచి పారిపోతారు. చార్వాకులు, లోకాయతులు, బౌద్ధులు, జైనులు…వీళ్ళందరూ భౌతికవాదులు. వీరు మనుషులకు నైతికత కావాలన్నారు. దృష్టి ఈ జగత్తు మీద పెట్టమన్నారు. సమస్యల్ని పరిష్కరించుకుంటూ, మానవ సమాజాన్ని ఉద్ధరించుకోవాలన్నారు. పీడ నుండి,  దుఃఖం నుండి, వేదన నుండి బయటపడే మార్గాలు అన్వేషించుకోవాలన్నారు. దీనికి పూర్తి విరుద్ధంగా వైదిక ధర్మం ఏం చెప్పిందీ? బ్రహ్మ- సత్యం అనీ, జగత్తు మిథ్య అనీ అంది. పుణ్యం, పాపం, జన్మ, పునర్జన్మ, మోక్షం వంటి  మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేసింది. ఎక్కడా లేని పరలోకాల గురించి ప్రచారం చేసింది.  వెరసి, మనుషుల ఆత్మవిశ్వాసాన్నిదెబ్బతీసింది. హిందూ సన్యాసికి ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. కానీ, బౌద్ధభిక్షువుకు ప్రపంచంతో తప్పక సంబంధం ఉంటుంది. వారు సామాన్య జనానికి సేవ చేస్తారు. బౌద్ధ ధమ్మం బోధిస్తారు. వీరికి స్వంత ఆస్థి అంటూ ఉండదు.

ఇకపోతే, హిందువుల దశావతారాల్లో బుద్ధుణ్ణి చేర్చుకున్నారు కదా? బుద్ధుడు హిందూమతంలో భాగమే అని అంటారు కదా? మరి బౌద్ధారామాల్ని పరిరక్షించుకోవాలని గానీ, పునరుద్ధరించుకోవాలని గానీ వైదిక సంస్థలకు, నేటి ప్రభుత్వాలకూ ఎందుకు ఉండడం లేదూ? విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న తొట్లకొండ, పావురాలకొండ, బొజ్జన్నకొండ, లింగాలకొండ లాంటివన్నీ ఎందుకు నిరాదరణకు గురవుతున్నాయి? విషయాలు తెలుసుకుని, లోతుగా అధ్యయనం చేయవల్సిన విషయం. ఉదాహరణకు ఇక్కడ ఒక ప్రాంతం గురించి ప్రస్తావించాను. కానీ, దేశవ్యాప్తంగా శిధిలమైపోయిన బుద్ధవిగ్రహాలు, స్థూపాలు, ఆరామాలు ఎన్నెన్నో ఉన్నాయి కదా? మరి వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదూ? పునరుద్ధరించుకోవడంలేదంటే, అవి తమ వైదిక ధర్మానికి ఏ మాత్రం సంబంధం లేనివి అని వారికి కచ్చితంగా తెలుసునన్నమాట! వైదిక ధర్మాన్ని నెత్తిన పెట్టుకునే ప్రభుత్వ పెద్దలవి నాటకాలు కావా? చారిత్రిక అవగాహన తప్పనిసరి కదా? ‘‘సనాతన’’ బౌద్ధ ధమ్మాన్ని రక్షించుకుందామన్న చిత్తశుద్ధి అవసరం కదా? మనువాదుల ప్రభావంలో పడి తమను తాము గుర్తించుకోవడం మరచిపోయిన జనం, ఎప్పుడు వివేకవంతులవుతారో మరి? ఆరామాలని అరాచక కేంద్రాలని ప్రచారం చేశారు. మహాస్తూపాలను అన్యాయంగా ‘లంజెదిబ్బల‘న్నారు. స్తూపాలు దిబ్బలైనాయి. విహారాలు గబ్బిలాలకు నిలయాలైనాయి. బుద్ధుడు విష్ణుమూర్తి అవతారమని ఒక మహా అబద్ధం ప్రచార చేసినవారే ఈ దుర్మార్గాలన్నీ చేశారు. ఇవన్నీ ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తున్న విషయాలు. కొన్ని స్తూపాలు నరసింహక్షేత్రాలయ్యాయి. తిరణాల స్థానంలో మంత్రతంత్రాలు ప్రతిష్ఠించారు. అష్టాంగ మార్గాన్ని అష్టోత్తరాలుగా మార్చారు. పంచశీలను పాతిపెట్టారు. నిబ్బాణకు బదులు వ్రతాల్ని ప్రవేశపెట్టి, గృహిణుల్ని మానసిక బానిసలుగా మార్చారు. పదిహేను వందల ఏళ్ళ పాటు శాంతియుత సుఖమయ, ఆనందకర జీవితాన్ని అందించిన బౌద్ధ జీవన శైలిని ఏ రకంగా నాశనం చేశారో రఘుపతిరావు (2010) ఒక పుస్తకంలో విశదపరిచారు.

Also read: నాస్తికత్వం ఒక విచారధార – జీవన విధానం

అశోకుడికంటే ముందే ‘సనాతన’ సంస్కృతిలో (అంటే వారి వైదిక సంస్కృతిలో) అనేక స్తూపాలున్నాయని కొందరు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సింహస్తంభ, ధ్వజస్తంభ, సూర్యస్తంభ, విజయస్తంభ వంటి వాటి గురించి చెపుతూ – ఇవి, భూమి అనంత విశ్వాన్నుంచి విడివడడాన్ని(Separation of earth with infinite cosmos) సూచిస్తాయని చెపుతారు. అయితే, ఇందులో సింహస్తంభం, సూర్యస్తంభం బౌద్ధుల శిల్పాలకు పోలికలున్నాయి. అబద్ధాలు ప్రచారం చేసే ఆ మందమతులు ఆ విషయం గ్రహించలేదు. ఇకపోతే అశోక  స్తంభాల్ని స్ఫూర్తి(మోడల్)గా తీసుకొని తర్వాత కాలంలో కొందరు ప్రాంతీయ పరిపాలకులు కొంత భిన్నంగా స్తూపాలను నిర్మించి  ఉంటారు. కాదనలేం. కార్బన్ డేటింగ్ చేయించి అవి ఏ కాలానివో నిర్థారణ చేయిస్తే  గానీ అసలు విషయం బయటపడదు. ఏమైనా అశోకుడి ముందు కాలంలో దేశంలో స్తూపాలున్న విషయం ఏ చరిత్రకారుడూ నమోదు చేయలేదు. ఆనాటి చరిత్రకారుల్ని నమ్ముదామా? లేక ఈ నాటి ఈ మిడిమిడి జ్ఞానపు వైదిక హిందూ పండితుల్ని నమ్ముదామా? హేతుబద్ధంగా ఆలోచించేవారు నిజమైన ప్రమాణాల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

ఆనాటి వైదిక మత గురువు శంకరాచార్యకు పెద్ద గొంతు, వాదనా పటిమ ఉండి  ఉంటుంది. ఉంటే మాత్రం సున్నిత మనస్కులైన బౌద్ధభిక్షువుల్ని హేళన చేసి, అవమానించి, న్యూనతాభావంతో వారు ఆత్మహత్య చేసుకునేదాకా వదిలిపెట్టేవాడు కాదు. ఉగ్రవాదం అనే పదం ఆ రోజుల్లో లేదు కానీ, అతను ఓ రకమైన ఉగ్రవాదే! మనిషిని మనిషిగా గౌరవించలేనివాడు ఎంత ఉన్నత స్థాయివాడైనా హీనుడిగానే గుర్తింపబడాలి. ఎంత చిన్నదైనా స్వంత సృజనాత్మక శక్తి గొప్పది. అరువు తెచ్చుకున్నది అరువు తెచ్చుకున్నదే అవుతుంది. గ్రీకుల కట్టడాలు కాపీ చేసి మందిరాలు నిర్మించుకున్నట్టు – ఈజిప్టు, గ్రీకు దేవతల్ని కాపీ చేసి హిందూ దేవతల్ని ఏర్పరుచుకున్నట్టు పూర్తి ఆధారాలు దొరికాయి. లండన్ లోని పెట్రీ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ ఆర్కియాలజీలో అన్ని ఆధారాలు ఉన్నాయి. కొన్ని ఆధారాలు అంతర్జాలంతో కూడా దొరుకుతాయి. ఇకపోతే – లాభసాటి వ్యాపారాలు నడుస్తాయంటే ఈ మనువాదులు, రేప్పొద్దున అంబేడ్కర్ ను కూడా దేవుడిగా చేసెయ్యగల సమర్థులు! మనువాదుల మాయాజాలం మహావిచిత్రం. సాధారణ శకానికి ముందు బుద్ధుడు ఈ నేల మీద పుట్టిపెరిగి, దేశం నాలుగు చెరగులా తిరిగినవాడు. కల్పితం కాదు. మరి కల్పించుకున్న దేవుళ్ళలో బుద్ధుణ్ణి చేర్చడమేమిటీ? వాస్తవాలకూ భ్రమలకు తేడా తెలుసుకోండి! అందువల్ల విష్ణు అవతారాలలో బుద్ధుడు కూడా ఒకడు అని చెప్పడం వందశాతం అబద్ధం!!

Also read: మనువాదం మట్టికరవక తప్పదు!

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles