బిఎస్ సీ(నర్సింగ్)కోర్సులో ప్రవేశాల విషయంలో నిబంధనలను సడలించాలనీ, మిగిలిన సీట్లను నింపాలనీ, విద్యార్థులను కాపాడాలని తెలంగాణ విద్యార్థులు ఒక పత్రికా ప్రకటనలో ప్రభుత్వానికీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం యాజమాన్యానికీ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో బీఎస్ సీ(ఎన్) కోర్సును నిర్వహించే కళాశాలలు 102 ఉన్నాయి. వరంగల్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మొత్తం 6500 బీఎస్ సీ(ఎన్) సీట్లు ఉన్నాయి. ఈ యేడాది ఇంతవరకూ 3000 సీట్లను మాత్రమే నింపారు. తక్కిన 3500 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇంతవరకూ రెండు విడతల వెబ్ కౌన్సిలింగ్ పూర్తయింది. మొదటి కౌన్సిలింగ్ 01 అక్టోబర్ 23 నుంచి04 అక్టోబర్ 23వరకూ జరిగింది. రెండోది 14 అక్టోబర్ 23 నుంచి 17 అక్టోబర్ 23 వరకూ జరిగింది. కానీ సగానికి పైగా సీట్లను నింపలేదు.
బీఎస్ సీ(నర్సింగ్)లో ప్రవేశాలకు ఆఖరు తేదీ 31 అక్టోబర్ 2023 అనీ, దాన్ని ఎట్టి పరిస్థితులలోనూ పొడిగించేది లేదనీ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఒక సర్క్యులర్ జారీ చేసింది.
కడచిన పదేళ్ళుగా ఇంటర్ బీపీసీ కోర్సులో వచ్చిన మార్కుల ఆధారంగా బీఎస్ సీ (ఎన్)లో ప్రవేశం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాయలంవారు ఇచ్చారు. ఈ సంవత్సరం విశ్వవిద్యాలయం నిబంధనలను మార్చి ఎంసెట్ లో 63000 ర్యాంకుల వరకూ వచ్చినవారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. మేనేజ్ మెంట్ కోటా కింద నీట్ ర్యాంక్ ను పరిగణిస్తున్నారు. ఇది ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా జరుగుతోంది.
బీఎస్ సీ(ఎన్) కోర్సులు చదివే పిల్లలందరూ లోతట్టు ఆదివాసీ ప్రాంతాలకు చెందినవారనీ, వారికి ఎంసెట్ కు శిక్షణ పొందే సావకాశం, వనరులూ, సమాచారం ఉండదనీ, అందుకని వారికి బీఎస్ సీ(ఎన్)లో సీట్లు పొందడానికి అర్హమైన ర్యాంకులు రావడం కష్టమనీ ఈ ప్రకటన ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, పంజాబ్, కర్ణాటక, మరి పెక్కు రాష్ట్రాలు బీఎస్ సీ(ఎన్) ప్రవేశ నిబంధనలు సడలించాయనీ, ఎంసెట్/నీట్ పరీక్షలలో క్వాలిఫై అయినవారికి ప్రవేశాలు ఇచ్చారని విద్యార్థులు గుర్తు చేశారు.
ఇతర రాష్ట్రాలలో ఉన్నట్టే ఎంసెట్/నీట్ పరీక్షలలో పాసైనవారికి ర్యాంకులతో నిమిత్తం లేకుండా బీఎస్ సీ(ఎన్)లో ప్రవేశాలు ఇవ్వాలని, అది కూడా త్వరగా నిర్ణయాలు తీసుకోవాలనీ, విద్యార్థుల విద్యాసంవత్సరాన్ని కాపాడాలనీ, వారి భవిష్యత్తును పరిరక్షించాలనీ, ఇక ఏ మాత్ర జాప్యం లేకుండా తక్షణం స్పందించాలని విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వాన్నీ, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీనీ కోరుతున్నారు.
ఈ పత్రికా ప్రకటనపైన పూనెం భార్గవి, కొమరం సృజన, సువర్ణపాక శ్రీలత, జర్పుల సింధూజా,అజ్మీరా మంజు, కంగాల సరిత సంతకాలు చేశారు.