Tuesday, January 28, 2025

దేశప్రజల తలరాతలు మార్చడానికే బీఆర్ఎస్: కేసీఆర్

అన్ని వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధి ఎందుకు లేదు?

ఆంధ్ర నాయకులు బీఆర్ఎస్ లో చేరిన సందర్బంగా కేసీఆర్ ప్రసంగం

బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ నియామకం

భారత దేశ ప్రజలందరి జీవితాల్లో గుణాత్మక మార్పుకోసమే భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఏర్పాటయిందని, ఇది ఏ ఒక్క రాష్ట్రం కోసమో, పల్లె కోసమో కాదనీ, దేశం కోసమే బిఆర్ఎస్ (బిఆర్ఎస్ ఫర్ ఇండియా) అని బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి మాజీ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ చింత‌ల పార్థసార‌థి, టిజె ప్రకాశ్, కాపునాడు జాతీయ అధ్యక్షుడు రమేశ్ నాయుడు, శ్రీనివాస్ నాయుడు, రామారావు  ఇతర కాపు సంఘం  నాయకులు, కార్యకర్తలు సోమవారం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు వారికి గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా తోట చంద్రశేఖర్ ను అధినేత కేసీఆర్ నియమించారు.

మహోజ్వల భారతదేశ నిర్మాణం కోసమే బిఆర్ఎస్ అనీ, ప్రజల ఆలోచనా ధోరణిని మార్చాలనీ, భారత రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తీసుకొని రావాలనీ, పరిపాలన వ్యక్తుల చుట్టూ కాకుండా వ్యవస్థీకృతం చేయవలసిన అవసరం ఉన్నదనీ ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. జాతి అభివృద్ధికోసం తపన పడే బృందాన్ని తయారు చేయవలసి ఉన్నదనీ, సహజ వనరుల సద్వినియోగంకోసం కృషి చేయాలనీ, నీటియుద్ధాలను నివారించేందుకు బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించవలసి వచ్చిందనీ ఆయన చెప్పారు.

స్వార్థ రాజకీయ ప్రయెజనాలకోసం మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టి విభజించే దుర్మార్గాలను పారదోలి ఉజ్వల భారతాన్ని నిర్మించాలనీ, రోటీన్ రాజకీయాలనుంచీ, గోల్ మాల్ వ్యవహారాలనుంచి దేశాన్ని బయటపడేసేందుకే బిఆర్ఎస్ అవసరమనీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పాలసీ ప్రయివేటైజేషన్ అయితే…..మా పాలసీ నేషనలైజేషన్….వాళ్ళు  ప్రయివేట్ చేసిన ప్రతిదాన్ని మీము అధికారంలోకి వస్తే తిరిగి తీసుకుని జాతీయం చేస్తామనీ కేసీఆర్ ఉద్ఘాటించారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకూడా దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని ప్రార్థిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు అన్నారు.

• బిఆర్ఎస్ ను గెలిపిస్తే ఏడాదికి లక్షా 45 వేల కోట్ల ఖర్చు చేసి రెండేండ్లలో దేశమంతా రైతులకు ఉచిత కరెంటిస్తామనీ, తరతరాలుగా వివక్షకు గురైన దళిత బిడ్డలను తలెత్తుకొని గర్వంగా బ్రతికేలా చేస్తామనీ, దేశ వ్యాప్తంగా ఉచిత కరెంటు, దళితబంధు పథకాన్ని అమలు చేస్తామనీ కేసీఆర్ చెప్పారు. సంక్రాంతి తర్వాత మరో 7,8 రాష్ట్రాల్లో మన పోరాటం ప్రారంభమౌతుందనీ, భవిష్యత్తులో చాలామందికి ఆశ్చర్యం కలిగించే చేరికలుంటాయనీ కేసీఆర్ వ్యాఖ్యానించారు.

‘‘మ‌న దేశంలో 50 శాతం భూమి సాగుకు అనుకూలంగా ఉంది. 83 కోట్ల ఎక‌రాల భూమి ఉంటే అందులో ర‌మార‌మి 40 కోట్ల ఎక‌రాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. మ‌న దేశంలో ప్రతి ఏడాది ఒక ల‌క్షా 40 వేల టీఎంసీల వ‌ర్షం కురుస్తోంది. 70 వేల టీఎంసీల నీరు పుష్కలంగా ఉంది. మనదేశంలో అన్ని  రకాల విద్యుత్ కలిపితే  దాదాపు 4 లక్షల 10 వేల 100 మెగావాట్లు స్థాపిత విద్యుత్ సామర్థ్యముంటుంది. ఇది సాక్షాత్తు కేంద్రం చెబుతున్న లెక్క‌. భూమి వున్నది, సూర్యరశ్మి పుష్కలంగా వుంది, పర్యావ‌ర‌ణ వాతావారణం వుంది,  ప‌ని చేసేట‌టువంటి మ‌న‌షులు ఉన్నారు. ఇన్నీ వున్న భారత దేశం ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ చైన్ కలిగివున్న దేశంగా వుండాలె. మరి వున్నదా?

‘‘భారతదేశ రైతులు దేశంలో ఉద్యమాలు చేస్తున్నారు. లక్ష కోట్ల విలువైన పామాయిల్ ను మనం దిగుమతి చేసుకుంటున్నాం. సంపద ఉండి, అద్భుతమైన మానవ వనరులుండి మనం ఈ దుస్థితిలో ఎందుకున్నాం? అదేసమయంలో అమెరికా భూభాగంలో 29 శాతం మాత్రమే సాగు భూములు ఉన్నాయి.  చైనాలో 16 శాతం మాత్రమే సాగు భూమి ఉంది. కానీ అవి అంతగా అభివృద్ధి చెందడంలో ఆయా దేశాలు చేస్తున్న కృషి ఏమిటి? ప్రజా జీవితంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఇది ఆలోచించాలి.  వనరులు, వసతులు ఉండి ఈ దేశ ప్రజలు ఎందుకు వంచించబడాలి?  ఎందుకు శిక్షించబడాలి? ఈ పరిస్థితి ఇలాగే ఉండాలా? మార్పు రావాలా?’’ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు.

‘‘బిఆర్ఎస్ ఏదో తమాషా కోసం కాదు. బిఆర్ఎస్ ఫర్ ఇండియా.  లక్ష కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఏ విషయాన్ని ప్రారంభించినా మొదట ఎదురయ్యేది అవహేళనే. మహాత్మాగాంధీ గారి లాంటి మహానుభావులు కూడా ఇదే చెప్పారు. కులాల కుంపట్లు, మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నాలు చేయడమే కొన్ని రాజకీయ పార్టీల లక్ష్యమైంది. ఈ రోజు దేశంలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా?

రైతాంగం ఢిల్లీలో ధర్నాలు చేశారు. వందలమంది చనిపోయారు. కానీ ఎవరూ పట్టించుకున్నవారు లేరు. ఎందుకీ మూగ రోదన, మూగ వేదన, అసంతృప్తి? జీవితంలో ఉన్న స్థితినుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి మార్గాలేమిటో ఆలోచనచేయాలి. బిఆర్ఎస్ పార్టీ ఆలోచనపరులను ఏకం చేస్తున్నది. వ్యక్తులు కాదు వ్యవస్థీకృతంగా పనులు జరగాలి. మొత్తం వ్యవస్థకు పనికి వచ్చే పనులకు రూపకల్పన జరిగి, వాటి ఫలితాలు దేశ ప్రజల అనుభవంలోకి రావాలి’’ అంటూ కేసీఆర్ అన్నారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles