మల్లేపల్లి లక్ష్మయ్య
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని, దళితుల సామాజికార్థిక అభివృద్ధి, సంక్షేమంకోసం కొనసాగిస్తున్న ఇతర పథకాలనీ దేశవ్యాప్తంగా దళితులు మెచ్చుకుంటున్నారు. అయితే, ఈ విప్లవాత్మకమైన, వినూత్నమైన కార్యక్రమాలకు బీజాలు 2004లోనే పడ్డాయి.
పద్దెనిమిదేళ్ళు గడిచిపోయినప్పటికీ ఆ రోజుల్లో దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం అజెండాను తయారు చేయడానికి నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పడిన తాపత్రయం నాకు ఇప్పటికీ గుర్తున్నది.
దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలనీ, గురుకుల విద్యాలయాలను అభివృద్ధి చేయాలనీ, ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున వ్యవసాయభూమి పంపిణీ చేయాలనీ, దళితుల అభివృద్ధికి ఇతర కార్యక్రమాలు చేపట్టాలనీ చాలా పరిశోధన చేసి, మేధావులతో, కార్యకర్తలతో విస్తారంగా చర్చించిన మీదట నిర్ణయించారు.
నిబద్ధత, దూరదృష్టి
సిసలైన స్ఫూర్తితో ఈ కార్యక్రమాలన్నిటినీ అధికారంలోకి వచ్చిన అనంతరం కేసీఆర్ అమలు చేస్తూ వచ్చారు. దళితుల సాధికారికత, వారి సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిబద్ధతనూ, దూరదృష్టినీ ఇది వెల్లడిస్తోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి తర్వాత దళితుల సంక్షేమం, సాధికారత పట్ల కేసీఆర్ కి ఉన్న పట్టుదల, నిబద్ధత, దూరదృష్టి మరే నాయకుడికీ, ఏ ఇతర ముఖ్యమంత్రికీ లేదు.
ఈ దృష్టిని సాకారం చేసే క్రమంలోనే 2012లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని చేయవలసిందిగా నాటి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిపైన కేసీఆర్ ఒత్తిడి తెచ్చారు. ముఖ్యమంత్రిగా 2014లో ప్రమాణం చేసిన తర్వాత కేసీఆర్ హాజరైన మొదటి సమావేశం దళితుల సంక్షేమం, సాధికారికత గురించి ఆలోచించడానికి ఉద్దేశించిందే కావడం విశేషం. 2016లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నూట ఇరవై అయిదవ జయంతి ఉత్సవాల సందర్భంగా 125 అడుగుల ఎత్తు అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలని విజ్ఞప్తి వచ్చింది. ఆ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించడమే కాకుండా 125 గురుకుల విద్యాలయాలు నెలకొల్పుతానని కేసీఆర్ ప్రకటించడం నాకు చాలా సంతోషాన్నీ, ఆశ్చర్యాన్నీ కలిగించింది. ఇప్పుడు రాష్ట్రంలో 268 గురుకుల విద్యాలయాలను ఎస్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ నిర్వహిస్తున్నది.
విద్య, అవగాహన పెంపొందించడం ద్వారా దళితుల ఆలోచనా ధోరణిని మార్చాలనే కేసీఆర్ దృఢమైన సంకల్పానికి ఇది నిదర్శనం. ఇప్పుడు తెలంగాణలో 990 రెసిడెన్షియన్ స్కూళ్ళూ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బీసీ విద్యార్థినీవిద్యార్థుల కోసం రెండువేల హాస్టళ్ళూ ఉన్నాయి. ప్రతి విద్యార్థిపైనా తెలంగాణ ప్రభుత్వం ఏటా లక్షా ఇరవై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఈ లెక్కన ఈ దేశంలో ఖర్చు చేస్తున్న రాష్ట్రం మరొకటి లేదు.
ఇది చూడండి. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసింది. ఈ ప్రహారంతో ప్రణాళిక, ఉపప్రణాళికల ప్రకారం అమలు జరగవలసిన కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసినట్టే అయింది. ఇందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం ,2017, ను ప్రవేశపెట్టింది. దళితుల, ఆదివాసీల సామాజిక, ఆర్థికాభివృద్ధినీ, సాధికారికతనూ సాధించడం ఈ చట్టం ఉద్దేశం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే సంక్షేమం అనేది దానంగా, అభివృద్ధి అనేది హక్కుగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకే తెలంగాణలో సాంఘిక సంక్షేమ శాఖను ఎస్సీ అభివృద్ధి శాఖగా పేరు మార్చారు. ముఖ్యమంత్రి మానసిక పుత్రిక అయిన దళిత బంధు పథకాన్ని తెలంగాణలోని దళితులే కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలలోని దళితులు సైతం స్వాగతిస్తున్నారు.
విప్లవాత్మకమైన పథకం దళితబంధు
కేంద్రంలో కాంగ్రెస్ 2004 నుంచీ అధికారంలో ఉన్నది. 2014 నుంచి బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ఉన్నది. ఏ ప్రభుత్వం కూడా దళితుల సాధికారికతకు దళితబంధు వంటి విప్లవాత్మకమైన పథకాన్ని ఆవిష్కరించలేదు. తెలంగాణలో దళితులు పరిశ్రమలు పెడుతున్నారు. వ్యాపారాలు చేస్తూ పైకి వస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో దళితుల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. పీడన, అంటరానితనం, అత్యాచారాలు నిరవధికంగా సాగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో వారం రోజుల కిందట ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లపైన అత్యాచారం చేసి వారిని హత్య చేశారు.దళితుల రక్షణకూ, సాధికారికతకూ హామీ ఉండాలంటే పాలకులకు రాజకీయంగా దృఢమైన సంకల్పం ఉండాలి. ఇది తెలంగాణలో మాత్రమే ఉన్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించడంపైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలలో దళితుల సాధికారితకోసం బియ్యం మాత్రం ఉచితంగా సరఫరా చేస్తున్నారు. వారిని ఓటు బ్యాంకులాగా వాడుకుంటున్నారు. చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలలో రావడం వల్ల తెలంగాణలో అమలు జరుగుతున్న పథకాలనూ, కార్యక్రమాలనూ అదే స్ఫూర్తితో అమలు చేస్తే దళితుల జీవితాలలో వెలుగు నిండుతుంది. కాంగ్రెస్, బీజేపీలు ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు. కాంగ్రెస్ హయాంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు బాగుపడ్డాయి. ఇప్పుడు బీజేపీ పాలనలో మరికొన్ని కార్పొరేట్ సంస్థలు పండుగ చేసుకుంటున్నాయి. దీనితో సరిపెట్టుకోకుండా వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు తాజాగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకించి ఎలుగెత్తి విమర్శిస్తున్నవారు తెలంగాణ ముఖ్యమంత్రి తప్ప మరో నాయకుడు కనిపించడం లేదు. ఆర్థికాభివృద్ధి, సాంఘిక సంక్షేమం, నీటి నిర్వహణ, నాణ్యమైన విద్యుచ్ఛక్తి సరఫరా, పేదరికం నిర్మూలన ఇప్పుడు అత్యంత ప్రధానమైనవి. టీఆర్ఎస్ అజెండాలో ఉన్న అంశాలు ఇవే. రేపు బీఆర్ఎస్ లోనూ ఇవే ప్రధానాంశాలు కాబోతున్నాయి. ఒక దూరదృష్టి కలిగి, హృదయవైశాల్యం ఉన్న నాయకులు వేరుగా ఉంటారు. చంద్రశేఖరరావుకు ఈ రెండు లక్షణాలూ పుష్కలంగా ఉన్నాయి. ఆయన జాతీయ రాజకీయాలలో ప్రవేశించడం దేశానికి శుభంకరం అవుతుంది. కొన్ని జాతీయ పార్టీలు చావుదెబ్బ తింటాయి.
ఉత్తర ప్రదేశ్ దళిత నాయకుడి ప్రశంసలు
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలలోకి రావడాన్ని చాలా రాష్ట్రాలలోని దళితులు, వారి అభివృద్ధికోసం పని చేస్తున్న సంస్థల అధినేతలూ స్వాగతిస్తున్నారు. ఇది నేటి చారిత్రక అవసరం అని అంటున్నారు.
‘‘నేను దళితబంధు పథకాన్నీ, దళితుల అభివృద్ధి, సంక్షేమంకోసం తెలంగాణలో అమలు జరుగుతున్న ఇతర పథకాలనూ, కార్యక్రమాలనూ స్వయంగా పరిశీలించాను. అవి అసాధారణమైనవి’’ అని ఉత్తర ప్రదేశ్ లో దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తున్న డైనమిక్ యాక్షన్ గ్రూప్ సమన్వయకర్త రాంకుమార్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లోనూ, ఇతర ఉత్తరాది రాష్ట్రాలలోనూ దళితులకు అవగాహన లేదు. తెలంగాణలో అమలు జరుగుతున్న కార్యక్రమాల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించి వారి అవగాహన పెంపొందించాం. దళితులు ఆశ్చర్యపోయారు. చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తే ఇటువంటి దళిత అభివృద్ధి పథకాలు అమలు చేయవలసిందిగా మిగిలన పార్టీలపైన ఒత్తిడి పెరుగుతుంది. చాలా ఉత్తరాది రాష్ట్రాలలో కులవ్యవస్థ అధికంగా ఉన్నది. దళితులపైన అత్యాచారాలు నిర్నిరోధంగా సాగిపోతున్నాయి. దళితులను చాలా రాష్ట్రాలలో ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటారు. వారి అభివృద్ధినీ, సంక్షేమాన్నీ పట్టించుకోరు’’ అని రాంకుమార్ వ్యాఖ్యానించారు.