మనసు కన్నా పెళుసు ఈ గాజు పెంకు…
నాతి హృదయం వంటి రాతికి తగిలి
వేయి వ్రక్కలు అవుతుంది.
ఇక ఈ మధువో, కన్నీటికన్నా పలుచన
ఎగసిపడి, ఎగసిపడి, తూలి, తూలి, జారీ, జారి
గుండెలోని ఏ గుహ్య తీరాలకో చేరుతుంది.
ఫరవాలేదు…సీసాలో మధువు శేషం ఉంది,
కంట ఎప్పటికి ఎండిపోని ఉప్పటి నీటి ఊట చెరువుంది.
నా మధుపాత్ర ఎప్పటికీ సిద్ధమే,
పొంగనీ, దొర్లని…
ఆ విషం మనసులోతులలోకి చేరని…
దృష్టి మందగించే దాకా,
చెవులు మొద్దుబారే దాకా!
ఒక ఊగిసలాట…
తీయని జ్ఞాపకాలకు, మత్తులోని మరపుకు మధ్యన…
నిటారుగా ఉన్న కొండ కాసేపు ఎక్కి
కాసేపు క్రిందకు జారిపోతూ ఉన్నట్లు
తీయని భావాలతో మొదలై
చేదు రుచులతో ముగిసే సుందర స్వప్నాలు కొన్ని
భయోత్పాతాలతో ప్రారంభమై
గుప్త వ్యథా జనిత ఉన్మాదాట్టహాసంతో
ముగిసే పీడకలలు కొన్ని…
అబ్బో…అన్ని ఉన్నాయి, అసలేమి లేవు!
ఎవరేమన్నా అనుకోని, ఇదీ జీవితమే…
బ్రతుకు కాని బ్రతుకు,
చావు కాని చావు…
నాకు ఎప్పటికి తేడా తెలియదు
జీవన్మృతునికి, జీవన్ముక్తునికి!
…మహతి
(మహా కవి ఉమర్ ఖయామ్ గారికి అంకితం)