రామాయణమ్ – 146
‘‘వానరోత్తమా, పాతివ్రత్యధర్మమును అనుసరించి రాముని తప్ప పరపురుష శరీరమును స్పర్శించను. రావణుడు ఎత్తుకొని వచ్చునప్పుడు నన్ను రక్షించగల నాధుడు దూరమై స్వయముగా రక్షించుకొనజాలక పరాధీననైన నాకు ఆ అవస్థ తప్పలేదు.
Also read: హనుమ సూచనను సున్నితంగా తిరస్కరించిన సీతమ్మ
‘‘అదియును గాక రాముడు ఇచటకు వచ్చి రావణుని బంధుసమేతముగా సంహరించి నన్ను తీసుకొని వెళ్ళినచో అది యుక్తము. పరాక్రమశాలి, శత్రుసంహారకుడు అయిన రాముని ముందు నిలువగల ధైర్యము, సత్తా ముల్లోకాలలో ఎవరికీ లేదు. చిత్రవిచిత్ర గతులలో ధనుస్సును త్రిప్పుచూ నారి సారించి విడిచిన నారాచములు ఎంతటి యోధుడి గుండెలనైనా బ్రద్దలుగొట్టగలవు. రామధనుర్విముక్త శరము ఎదుటి వాడు ఎంతటి యోధుడు అని లెక్కించదు లక్ష్యఛేదన మాత్రమే దానికి తెలియును.
‘‘వానరశ్రేష్ఠా హనుమా, నా భర్తను,ఆయన తమ్ముని సకల సేనావాహినిని శీఘ్రమే తీసుకొని రమ్ము. రాక్షసుల పీచమడచి రావణుని సంహరించి నన్ను సగౌరవముగా తీసుకొని వెళ్ళవలయును. అదియే రఘుకుల ప్రతిష్ఠను ఇనుమడింపజేయును’’ అని సీతమ్మ హనుమతో అన్నది.
Also read: రామలక్ష్మణుల యోగక్షేమములు అడిగి తెలుసుకున్న సీత
….
‘‘అమ్మా, పాతివ్రత్యమునకే వన్నె తెచ్చు పలుకులు పలికితివి.
రామపత్ని,జనకసుత ఇంతకన్నా భిన్నముగా మాటలాడునా! అమ్మా, నీ దుఃఖమును వెంటనే రూపుమాపవలెనన్న భక్తిచేత కలిగిన ఆతురతతో అటులంటిని. అంతియే తప్ప వేరొకటికాదు. అమ్మా, ఏదైనా ఒక వస్తువును రామచంద్రునకు చూపుటకు నీ గుర్తుగా ఒసగుము తల్లీ. అది చూసి రామచంద్రుని హృదయము కొంత ఊరటచెందును’’ అని హనుమ అడిగెను.
‘‘హనుమా నీకు మా ఇరువురికి మాత్రమే తెలిసిన ఒక సంఘటన చెప్పెదను వినుము…’’
అని సీతమ్మ చెప్పదొడంగెను.
(ఆ, మన హృదయం నిష్కల్మషంగా ఉండాలికానీ బయటకు అందరికీ తెలియాలా ఏమిటి? అని వాదించే రోజులు ఇవి. ఒక సామెత ఉంది తాటిచెట్టుక్రింద నిలుచొని పాలుత్రాగినా జనం వీడు కల్లే తాగుతున్నాడు అంటారు. మనం నిజాయతీ పరులుగా ఉండాలి. అదే విధంగా ఎదుటి వ్యక్తికి కించిత్ అనుమానం కూడా కలగని విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఇది చాలా మంది పెద్దలకు అనుభవము.
Also read: రాముడిచ్చిన అంగుళీయకము సీతమ్మకు సమర్పించిన హనుమ
ఆంజనేయుని యందు అమ్మకు పుత్రభావము ఉన్నది. కానీ ఆయన వీపుపై కనిపిస్తే లోకులు ఏమనుకుంటారు? తనగురించి కలలో కూడా ఇంకొకడు వేరే విధంగా తలచరాదు అని అమ్మ తలపు. అందుకే హనుమ సమర్ధుడని తెలిసినప్పటికీ తన కష్టములు వెంటనే గట్టెక్కగలవని తెలిసినప్పటికీ ఆమె అంగీకరించలేదు.
అమ్మను మొదట వీరత్వంతోనే రాముడు గెలుచుకున్నాడు. ఇప్పుడూ వీరత్వంతోటే తీసుకు వెడతాడు. సీతమ్మ రామునికి వీర్యశుల్క
అది హనుమకు అప్పచెప్పిన కార్యము కాదు. ఆ విధముగా చేసినట్లయిన ఆయన హద్దు మీరినట్లగును.)
Also read: సుగ్రీవాజ్ఞ గురించి సీతకు చెప్పిన హనుమ
వూటుకూరు జానకిరామారావు