Sunday, December 22, 2024

కట్టిన దుస్తులు పసుపు ! పట్టిన జెండా ఎరుపు !! రాహుల్ సాంకృత్యాయన్ !!!

ఆస్ట్రేలియా లో సాంప్రదాయ క్రైస్తవ కుటుంబం లో పుట్టి 18 ఏళ్ళకే బౌద్దునిగా మారిన వ్యక్తి ఎస్. దమ్మిక అనేక దేశాలు తిరిగి ప్రసిద్ధ బౌద్ద పండితుడు అంగారక ధర్మపాల ఆఖరి శిష్యునిగా అవిశ్రాంత సంచారిగా, బౌద్ధ ప్రసంగీకుడిగా పేరొందారు. మహాపండిత్ రాహుల్ సాంకృత్యాయన్ శత జయంతి సందర్భంగా 1993 లో ప్రచురిం చేందుకు రాహుల్జీ జీవితం గురించి కృషి చేసి 1990 – 91 మధ్య కాలంలో “Yellow Robe – Red Flag” పేరిట చిన్న జీవిత చరిత్ర రాసారు!

Also read: దరిశి చెంచయ్య , నేనూ నా దేశం!

తల్లి కాగితాల్లో దొరికిన రచన

ఐతే, అప్పట్లో దానినాయన ఎక్కడో పోగొట్టు కున్నాడు. మళ్ళీ అది గతేడాది అంటే, 2021 ఏప్రిల్‌లో లేటు వాళ్ళమ్మ గారి పేపర్లలో దొరికింది. అప్పట్లో చేసిన ఆ రచన నకలు ఒక కాపీ వాళ్ళమ్మగారికి పంపిన విషయమే ఆయన మర్చిపోయారు. ఈ లోపు రాహుల్జీ జీవితం గురించి కొన్ని వ్యాసాలు, రచనలు వచ్చాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని బంతే ఎస్. ధమ్మిక గారు రాహుల్జీ సంక్షిప్త జీవితగాథని నెట్ లో ఉంచారు!

కేదార్‌నాథ్ పాండే @ సాధు రామ్ ఉదార్ దాస్ @ ఖున్నా చేవన్ @ దామోదరాచారి కేదార్‌ నాథ్ విద్యార్థి @ రాహుల్ సాంకృ త్యాయన్ అనే  వివిధ పేర్లతో జీవించిన రాహుల్జీ జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విష యాల్ని కేవలం 40 పేజీలలో పొందుపరిచి అందించిన ఈ పుస్తకం ఒక్క సిటింగ్ లో చదవదగ్గది!

అర్థవంతమైన అక్షర రూపం

మహా మానవుడిగా, మహా సంచారిగా రాహుల్జీ ఎదిగిన క్రమాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి ఇందులో ఫొటోలతో సహా ఆ వివరాలు రాశారు. ఉత్తర భారతదేశం మొదలుకొని ప్రపంచంలోని అనేక దేశాలు, ప్రాంతాల వరకూ అవిశ్రాంతంగా సాగిన ఆయన అన్వేషణకి ఒక అర్థవంతమైన అక్షర రూపం ఇచ్చారు!

ప్రాథమిక విద్య కూడా లేని రాహుల్జీ ప్రపంచంలోని రెండు అత్యుత్తమ విశ్వ విద్యాలయాల్లో ఆచార్యునిగా పనిచేసిన విషయం మనకి తెల్సిందే. ఐతే, టిబెటన్ లఢాఖీ విద్యార్దులకు టీష్టన్ పున్షోంగ్ అనే వేత్తతో కల్సి వ్యాకరణ పుస్తకాల్ని, టిబెట్ బాలశిక్షని రూపొందించడం, ఈమధ్య కాలం వరకూ అక్కడి పాఠశాలలకు అవే పాఠ్య పుస్తకాలు అవడం అపురూపమైన విషయం!

Also read: తెలుగు సాహిత్యంలో సాంకృత్యాయన్!

మాంసాహారం పట్ల మక్కువ

ఒకసారి కొలంబోలో ఒక బౌద్ధ సంఘం రాహుల్జీ ని విందుకి ఆహ్వానించారట. మొత్తం అన్ని ఆహార పదార్థాలు శాకాహారానివే ఆయన ముందు ఉంచారట. వాటన్నింటినీ పరికించి చూసిన రాహుల్జీ వారితొ, ” సరే, ఇదంతా పశువులు తినేది. మరి మన భోజనం ఏదీ?” అన్నారట. మాంసాహారాన్ని చులకన చేసేలా మాట్లాడిన ఈనాటి సన్యాసులకి చెంపపెట్టు తిరుగులేని సన్యాసి అయిన రాహుల్జీ మాటలు!

రాహుల్జీ మొదటి రచన బైస్వీ సాదీ ( 22వ శతాబ్ది) పుస్తకాన్ని ఆయన జైల్లో  ఉంటూ ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ లో రాశాడు. దాని ఫ్రూఫ్ ని నేపాల్ మీదుగా వెళుతుండగా చూస్తూ జపాన్ చేరి పూర్తి చేసాడట. బొత్తిగా స్థిరత్వం లేని తీవ్రమైన సంచార జీవితం రాహుల్జీ ది అనడంలో సందేహం లేదు!

బొత్తిగా పట్టించుకోని భారత ప్రభుత్వం

టిబెట్ లో అరుదైన గ్రంథాల సేకరణ కోసం వెళ్ళిన రాహుల్జీని భారత ప్రభుత్వం అసలు పట్టించుకున్నది లేదు. నాటి బీహార్ రాష్ట్ర ప్రభుత్వమైనా కాస్తో కూస్తో స్పందించింది కానీ భారత ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ఆఖరికి ఇలాంటి శోధనలపై ఏ మాత్రం ఆసక్తి లేని ఇటలీ ఫాసిస్టు ప్రభుత్వం కూడా టిబెట్ లోని సంస్కృత గ్రంథాల కోసం నాడు ‘ప్రొఫెసర్ టుక్కీ’ కి నిధులు మంజూరు చేసిందట!

రాహుల్జీ ఏక వ్యక్తి సైన్యంగా సాధించిన పురోగతి  ప్రపంచంలోని బుద్దిజీవుల్ని నివ్వెర పరిచింది. కలలో కూడా ఊహించడానికి సాహసించనంత అత్యంత విలువైన సారస్వత సాహిత్యాన్ని మానవాళికి అందుబాటులోకి తీసుకుని వచ్చి, సాంస్కృతిక సుసంపన్నానికి కృషి చేసిన రాహుల్జీ ఎందరికో ఆరాధ్యుడు, ప్రేమా స్పదుడు అయినట్లే కొందరికి కంటగింపు కూడా అయ్యాడట!

Also read: మానవత్వమే మహాత్ముడి స్పూర్తి !

విషం కక్కిన మన మేధావులు

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేసిన రాహుల్జీ పై అందుకే ఈ దేశ మేధావులు కొందరు విషం కక్కారు. విదేశీ విశ్వవిద్యాలయాలలో సైతం బోధకుడిగా ఘనత సాధించిన మహా పండితుడ్ని ఇండియాలోని ఏ ఒక్క యూనివర్సిటీ కనీసం ఆహ్వానించక పోవడం ఈ దేశంలో విద్య పేరిట అమల వుతున్న నిర్భంధ బానిసత్వానికి,  అల్పత్వానికో స్వల్ప ప్రతీక మాత్రమే !

చాలా కాలం పాటు రాహుల్జీ ని పసుపుపచ్చ బట్టల మార్క్సిస్టని పార్టీలో పిలిచేవారట, కొన్ని సందర్భాలలో ప్రేమగా, మరికొన్ని సందర్భాల్లో భయంతోనూ. ఎవరేమ నుకున్నా రాహుల్జీ మాత్రం చిట్టచివరి వరకూ కూడా తన జీవితం మొత్తాన్ని సమాజానికే ధార పోసాడు. అణగారిన వర్గాల ప్రజల కోసమే అంకితం చేశాడు!

అంబేడ్కర్, రాహుల్జీ

1956 లో 2500 వ బౌద్ధ ఉత్సవాలు నేపాల్ రాజధాని ఖాట్మాండు లో జరిగినప్పుడు ఆ సమావేశంలో భారతదేశం తరపున ఇద్దరే వ్యక్తులు విశిష్ట ఉపన్యాసకులుగా నిలిచారు. ఒకరు బాబాసాహెబ్ అంబేద్కర్ కాగా, రెండో వ్యక్తి మహాపండిత్ రాహుల్ సాంకృత్యాయన్. ఇరువురూ పీడిత ప్రజల పక్షాన జీవితాంతం కృషి చేసిన వారే!

ఇలాంటి ఎన్నో సంగతుల చిన్నపాటి ఈ పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేద్దామని అనుకున్నాను. ఐతే, budblooms కాపీరైట్ హక్కుల కొరకు స్రవస్తి ధమ్మిక గారితో సంప్రదింపులు జరిపడం అవసరం అని తెలిసింది. కాన ఆ వ్యాయా మం అంతా చేయలేక ఈ సంక్షిప్త పరిచయం చేస్తున్నాను!

ఆసక్తి ఉన్న  మిత్రుల కోసం ఆ పుస్తకాన్ని ఇలా పంపుతున్నాను. రాహుల్జీ జీవితం పట్ల ఆసక్తి ఉన్న వారంతా తప్పకుండా చదవాల్సిన పుస్తకం మాత్రమే కాదు, చదివించాల్సిన పుస్తకం కూడా అని నా అభిప్రాయం. అందుకే, ఈ చిన్న రైటప్!

Also read: మహామానవవాద తత్త్వవేత్త మానవేంద్రనాథ్ రాయ్!

– గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles