పొద్దటి నుంచి గాలి లేదు,
నిన్నటి గాలి తోనే
సరి పెట్టు కుంటున్నాము.
తాజా వాయువులు
వస్తూ వస్తూ
ఎక్కడో ఆగి పోయినట్టున్నాయి.
పువ్వులన్నీ
ఒక్క చోట చేరి
ముచ్చట్లాడు కుంటున్నాయి.
గాలి వీస్తే గదా
పరిమళాలు నలువైపులకు
పయనించేది.
ఆ మొన్న తుఫానుకు
చెట్లు చెలరేగి పోవటం గుర్తుంది.
ఇవాళ కొమ్మయినా
ఊగటం లేదు.
వాతావరణంలో గాలులు
వొడిసి పోయినట్టున్నాయి
అంతా ఖాళీ ఖాళీగా వుంది.
ఇన్నాళ్లుగా
గాలి అన్నా భయమే కలిగేది
కోవిడ్‌తో
స్నేహం చేసిందేమోనని.
నా నీడ
నన్ను విడిచి పోతున్నట్టు
పీడ కలలు సతాయించేవి.
ఈ మధ్య కొంచెం
ఆత్మీయ స్పర్శలా సోకుతుంది.
మొక్క మీద
సీతా కోక చిలుక
రెక్కలు మూస్తూ తెరుస్తూ
స్ఫురిస్తున్న కవిత్వంలా వుంది.
గాలికి రూపం వస్తే
ఇంతందంగా వుంటుందేమో!
మధ్యాహ్నానికి
మొగ్గలు విచ్చుకుంటున్నాయి
ఎగరాలనే కాంక్షతో
రిక్కలు వ్యక్తమౌతున్నట్టు.
అంతా మర్చిపోదాం
రండి!
చెరువులో గాలికి
అలలు కదుల్తున్నాయి.
సద్దు చెయ్య కండి
పద్యం తయారౌతున్నట్టుంది.
Also read: గొడుగు
Also read: మా ఊరు
Also read: ఆకు
Also read: తాళం చెవి
Also read: సాక్షి