Sunday, December 22, 2024

ట్రావెన్ కోర్ లో రొమ్ము పన్ను

ట్రావెన్ కోర్ రాజప్రాసాదం, నంగెలి ప్రతిమ

చిన్న పిల్లలకు అన్నం తినిపించే తల్లులు పిల్లలు అన్నం గబగబా తినాలని ‘బూచోడొస్తాడనో, పిచ్చోడొచ్చి తీసుకుపోతాడనో’ భయపెడుతుంటారు.  పిల్లలు అన్నం తినాలన్న ప్రేమ, తాపత్రయం  ఆ తల్లులది! దాదాపు ఇలాంటి పరిస్థితే మన సమాజంలో కూడా జరుగుతూ ఉంది. దేవుడు, దయ్యం, వాస్తు, జ్యోతిష్యం, గండం, శాంతి, వేదవాక్యాలు, మనుస్మృతి లాంటివన్నీ చెపుతూ సామాన్య జనాన్ని హడల గొడుతూ తాము పొట్టపోసుకుంటున్నవాళ్ళు- ఈ సంప్రదాయ పండితులు, స్వాములు, బాబాలు, పీఠాధిపతులు వగైరా… అక్కడ తల్లులు బిడ్డల క్షేమం, ఆరోగ్యం గురించి ఆలోచిస్తే ఇక్కడ వీరు జనాన్ని మోసం చేయడం మీద ధ్యాస పెడతారు. తాము పూట గడుపుకోవడం గురించి తాపత్రయ పడతారు. లేదా అక్రమ ఆస్తులు కూడబెట్టడం గురించి తహతహలాడుతుంటారు. ఈ రకమైన పండితులకు మనుస్మృతి, వేదాలు ఓ పెద్ద ఆధారం! ఇంతకీ మనుస్మృతిలో ఏముందో చూస్తే ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళకు విషయం దానంతట అదే అర్థమవుతుంది.

సమాజమంతా మనుస్మృతితో కట్టడి చేయబడి ఉన్న రోజుల్లో దేశవ్యాప్తంగా లక్షలక్షల అఘాయిత్యాలు జరిగాయి. ఆ ప్రభావంతో ఇంకా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు కేరళలో జరిగిన ఒక ఉదంతం చూద్దాం! పందొమ్మిదో శతాబ్దపు తొలి దశలో ట్రావెన్ కోర్ లో స్త్రీలు ‘రొమ్ము పన్ను’ (మూలక్కరం) కట్టాల్సివచ్చేది.  పన్ను కట్టలేనివాళ్ళు ఏ ఆచ్ఛాదనా లేకుండా తిరగాలి. రొమ్ములు కప్పుకుంటే విధిగా ‘రొమ్ము పన్ను’ కట్టాలి. రాజుల పాలనలో ఉన్న అప్పటి ట్రావెన్ కోర్ లో స్త్రీలను ఎంత మర్యాదగా చూశారో, ఎంత గౌరవించారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి నిబంధనలున్న రోజుల్లో 1803లో ‘నంగెలి’ అనే మహిళ చేసిన సాహసోపేతమైన చర్య గురించి అందరూ తెలుసుకోవాలి. మతం నేపథ్యంలో రాచరికాలు వెలగబెట్టినవారు మానవత్వాన్ని ఎలా మంటగలిపారో గమనించాలి.

‘నంగెలి’ అనే నిమ్నజాతి మహిళ రొమ్ము పన్ను కట్టకుండా దర్జాగా శరీర పైభాగం కప్పుకొని తిరుగుతోందని – రొమ్ము పన్ను వసూలు చేసే గ్రామాధికారి (ప్రవతియార్) తెలుసుకున్నాడు. హుటాహుటిన వెళ్ళి పన్ను కట్టమన్నాడు. ఆమె లోపలికి వెళ్లి ఛురకత్తితో తన రొమ్ములు రెండూ కోసుకుని…వాటిని అరటి ఆకులో పెట్టి అతనికి సమర్పించింది. ఇవి తీసుకుని వెళ్ళి మీరూ, మీ వ్యవస్థ, మీ రాజులూ అంతా కలిసి ఊరేగండి! అంతేగాని, తను మాత్రం ‘రొమ్ము పన్ను’ కట్టేది లేదన్న విషయం ఆమె చర్యతో ఖరాఖండిగా చెప్పింది. ఆమెలో నిరసనభావం ఎంత తీవ్రంగా ఉండిందో మనం అర్థం చేసుకోవాలి. అంతే కాదు, ఒక తెగింపు, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఆమెలో ఏ స్థాయిలో ఉండిందో కూడా ఊహించుకోవాలి. మామూలు వాళ్ళు అంతటి సాహసానికి ఒడిగట్టరు. సరే- రక్తస్రావం ఆగక ఆమె కొద్ది గంటలలోనే ప్రాణం విడిచింది. మనిషిని మనిషిగా బతకనీయక పోయిన తర్వాత ఇలాంటి నికృష్ట సమాజంలో బతకడం దేనికీ? అన్నది ఆమె ఆలోచన కావచ్చు. ఆ సంఘటన తర్వాత ఆమె నివసించిన ఆ ప్రాంతానికి ‘ములచిపరంబు’ అనే పేరొచ్చింది. ములచిపరంబు అంటే ‘రొమ్ములున్న స్త్రీల దేశం’ (ల్యాండ్ ఆఫ్ బ్రెస్టెడ్ ఉమెన్) అని అర్థం! అతి దారుణంగా చనిపోయిన భార్య మరణాన్ని చూసి ‘నంగెలి’ భర్త నిలదొక్కులేకపోయాడు. ఆమె చితిపైకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాడు దేశంలో చలామణిలో ఉన్న సతీసహగమనానికి విరుద్ధంగా ఇక్కడ పతీసహగమనం జరిగింది.

నంగెలి త్యాగం కారణంగా తర్వాత కాలంలో అక్కడ ‘రొమ్ముపన్ను’ రద్దయింది. అప్పటి నుడి ఆడవాళ్ళు తమ శరీరం పైభాగం కప్పుకోగలుగుతున్నారు. అయితే, అందులో మళ్ళీ కొన్ని నిబంధనలున్నాయి. ఒక్క బ్రాహ్మణ కుటుంబాలలో మాత్రమే స్త్రీలు లోన రవికె వేసుకుని, పైన చీర కొంగు కప్పుకునే అర్హత ఉండేది. వెనుకబడిన జాతులకు, నిమ్న జాతులకు ఆ సౌకర్యం లేదు. రవిక వేసుకోవచ్చు కానీ, చీర కొంగు కప్పుకోగూడదు. దాన్ని నడుముకు చుట్టుకోవాలి. కాలక్రమంలో అది ఆచారమూ, సంప్రదాయమూ అయిపోయింది. ఫలితంగానే కేరళ గ్రామీణుల్లో అధికశాతం స్త్రీలు కొంగులు కప్పుకోవడం ఉండదు. అయితే ఇటీవల మహిళల్లో మార్పు వచ్చింది. దీనికి కొంత నేపథ్యం ఉంది. అగ్రవర్ణాల ఆధిపత్యం జోరుగా సాగుతున్న రోజుల్లో ఆడయినా, మగయినా – కింద గోచిగుడ్డో మూరెడు అడ్డబట్టోతప్ప పైన ఆచ్ఛాదనలేవీ ఉండకూడదు. ఊరి పెద్ద ఎదురు పడితే తల రుమాలు గబుక్కున తీసి, చంకలో దోపుకుని, చేతులు కట్టుకుని, నేల చూపులు చూస్తూ వినయంగా నిలబడాలి. అలాంటప్పుడు పైన ఆచ్ఛాదనలుంటే నిమ్న జాతివాడు స్థితిమంతుడైనట్టు లెక్క. వాడు తమ అధికారాన్ని ఎదిరిస్తున్నట్టు లెక్క. అందువల్ల అణచివేతలో భాగంగానే వారు పైన గుడ్డలుధరించగూడదన్న నియమం బలంగా ఉండేది.

అత్యాధునిక యుగంలోకి వచ్చాం. మూఢ నమ్మకాలు, చాదస్తాలు, చాలా వరకు తగ్గాయి – అని మనం అనుకుంటున్నాం కానీ, తగ్గాల్సినంత తగ్గలేదు. మారిన సమాజ అవసరాలకు అనుగుణంగా మూఢనమ్మకాలు కూడా మారుతూ వస్తున్నాయి. సమాజాన్ని వెనక్కి నడిపించే దుష్టశక్తులు ఇంకా ప్రబలంగానే ఉన్నాయి. సెప్టెంబర్ 2016లో అస్సాంలో జరిగిన ఒక సంఘటన చూడండి. అస్సాంలోని రత్నాపూర్ లో ‘సోనుగోడ్బా’ అనే నాలుగేళ్ళ పసిపాప కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆరాతీసి వెతకగా ఆ పసిపాప శవం భయంకరమైన స్థితిలో దొరికింది. రెండు చేతులూ నరికేసి దారుణంగా చంపినన దాఖలాలు కనిపించాయి. అది మామూలు హత్య కాదనీ, ఏ దేవతకో ఇచ్చిన ‘బలి’ అనీ నిర్థారణ జరిగింది. కూపీ లాగితే హనుమాన్ భీమ్ జీ అనే గ్రామస్థుడు దొరికాడు. అతని ఇంట్లో జరిగిన క్షుద్రపూజల ఆనవాళ్ళ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తే – అది మంత్రగాడైన ఆరిఫుద్దీన్ పనని తేలింది. మంత్రగాడికి సహకరించిన మరో ఇద్దరు సహచరుల వివరాలు కూడా దొరికాయి. అసలు జరిగిందేమంటే హనుమాన్ భీమ్ జీ కూతురి మొబైల్ ఎక్కడో పోయింది.  అది దొరకడానికి పూజ చేయాల్సిందిగా అతను మంత్రగాడిని కోరాడు. ఒక అమ్మాయిని బలి ఇస్తే పోయిన ఫోను తప్పక దొరుకుతుందన్నాడు మంత్రగాడు. పోయిన ఫోనుతో ఏ మాత్రం సంబంధం లేని నాలుగేళ్ళ అమ్మాయి ‘సోనుగోడ్బా’ను దేవతకి బలి ఇచ్చి, పూజలు చేశారు. ఇంతలో పోలీసుల జోక్యంతో నిదితుల విషయాలు బయటపడ్డాయి. మానవీయ విలువల్ని మంటగలుపుతూ ఒక చిన్నారిని అతి క్రూరంగా బలి ఇవ్వడమన్నది అతి కిరాతకమైన, హేయమైన చర్య!

మూఢనమ్మకాల్లో కూరుకుపోయిన జనానిది ఎంత తప్పో, వారు నిస్తేజంగా అందులోనే ఉండేవిధంగా పథకాలు, ప్రణాళికలు రచిస్తున్న పరిపాలకులది, నేతలది కూడా అంతే తప్పు. మనిషి ప్రాథమిక దశలో రాసుకున్న నీతి సూత్రాలు పరిణతి సాధించిన ప్రగతిశీల సమాజానికి ఎంతమాత్రమూ పనికి రావన్నది గ్రహించుకోవాలి! ఆధునిక, ప్రజాస్వామిక, వైజ్ఞానిక సమాజానికి ఇలాంటి పొంతనలేని, అతిపురాతన భావజాలం ఏ విధంగా ఉపకరిస్తుందీ? కుళ్ళిపోయి దర్గంధం వెదజల్లుతున్న ఇలాంటి ఆలోచనా విధానాల్ని ప్రభుత్వాలు, మతపెద్దలు, ఆధ్యాత్మిక గురువులు, సంప్రదాయవాదులు ఇంకా ఎంతకాలమని ప్రచారం చేస్తారన్నదే మన ప్రశ్న!  

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

3 COMMENTS

  1. సమాజ పరివర్తన కోసం కనువిప్పు కలిగే అంశాలను వ్యాస రూఫంగా వివరిస్తున్న మీకు కృతజ్ఞతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles