ఆకలైనప్పుడు
మరీ అందంగా వుంటుంది
దూది పూలను ఏకితే
పరుచుకున్న ధవళ వస్త్రంలాగ.
ఆకలి తీరుతున్నప్పటి దృశ్యం
అతిలోక సుందరం.
తదేకంగా చూస్తూ వుండి పోతాను.
బ్రెడ్‌తో నా తొలి ప్రేమ
చిన్నప్పటి జ్వరానుబంధమే.
ఆనాటి కలల్లో
మృదువైన తెల్లని నురగ మీద
నడుస్తున్నట్టు,
ఉమ్మ గిల్లుతున్న జల్లెడపైన దొర్లుతున్నట్టు.
బహుశా నా ఊహా శక్తి కది పునాది.
బాల్యంలోని గుండ్రటి బన్ను
భూగోళాన్ని తలపించేది.
దాన్ని చూస్తే
అమ్మ చల్లని కడుపు గుర్తుకొచ్చేది.
దాని నున్నటి శిరస్సు పైన
కనిపించని
గోధుమ పూల కిరీట ముండేది.
విద్యార్థి దశలో మా అన్నయ్య
సికింద్రాబాద్ నుండి
మాడరన్ బ్రెడ్ తెస్తే
పండు గొచ్చి నంత సంబరం,
అప్పుడదొక లగ్జరీ!
ఒక్కొక్క స్లైసుని విప్పుతుంటే
జీవితం పుటలు తిరగేస్తున్నట్టుండేది.
బ్రెడ్డును కాల్చే
పొయ్యిని తలుచుకున్నప్పు డల్లా
మాక్సిం గోర్కీ గుర్తుకొస్తాడు నాకు
అతని విప్లవ భావాలకు
ఇంధనం అక్కడే తయారైంది.
బ్రెడ్డు
పిండీ నీరూ నిప్పూ
కలిసి రూపొందిన
ఆకలి మహా కావ్యం.
మిత్రమా!
ఇవాళ దీన్ని అధ్యయనం చేద్దాం
ముందుగా
నీకో బ్రెడ్డ్ ముక్కనిస్తా
నా ప్రేమను పూసుకొని
స్యాండ్విచ్‌లను ఆరగించు.
Also read: సామూహిక
Also read: సముద్రం ముద్ర
Also read: వలస చేప
Also read: చక్రం
Also read: అల్పాక్షరముల…