- లోక్ సభ లోదూకిన ఇద్దరు యువకులు
- 22 ఏళ్ళ కిందట ఇదే రోజు పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి
బుధవారం నాడు లోక్ సభలో ఇద్దరు దుండగులు ప్రవేశించి గందరగోళం సృష్టించడం, మరో ఇద్దరు బయట హల్ చల్ చేయడం భద్రతా వైఫల్యానికి గీటురాయిగా నిలుస్తున్నాయి. సరిగ్గా ఇదే రోజు 2001లో (డిసెంబర్ 13) పార్లమెంట్ పై దాడి జరిగింది. అది ఉగ్రదాడిగానే గుర్తించారు. 22ఏళ్ళ తర్వాత అదే తరహా ఘటన పునరావృతం కావడం గమనించదగినది. ఇదే అంశంపై మన దేశంతో పాటు ప్రపంచమంతటా నేడు చర్చ జరుగుతోంది. ఈరోజు జరిగిన ఘటనలో ఎటువంటి హాని జరగకపోయినప్పటికీ, ఈ చర్య ఏ మాత్రం ఆహ్వానించ దగిన పరిణామం కాదు. దేశంలోనే అత్యంత భద్రతతో కూడిన భవనాల్లో పార్లమెంట్ ఒకటి. ఈ పార్లమెంట్ భవనం కొత్తగా కట్టించింది కూడా కావడం మరో విశేషం. ఈ ఘటనతో ప్రతిపక్షాలకు బిజెపి ప్రభుత్వం పెద్ద విమర్శనాస్త్రాన్ని చేతికిచ్చినట్లైంది. విపక్షాలు రాజకీయాలు చేయడం సహజమైన అంశం. ఇలాంటి సందర్భాల్లో చేయడం మరీ సహజం. ఈ రాజకీయాలను పక్కన పెడితే,ఇటువంటి సంఘటనల ద్వారా ప్రజలకు ఎటువంటి సందేశం బయటకు వెళ్తోందన్నది పెద్ద ప్రశ్న.
Also read: మారవోయి మనిషీ!
పరుగులు తీసిన పార్లమెంటు సభ్యులు
దేశ రక్షణకు సంబంధించిన పెను అంశం. లోక్ సభ లోపలికి ప్రవేశించిన ఆ ఇద్దరు వారి వెంట కొన్ని వస్తువులు తెచ్చుకున్నారు. వాటి ద్వారా పార్లమెంట్ లో గ్యాస్ ను వదిలారు. మరుక్షణంలోనే ఆవరణంత గ్యాస్ తో నిండిపోయింది. ఊహించని ఈ పరిణామానికి అందరూ ఉలిక్కిపడ్డారు, ఉక్కిరిబిక్కిరయ్యారు. కొందరు పార్లమెంట్ సభ్యులు పరుగులు తీస్తూ బయటకు పారిపోయారు, కొందరు లోపలే ఉన్నారు. అందరిలో గందరగోళం అలాగే వుంది. సభలోకి దూకి వచ్చి గొట్టం ఆకారం వున్న వస్తువుతో పసుపు రంగు గ్యాస్ బయటకు వదలడం, ఒక వ్యక్తి పబ్లిక్ గ్యాలరీ నుంచి కిందకు దూకి నినాదాలు చెయ్యడం, స్పీకర్ కుర్చీ వైపు వెళ్లే ప్రయత్నం చెయ్యడం, బయట మరో ఇద్దరు ఈ తరహాలోనే ఆందోళన చేయడం మొదలైన వరుస సన్నివేశాలన్నీ అమిత ఆశ్చర్యాన్ని, అంతకు మించిన భయాన్ని కలుగజేస్తున్నాయి. సరే! ఆ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, దర్యాప్తు నిర్వహిస్తున్నారు. దర్యాప్తులో ఏదో ఒకటి తెలుస్తారు, అది అలా ఉంచుదాం.పార్లమెంట్ లోపలికి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ, మనోరంజన్ గా గుర్తించారు. బయట హడావిడి చేసినవారిలో ఒకరు హరియాణాకు చెందిన మహిళ నీలం, మరో వ్యక్తి మహారాష్ట్ర లాతూర్ కు చెందిన అమోల్ శిందేగా పోలీసులు చెబుతున్నారు.
Also read: చట్టసభలు నేరచరితులమయం!
కేంద్ర ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్న ఘటన
ఎవరో ఒక పార్లమెంట్ సభ్యుడి సిఫారసు ద్వారా వీరు లోపలికి ప్రవేశించారనే సమాచారం ప్రచారంలో వుంది. అయితే, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య వాయువును వెదజల్లే పొగగొట్టాలను లోపలికి ఎలా తీసుకెళ్ళారన్నదే రాజకోట రహస్యంగా మారింది. కారణాలు, అంశాలు ఏవైనా ఇది అతి పెద్ద భద్రతా వైఫల్యం అన్నది నిర్వివాదాంశం. మొన్ననే కశ్మీర్ కు సంబంధించిన 370 ఆర్టికల్ రద్దు అంశంపై సుప్రీం కోర్టు బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.ఇది చారిత్రక విజయంగా, గొప్ప మలుపుగా బిజెపి దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటోంది. కశ్మీర్ లో గొప్ప శాంతిని, భద్రతను ప్రతిష్ఠిస్తామనేవిశ్వాసాన్ని నింపే దిశగా బలమైన గొంతు వినిపిస్తోంది. మూడు రాష్ట్రాల అసెంబ్లీలో గెలిచిన ఆనందం, కాంగ్రెస్ / ఇండియా కూటమిని నిర్వీర్యం చేశామనే సంతోషంలో బిజెపి వుంది. మరి కొన్ని రోజుల్లోనే అయోధ్యలో శ్రీరామమందిర ప్రతిష్ఠతో తన ప్రతిష్ఠను పెంచుకోగలమనే ఆనందహేలలో ఉంది. ఇటువంటి తరుణంలో, దేశ రాజధానిలో, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పార్లమెంట్ సాక్షిగా జరిగిన ఈ భద్రతా వైఫల్యం కేంద్ర ప్రభుత్వ తీరును వెక్కిరిస్తోంది. ప్రతిపక్షాలతో పాటు, శత్రుదేశాల ముందు స్వరం తగ్గించాల్సిన సన్నివేశాన్ని బిజెపి ప్రభుత్వం తెచ్చుకుంది. పార్లమెంట్ కార్యకలాపాలు జరుగుతున్న వేళ ఈ కలకలం జరగడం అత్యంత బాధాకరం. ఇప్పటికైనా మేలుకోవాలి. మరింత జాగ్రత్త పడాలి. పోయిన ప్రతిష్ఠ ఎలాగూ రాదు. అధికారంలో ఏ ప్రభుత్వం వున్నా, దేశ ప్రతిష్ఠకు,భద్రతకు కొత్త సవాళ్లు ఎదురు కాకూడదు. శాంతి వర్ధిల్లాలి.
Also read: సాహో సాంకేతికత!