- సంప్రదింపులు ప్రారంభించిన బ్రెజిల్
- పదికోట్ల వ్యాక్సిన్ డోసులకోసం ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికాకు వద్ద ఆర్డర్
ప్రపంచాన్ని వణికించిన కరోనాకు విరుగుడు ఇపుడిపుడే వినియోగంలోకి వస్తోంది. అత్యవసర వినియోగంగ కింద దాదాపు 30 దేశాల్లో పలు కంపెనీలకు చెందిన టీకాలు అనుమతులు పొందాయి. భారత్ లోనూ అత్యవసర వినియోగం కింద రెండు వ్యాక్సిన్ లు అనుమతి పొందాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ల తయారీ అభివృద్ధి కేంద్రంగా ఉన్న భారత్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ డోసుల కోసం బ్రెజిల్ సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రకటించింది. ప్రయోగదశలో ఉన్న సమయంలో పలు దేశాలకు చెందిన రాయబారులు హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీని ఇటీవలే సందర్శించారు. కొవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు ఇంకా కొనసాగుతూనేఉన్నాయి. అయితే అత్యవసర వినియోగం కింద డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. దీంతో బ్రెజిల్ చెందిన ప్రైవేటు సంస్థ బ్రెజిలియన్ అసోసియోషన్ ఆఫ్ వ్యాక్సిన్ క్లినిక్ల్ కొవాగ్జిన్ డోసుల కోసం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందుకోసం భారత్ ఫార్మా కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపింది.
కోరోనా వ్యాక్సిన్ కోసం భారత కంపెనీలతో సంప్రదింపులు
అమెరికా తర్వాత అత్యధిక కరోనా మరణాలు బ్ర్రెజిల్ లో నమోదవుతున్నాయి. కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలను బ్రెజిల్ అధ్యక్షుడు ఎదుర్కొంటున్నారు. వ్యాక్సిన్ పంపిణీపై ఆలస్యం చేయడం ప్రజల్లో అసహనాన్ని పెంచుతోంది. అధ్యక్షుడి తీరుతో అసహనంగా ఉన్న రాష్ట్రాలు సొంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పదికోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల కోసం ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా వద్ద ముందస్తు ఆర్డరు పెట్టింది. ప్రపంచంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో బ్రెజిల్ మూడో స్థానంలో ఉండగా కొవిడ్ మరణాల్లో రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు బ్రెజిల్ లో సుమారు 80 లక్షల మంది వైరస్ బారినపడినట్లు అక్కడి ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే కరోనాబారినపడి లక్షా 96 వేల మంది ప్రాణాలను కోల్పోయారని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా