డిల్లీలో దారుణమైన టెర్రరిస్టు కేసులు బనాయించి నిర్దోషి అయిన ఒక యువకుడిని పద్నాలుగేళ్లు జైలు పాలు చేసిన పోలీసు నేరస్తులకు శిక్షలు పడని పాలన మనది. వారి అన్యాయాలు చూసే శక్తి గానీ ఆసక్తిగాని కొన్ని కోర్టులకు లేకపోవడం దారుణం.
ఒక వ్యక్తిని వ్యక్తిగా పౌరుడిగా మనం చూడం. ముందు అతని మతం చూస్తాం, హిందువైతే అతని కులం పరిగణిస్తాం. మతకులాల ఆధారంగా అతని నేరాన్ని లేదా నిర్దోషిత్వాన్ని నిరూపించే సాధనాలుగా కులమతాలు మారిపోయాయి. మనిషిని మనిషిగా వ్యక్తిగా పరిగణించే వీల్లేని అనాగరిక సమాజంలో ఉన్నామా అని ఆవేదన కలుగుతుంది. అమీర్ కథ చదివితే.
పోలీసులు అకారణంగా చిత్రహింసలు పెట్టి, వందలాది తెల్లకాగితాల మీద,హింసించిడజన్లకొద్దీ డైరీల మీద సంతకాలు తీసుకుని, 20 చోట్ల బాంబులు పెట్టాడంటూ తప్పుడు కేసుల్లో ఇరికించి, 60, 70 మంది చేత దొంగ సాక్ష్యాలు చెప్పించి, తప్పుడు ఉత్తరాలు సృష్టించి, 19 చోట్ల బాంబులు పెట్టాడని దొంగ క్రిమినల్ కేసుల్లో ఇరికించి అమీర్ జీవితాన్ని, ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని సర్వ నాశనం చేసిన ఢిల్లీ పోలీసుల కథ ఇది. అమీర్.. కథ కాదు. ఇదంతా భరించి బతికున్నాడు గనుక అతను చెప్పుకోవడానికి కొన్నేళ్ల తరువాతైనా ధైర్యం చేయగలిగినాడు కనుక పోలీసుల అనాగరిక దౌర్జన్య క్రూరత్వాల కథ బయటకు వచ్చింది. చచ్చిపోయి ఉంటే కస్టడీ మరణాలలో ఒక అంకెగా గణాంకాలలో సమాధి అయ్యేవాడు.
Also read: రాజ్యాంగలక్ష్యాలను కాలదన్నే కార్యక్రమం
కళ్లుతెరవని కోర్టు
పోలీసుల తప్పుడుకేసులను కనిపెట్టి పట్టుకుని, అమాయకులను విడిపించి, అసలు నేరస్తుడు జారిపోకుండా శిక్షించవలసిన బాధ్యత జిల్లా స్థాయిలో ఉన్న న్యాయాధికారుల (మెజిస్ట్రేట్) మీద ఉంది. ఈ 19 కేసులలో 17 వీగిపోయాయి. ఎంత పకడ్బందీగా తప్పుడు సాక్ష్యాలు చెప్పినా 17 కేసుల్లో కింది కోర్టులే అతన్ని నిర్దోషిగా తేల్చి జిల్లా స్థాయి న్యాయస్థానాల్లో ఇంకా న్యాయం బతికుందని నిరూపించారు. కాని 12 దొంగ కేసులని గుర్తించిన న్యాయాధికారి ఒకరు మరొక కేసులో అతన్ని దోషిగా పరిగణించడం ఆశ్చర్యకరమైన అన్యాయం. మరొక జడ్జి 17 దొంగ కేసులే అనే విషయం బహిరంగంగా అందరికీ తెలిసినా మరొక కేసులో శిక్ష వేయడం కూడా గొప్ప వింత, విచిత్రం. సమగ్రమైన దృక్పథం ఉంటుందా లేదా అని అనుమానించాల్సిన విషయం. ఆ రెండు కేసులలో అమీర్ హైకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. ఈ కేసుల్లో శిక్ష వేయడానికి ఏముంది? హైకోర్టు ఆశ్చర్యపోయే విధంగా తీర్పులివ్వడం దారుణం. 17గురు జిల్లా స్థాయి మెజిస్ట్రేట్‌లు హైకోర్టు అతనికి న్యాయం చేసిన మాట నిజమే. ఈ విధమైన న్యాయమూర్తులు లేకుంటే ఎందరు అమీర్‌లు ఏమైపోయేవారో. ప్రస్తుతం 19 కేసుల్లో నిర్దోషి అయిన అమీర్ అప్పడికే 13 సంవత్సరాల పదినెలల జైలు శిక్ష అనుభవించాడు. ఈ శిక్ష కన్న అవమానకరమైన, హేయమైన, నీచమైన పోలీసు చిత్రహింసలకు గురైనాడు. వారి పేర్లు తెలుసు, దుర్మార్గం ఎక్కడెక్కడ జరిగిందో తెలుసు. కాని ఆ ఘోరాలకు పోలీసులే సాకక్షులు, కాని అందరూ హింసించిన వారే. ఎవరికి వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెబుతారు? 19 బాంబు పేలుడు కేసులను రికార్డు స్థాయిలో పరిష్కరించి నిందితుడిని అరెస్టు చేసినందుకు వారికి ప్రమోషన్లు వచ్చాయి. లడ్డూలు పంచుకున్నారు. కాని ఆ 19 కేసుల్లో అమీర్‌ను ఇరికించడం తప్పుడు సాక్ష్యాలతో 14 సంవత్సరాల పాటు ఒక యువకుడి జీవితాన్ని ధ్వంసం చేసిన పోలీసులు, చేతులకు బేడీలతో కోర్టు ముందు నిలబడే రోజు రానంత వరకు ఈ దేశంలో న్యాయం లేనట్టే. రాజ్యాంగ పాలన లేనట్టే. క్రిమినల్ జస్టిస్ సిస్టం లేనట్టే. కేవలం క్రిమినల్ సిస్టం మాత్రమే ఉన్నట్టు.
Also read: లేని అధికారాలను వినియోగించి నదులు స్వాధీనం చేసుకుంటున్న కేంద్రం
ఖాకీ నేరాలకు శిక్షలు ఉండవా?
అదే విధంగా దారుణంగా చిత్రహింసలు పెట్టి తప్పుడు నేరాంగీకార పత్రాల మీద, అందుకు తగిన సాక్ష్యపత్రాల మీద గోళ్లూడగొట్టి సంతకాలు తీసుకున్నతరువాత క్రాప్ చేయించి, స్నానం చేయించి బట్టలు మార్చి, కోర్టులో హింసించామని కోర్టుకు చెబితే ఈసారి మీ తల్లిదండ్రులను కూడా దొంగ కేసుల్లో ఇరికించి హింసిస్తామని బెదిరించి కోర్టు ముందు నిలబెడితే, కనీసం కంటితో కూడా వారి పరిస్థితి చూడకుండా, భరోసా ఇచ్చేందుకు నోరు తెరిచి ఏం జరిగిందని కూడా అడగకుండా నోరుమూసుకుని రిమాండ్ రాసే మెజిస్ట్రేట్ బాధ్యతారాహిత్య దుర్మార్గాన్ని ఎవరు పట్టుకుంటారు? అక్రమంగా హింసించిన పోలీసులకు బాధ్యతారహిత మెజిస్ట్రేట్‌లకు తేడా ఏమిటి? మామూలుగా డబ్బుకోసమో లేదా పగతోనో కత్తిపోట్లు పొడిచిన నేరగాళ్లను ఈ ఘోరమైన ఖాకీ యూనిఫారం నేరగాళ్లను శిక్షించలేని న్యాయవ్యవస్థ, న్యాయవ్యవస్థేనా?
Also read: తెలంగాణకు కృష్ణా జలాలలో వాటా కేటాయించడం లేదు ఎందుకని?
న్యాయాధికారులెందుకు అడగరు?
అరెస్టయినవారిని చూసి నిజంగా ఎప్పుడు అరెస్టయ్యారు, చిత్రహింసకు గురైనారా లేదా అని అడగలేని నిర్లక్ష్యం, భయం, మౌనం రాజ్యం చేసే రోజుల్లో, అమీర్‌లు ఎందరున్నారో ఎవరు చూస్తారు? అమీర్ చెప్పుకున్నాడు. కాని చెప్పుకోలేని వారు, కోర్టుల్లో కూడా న్యాయం దొరకక జైల్లోనే ముగిసిపోయే వారు ఎందరున్నారు? రాజ్యాంగపరంగా ఏర్పాటయినదని మనం అనుకుంటున్న నేర న్యాయవ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించేదిగా ఉందని అర్థమవుతుంది. అక్రమ నిర్బంధితుడిమీద రోడ్డురోలర్ వంటి హింసాసాధనాన్ని తిప్పి కండరాలను దెబ్బ తీసిన పోలీసులకన్న, శరీరం మీద గాయాలు లేవని తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చే ప్రభుత్వ రాక్షస డాక్టర్ల కన్న దారుణం పోలీసులుచెప్పింది నిజమే అని నమ్మి నోరుమూసుకునే కోర్టుల్లో జరుగుతున్నదనడానికి ఈ పుస్తకం ఒక భయానక సాక్ష్యం.
Also read: రాష్ట్రాల నుంచి నదులను కేంద్రం దోచుకోవచ్చునా?
దొంగకేసులని తేల్చిన హైకోర్టు
రెండు దొంగ కేసులలో నిందితుడిపైన ఎంత తప్పుడు కేసులు పెట్టారో ఢిల్లీ హైకోర్టు రుజువు చేసింది. అమీర్ జీవన్మరణ పోరాటం పూర్తిగా డిల్లీ హైకోర్టుకు కూడా తెలియక పోవచ్చు. ఈ పుస్తకం చదివితే వారికైనా పూర్తిగా అర్థమయి ఉండేదేమో అనిపిస్తుంది. తండ్రిని కోల్పోయి, తల్లి ఆరోగ్యం దెబ్బతిని చివరకు మరణం వేగవంతమైతే, ఏ నేరమూ చేయకపోయినా పధ్నాలుగేళ్ల జైలు జీవితం గడిపిన అమీర్ నష్టాలకు ఒక్కపైసా పరిహారం కూడా ఇవ్వలేని ఈ వ్యవస్థ న్యాయవ్యవస్థా? రాజ్యాంగంలో రాసుకున్న హక్కులు ఇవేనా?
సాక్ష్యం చాలక కాదు, నిందితుడికి నేరంతో సంబంధం లేకపోవడం వల్ల కేసు వీగిపోతున్నదని డిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ మహ్మద్ అమీర్ ఖాన్ కేసును కొట్టివేసింది. కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేసింది. బాంబు అక్కడున్న మాట నిజం. అది పేలడం నిజం. ఆ సమయంలో నిందితుడు అమీర్ అక్కడ ఉండడం కూడా నిజం. కాని అతనే ఆ బాంబు పెట్టాడని చెప్పడానికి ఏ సాక్ష్యమూ లేదని, పోలీసులు బాంబు పేలుడుకు నిందితుడికి సంబంధాన్ని రుజువు చేయలేకపోయారని డిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు ఆర్ ఎస్ సోధి, పి కె భాసిన్ 4 ఆగస్టు 2006న తీర్పు చెప్పారు.
మరో కేసు నిజానిజాలు ఇవి
26 అక్టోబర్ 1997న సాయంత్రం 7 గంటలకు హర్ దయాళ్ సింగ్ రోడ్డు మీద కరోల్ బాగ్‌లో రోషన్ డి కుల్ఫీ అనే స్థలంలో ఒక బాంబు పేలింది. ఎందరికో గాయాలు అయినాయి, రామ్ మనోహర్ లోహియా హాస్పటల్ కు వారిని తరలించారు. ఒకరు మరణించారు.
27 ఫిబ్రవరి 1998లో అంటే దాదాపు నాలుగునెలల తరువాత ప్రథమ సమాచార నివేదిక నమోదు చేసి అమీర్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఆలస్యంగా రాసుకున్న ప్రతికేసు అనుమానాస్పదమైనదే. అతని దగ్గర ఒక రివాల్వర్, వాడని పది సజీవ తూటాలు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని ప్రశ్నించారు. ఏ విధంగా అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ దర్యాప్తులో ఈ బాంబు పెట్టింది అమీర్ అని తేలిందని పోలీసులు రాసుకున్నారు. మహ్మద్ షకీల్ అనే వ్యక్తి బాంబు తయారు చేసి అతనికి అందించాడని అంటూ హత్యకేసుతో పాటు పేలుడుపదార్థాల చట్టం కింద నేరాలను అమీర్ పైన మోపారు.దీనికి గాయపడిన వారితో సహా 62 మంది సాకక్షులను విచారించారు.
అమీర్ ను ఎందుకు అరెస్టు చేసారు?
అమీర్ అరెస్టుకు వెనుక ఒక కథ ఉంది. పాకిస్తాన్ కరాచీలో ఉన్న తన అక్క ఇంటికి వెళ్లడానికి అతను పాకిస్తాన్ వీసాకు ప్రయత్నిస్తుంటే నిఘా అధికారి అని చెప్పుకునే గుప్తా అనే వ్యక్తి, అమీర్ భారత దేశం కోసం పాక్ నావికా దళానికి చెందిన కొన్ని పత్రాలను కరాచీలో 12 డిసెంబర్ 1997న తనను కలిసిన ఒక వ్యక్తి దగ్గర తీసుకుని తమకు ఇవ్వాలని కోరారు. అతడు ఒప్పుకున్నాడు. పత్రాలు సంపాదించాడు. కాని 12 ఫిబ్రవరి 1998 నాడు తిరిగి వస్తున్నప్పడు వాగా సరిహద్దు దగ్గర పాకిస్తాన్ పోలీసులు ఆ తరువాత భారత్ పోలీసులు ఒక్కో వ్యక్తిని విపరీతంగా శోధించడం చూసి భయంతో ఆ పత్రాలను బయట పారేసాడు, ఏ ఇబ్బందీలేకుండా సొంత దేశానికి వచ్చాడు. గుప్తాను కలిసి తన నిస్సహాయస్థితి గురించి వివరించి పత్రాలు తేలేక పోయానని చెప్పుకున్నాడు. కాని గుప్తాకు పత్రాలు తేనందుకు కోపం వచ్చింది. తప్పుడుకేసుల్లో ఇరికిస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. 20 ఫిబ్రవరి 1998 బహదూర్ ఘర్ లో రోడ్డుపైన నడుస్తున్న అమీర్ ను పక్కనుంచి వచ్చిన పోలీసులు జీపులోకి తోసి తీసుకుపోయారు. పోలీసులు కస్టడీలో గుప్తా, తదితర అధికారులు హింసించి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారు. తరువాత ఈ కేసు పెట్టారు. ఇదంతా డిఫెన్స్ లాయర్ గారి వాదన.
అక్కడ రెస్టారెంట్ లో ఆహారం తీసుకోవడానికి సుష్మా నరూలా ఆరేడు నిమిషాలు ఎదురుచూడవలసి వచ్చిందనీ ఒక సీటు ఖాళీకాగానే ఆమె కూర్చున్నారని, అంతకు ముందు ఆ సీట్ పైన ఒక గడ్డం వ్యక్తి మరొక యువకుడు కూర్చుని గోల్ గప్పాలు తిని లేచి వెళ్లిపోయారని చెప్పారు. కాస్సేపటికే ఆ కుర్చీకింద బాంబు పేలింది. ఈ సాక్షి తాను అంతకుముందు కూర్చున్న సీట్ పైన నిందితుడు అమీర్ కూర్చున్నాడని గుర్తించినట్టు చెప్పింది. ఆమెతోపాటు గాయపడిన మరొక వ్యక్తి మాత్రం అంతకు ముందు ఆ సీట్ మీద కూర్చున్నవారిలో అమీర్ ఉన్నాడని గుర్తించ లేదు. ఈ ఇద్దరు సాకక్షులు తప్ప నిందితుడికి వ్యతిరేకంగా మరొక సాక్ష్యం లేదు. ప్రేలడానికి ముందు, సుష్మా నరూలా కూర్చున్న కుర్చీలోనే అతడు కూర్చున్నాడని రూఢిగా రుజువు లేకపోయినా, అక్కడ కూర్చున్నాడని నమ్మినప్పడికీ అతనే బాంబు పెట్టాడనడానికి ఏ సాక్ష్యమూ లేదు. అనుమానం ఎంత గట్టిగా ఉన్నా వాస్తవమని చెప్పడానికి రుజువులు అవసరం. బలీయమైన అనుమానం కాదు. 26 అక్టోబర్ 1997 సంఘటన జరిగితే 27 ఫిబ్రవరి 1998న కేసు నమోదు చేయడం కీలకమైన అంశం. అమీర్‌తోపాటు షకీల్ కూడా నిందితుడని పేర్కొన్నారు. కాని షకీల్ మీద చార్జ్ షీట్ కొట్టి వేసారు. అమీర్ అక్కడ ఉన్నాడని నమ్మినా, అదొక్కటే బాంబు అతనే పేల్చాడనడానికి సరిపోదు. చెత్త వృధా సామగ్రి అమ్మే ముఖేష్ నయ్యర్ దగ్గర బాంబు తయారుచేయడానికి కావలసిన సామగ్రిని అమీర్ కొనుక్కున్నాడని తరువాత బాంబు తయారు చేసి రెస్టారెంట్‌లో పెట్టాడని నయ్యర్ సాక్ష్యం చెప్పాడు. కాని అతను ఈ చెత్తడీలర్ దగ్గర పదార్థాలు కొన్నట్టు గానీ బాంబు తయారు చేసి పెట్టినట్టుగానీ ఎక్కడా ఆధారాలు దొరకలేదు. చెత్తడీలర్ దగ్గరనుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పుకున్న ఇనుప ముక్కలను కూడా ప్రాసిక్యూషన్ వారు కోర్టుకు చూపలేకపోయారు. గాయపడిన వారెవరూ అమీర్ బాంబు పెడుతుండగా చూసినట్టు చెప్పలేదు. గోల్ గప్పాలు తినడానికి కొంత సమయం పడుతుంది. కాని ఆ సమయంలో నిందితుడు గోల్ గప్పాలు తిన్నట్టు కూడా సాక్ష్యం చెప్పలేదు, ఇక బాంబులు చేతులు మారాయని ఎవరు చెబుతారు? గట్టి సాక్ష్యాల మాట దేవుడెరుగు. కనీసం కొద్ది సేపయినా నిలబడ గల సాక్ష్యం కూడా లేదు.
Also read: అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం నిష్ఫలం
కాని ట్రయల్ కోర్టు జడ్జి గారు అమీర్ సీటుకింద బాంబు పెట్టినట్టు ప్రాసిక్యూషన్ రుజువు చేసిందని తీర్పు చెప్పారు. వికాస్, సుష్మా నరూల చెప్పిన- సాక్ష్యాలను కోర్టు నిష్కారణంగా నమ్మింది. అమీర్ నేరస్తుడని నిర్ధారించింది, శిక్ష విధించింది. ”కిందికోర్టును అంతగా నమ్మించిన సాక్ష్యం ఏమిటో చాలా జాగ్రత్తగా పరిశీలించాం. కాని అతనే బాంబు పెట్టాడనడానికి మాకు ఏ సాక్ష్యమూ కనిపించలేదు. తల్లీ కూతుళ్ల ఛీఫ్ ఎగ్జామినేషన్ వాంగ్మూలాల్లో కూడా పరస్పరవైరుధ్యం ఉంది. కూతురు ఆ టేబుల్ దగ్గర ఇద్దరు యువకులు కూచున్నారంటే, తల్లి నలుగురైదుగురు ఉన్నారని అన్నారు. మరొక సాక్షి అక్కడున్నవారిలో నిందితుడు ఉన్నట్టు చెప్పలేదు. ఒకవేళ ఆటేబుల్ దగ్గర ఇద్దరో అంతకన్న ఎక్కువ మందో కూర్చుని వెళ్లిపోయినారనుకున్నా, ఆతరువాత గాయపడిన వారు కూచున్నప్పుడు బాంబు పేలిందనుకున్నా, ఆ బాంబు నిందితుడే పెట్టినాడనడానికి సాక్ష్యం లేకపోగా, మిగిలిన వారిలో ఎవరో ఒకరు పెట్టి ఉండే ఆస్కారం ఉంది. కనుక నేరం రుజువైందన్న 23 ఏప్రిల్ 2003 నాటి తీర్పు, 8 మే 2003 నాటి శిక్ష విధింపు తీర్పును కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. 17కేసుల్లో నిర్దోషి అని రుజువైనా కాని చేయని నేరానికి అమీర్ 1998 నుంచి 2013 దాకా 14 ఏళ్ల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది.ఇవి ఒక్కకేసు వివరాలు. ఇంకా పద్దెనిమిది కేసుల్లో అతని గతి ఎంత దారుణంగా ఉండిందో ఊహించడం కష్టం.
పోలీసులు దొంగ సాక్షులు, కోర్టులతో పోరాటం
అమీర్ తల్లిదండ్రులది దేశ విభజన బాధిత కుటుంబం. అక్క పాకిస్తానీని పెళ్లాడడం వల్ల ఇంకా ఇబ్బందులకు గురైనారు. ఆ కుటుంబ సభ్యుడిని గూఢచారిగా పని చేయించి పాకిస్తాన్ నుంచి సమాచారం రాబట్టాలని అధికారులు వాడుకోవడం, ఈ పనిలో వారు ప్రమాదాలకు గురైనా పట్టించుకోకపోవడం దారుణం. అయితే ఈ దారుణాలు ఒక్క అమీరే కాదు ఎందరో చవిచూస్తున్నారు. పోలీసులకు ఇది మామూలే. ఒకవేళ చనిపోయినా దిక్కులేదు. రవీందర్ కౌశిక్ అనే యువకుడు 23 సంవత్సరాల వయసునుంచి రా ఏజంట్‌గా పనిచేసి చివరకు పాకిస్తానీలకు చిక్కి అక్కడి జైల్లో చనిపోయాడు. అతనికి కనీసం గుర్తింపు లేదు. హిందీ సినిమా ఏక్ థా టైగర్ ఇతని కథ ఆధారంగానే తీసారు. కాని డైరెక్టర్ కూడా ఒప్పుకోడు.
చట్టాలు ధనికులకు,జైళ్లు పేదలకా?
అరెస్టు ఎందుకు చేసారో, ఎవరు చేసారో, ఎన్నాళ్ల కింద చేసారో, ఎన్నాళ్లు దెబ్బలు కొడతారో, తెలియదు. ఎందుకు అరెస్టు చేసారో చెప్పి, ఎవరు అరెస్టు చేసారో తెలిసేట్టు పేరు పట్టీలు పెట్టుకుని యూనిఫాంలో ఉండాలని, ఎక్కడ బంధించారో చెప్పాలని, 24 గంటలలో కోర్టు లో హాజరు పరచాలన్నవి నిందితుల ప్రాథమిక హక్కులు. నిందితుడిపై ఎఫ్.ఐ.ఆర్.ను విచారించే ముందు, అరెస్టు అయిన తొలి థలోనే తమ ముందు హాజరు పరిచిన వ్యక్తిని కొందరు మెజిస్ట్రేట్‌లు అసలు హింస గురించి అడగరు. చెప్పనివ్వరు, చెప్పినా పట్టించుకోరు. వినరు. చట్టబద్దంగా అరెస్టు చేసారో లేదో పరిశీలించరు. అనుమానం రాదు, వచ్చినా ప్రశ్నించరు. ఇటువంటి హక్కులు మామూలుగా పుస్తకాల్లో మిగిలిపోతాయి. అమీర్ వంటి పేద వారికి దక్కవు. నిజంగా ఈవిధంగా మెజిస్ట్రేట్‌లు ప్రశ్నించగలిగితే అతని మీద పెట్టినట్టు తప్పుడు కేసులు పెట్టే అవకాశమే ఉండదు. అటువంటి సామాన్యులకు చట్టపరమైన రక్షణ కోర్టు ద్వారా లభిస్తుంది. చట్టాలు గట్టిగా ఉన్నా సుప్రీంకోర్టు ఎంతగా చెప్పినా, ఎన్ని తీర్పులు రాసినా అమీర్ వంటి వారికి ఏ హక్కులూ రక్షణలూ అందడం లేదు. గుప్తాజీలు అధికారంలో ఉండి నేరాలు చేస్తూ ఉంటారు. ఎవరూ పట్టుకునే అవకాశమే లేదు. అతన్ని ఎనిమిది రోజులు పోలీసులు తమ కస్టడీలో ఉంచుకున్నారు. కోర్టులో హాజరు పరచలేదు, లాయర్‌ను రానివ్వలేదు, డాక్టర్లు కూడా గాయాలు పరీక్షించరు. అమీర్‌ను ఎవరు ఎప్పుడు అరెస్టు చేసారో రికార్డు ఉండదు. 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచరు. అసలు కోర్టుకు తీసుకు వెళ్లరు, హింస ఎక్కువై చనిపోతే, కనీసం రికార్డు కూడా ఉండదు. ఎన్నో తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకుంటారు. ఆ కాగితాలను దొంగ సాక్ష్యాలు సృష్టించడానికి వాడుకుంటారు. కొన్ని సందర్భాలలో ప్రాథమికంగా కేసు లేకపోయినా పోలీసులకు 19 రోజుల పాటు కస్టడీ ఇస్తారు మెజిస్ట్రేట్‌లు. అమీర్‌ను రెండు నెలల పాటు కస్టడీలో ఉంచుకున్న పోలీసులు 19 బాంబు పేలుడు కేసులలో తప్పుడుగా ఇరికించారు. దుకాణాల నుంచి రసాయనాలు తెచ్చి బాంబులు తయారు చేసినట్టు రాయించుకుంటారు. డైరీలు, ఇతర పత్రాలకు అనుకూలంగా అతడు సంతకం చేసిన తెల్ల కాగితాలను వాడుకుంటారు. ప్రతి సందర్భం ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నేరం. కాని ఎవరూ ఫిర్యాదు తీసుకోరు, విచారణ జరపరు. కోర్టులు కూడా అడగవు.
Also read: నదులను కాజేయడం రాజ్యాంగబద్ధమా?
ఇరవైచోట్ల బాంబులు పెట్టారని తప్పుడు కేసులు పెట్టారు. చేతులకు బేడీలతో తండ్రి కడసారి చూపులు చూడడానికి అనుమతించారు అధికారులు. తండ్రి ఎంత బాధ పడి ఉంటాడు కొడుకును తప్పుడు కేసుల్లో ఇరికించడం గురించి విని, బేడీలతో అతన్ని చూసి? ఎవరికీ అవసరం లేదు. ఎన్నేళ్లు పడుతుందో నేను బయటకు రావడానికి అని అమీర్ జులై 2001లో రాసుకున్నాడు.
పాకిస్తాన్ తన అక్కను కలవడానికి వెళ్లినపుడు అనుభవాలు వివరిస్తూ, తనకు హోటల్‌లో రహస్యంగా అందించిన కొన్ని పత్రాలున్న పచ్చ లెదర్ బాగ్‌ను భయంభయంగా దాచుకున్న సంగతి చెప్పాడు. కాని వాఘా సరిహద్దులో చాలా పకడ్బందీగా లగేజ్ తెరిపించి మొత్తం గాలిస్తున్న పోలీసులను చూసి భయపడిపోయాడు. అక్కడే టాయిలెట్‌కు వెళ్లి దాని కప్పుపైకి పచ్చబ్యాగ్ విసిరేసి రాకపోయి ఉంటే పాకిస్తాన్ జైల్లో మగ్గుతూ ఉండేవాడే. ముందుగా ఇది పోలీసుల దుర్మార్గం, తరువాత ముస్లిం యువకుడు కనుక నేరస్తుడే అని నిందించే సమాజం, రాజకీయం దుర్మార్గమైనది. అదే సమయంలో జైల్లో, కోర్టుల్లో, లాయర్లలో హిందువులు, సిక్కులు ఇతర మతాల వారుకూడా మతం ప్రసక్తి లేకుండా అమీర్‌కు సాయం చేసారు. రాజకీయంలో మతం పేరుతో చీల్చి పారేసే స్వార్థం, పోలీసులలొ అవినీతి, కోర్టుల్లో ఆలస్యాలు నిర్లక్ష్యాలు, బాధ్యతా విస్మరణలు జరుగుతున్నా, ఇంకా జనం కలిసి ఉన్నారనే ఆశాభావం ఎన్నాళ్లుంటుంది, తన మూడేళ్ల కూతురు ఎదిగేనాటికి దేశం బాగుపడుతుందా అని అమీర్ భయపడుతున్నాడు.
Also read: నదుల నిర్వాహక మండళ్ళ నిర్వాకం
కసాయి ఖాకీ నేరాలు
తనకు గుప్తాజీ అనే వ్యక్తి ఇచ్చిన పని కెమెరాతో కొన్ని ఫోటోలు తీయడం, ఎవరో వ్యక్తి ఇచ్చే పత్రాలు జాగ్రత్తగా తీసుకు వచ్చి ఆయనకు అప్పగించడం. కాని ఫోటోలు తీయాలంటే కెమెరా బయటకు తీయాలి. తనను అందరూ గమనిస్తున్నారు. కెమెరా సంచిలోంచి తీయడం కూడా సాధ్యం కాలేదు. ఇక పచ్చ సంచీ పారేయాల్సి వచ్చింది. వెళ్లేముందు గుప్తాజీ ఒక కెమెరా, పేజర్ ( సందేశం ఇచ్చే పరికరం. సెల్ ఫోన్ రాకముందు ఉండేది) అయిదు వేల రూపాయలు కూడా ఇచ్చాడు. కాని అమీర్ ఈ గుప్తా ఎవరు, అతని అసలు పేరు అదేనా వంటి ప్రశ్నలేవీ అడగలేదు. ఇండియా తిరిగి వచ్చిన తరువాత గుప్తాజీని కలిసాడు. తాను చెప్పిన పని చేయలేకపోయానని చెప్పాడు. కెమెరా తిరిగి ఇచ్చాడు. కాని ఆయన పత్రాలగురించి పట్టుబట్టాడు. కప్పుమీద విసిరేసిన కాగితాలను ఎక్కడనుంచి తేగలడు. అదంతా నాకనవసరం ఆ కాగితాలు ఇవ్వు. అన్నాడు. తనను పాకిస్తానీ ఏజంట్ అని నిందించాడు. ఎన్ని చెప్పినా నమ్మలేదు. నీజీవితం నాశనం చేస్తానని బెదిరించాడు. 20 ఫిబ్రవరి 1998నాడు నమాజ్ చేసి మెడికల్ షాప్ కు వెళ్తున్న తనని జిప్సీ కారులోకి ఎక్కించుకున్నారు. అమీర్ వలెనే తప్పుడుకేసులకు గురై ఒంటరి జైల్లో తోయబడిన షకీల్ నిరాశా నిస్పృహలకు లోనై కుంగిపోయి సీలింగ్ ఫాన్‌కు చెద్దరు తో ఉరివేసుకుని చనిపోయాడు. ఎదిగిన ఆడపిల్లలు, ఏ ఆదాయ వనరూ లేని భార్య, తనకు ఎప్పుడు విముక్తి వస్తుందో తెలియని జైలు జీవితం, కేసు విచారణనైనా మొదలు పెట్టని మెజిస్ట్రేట్‌లు అతని చావుకు కారణం.
Also read: విభజన రాజ్యాంగపరమైన అవసరం
అమీర్‌ను పోలీసులు పెట్టిన చిత్రహింస మాటల్లోచెప్పలేము. అతను ఎంతో ధైర్యంగా రాసుకున్న ఆత్మకథా కథనం ఈ పుస్తకం. గాంధీ నెహ్రూల ఆత్మకథలు బాగానే చదివాం. ఇప్పుడు అమీర్ వంటి అభాగ్యుల ఆత్మకథ చదవడం పౌరుల బాధ్యత. ఈ దేశంలో ఉన్న మెజిస్ట్రేట్‌లు హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు, ప్రభుత్వ డాక్టర్లు, పోలీసులు, జైలు అధికారులు, మామూలు ప్రజలు కూడా చదివి తీరవలసిన పుస్తకం. రాజకీయ పార్టీలకు వత్తాసు పలికే భజనపరులు కూడా చదవాలి. లా పాఠాలు చెప్పే నావంటి ఉపాధ్యాయులు కూడా చదవాలి. మేం తరగతి గదిలో వెలగబెడుతున్న న్యాయసూత్రాలకు లాకప్‌లో పోలీసులు, కోర్టుల్లో కొందరు మెజిస్ట్రేట్‌లు ఈ విధంగా తిలోదకాలు ఇచ్చి న్యాయానికి ఎట్లా తద్దినాలు పెడుతున్నారో తెలుస్తుంది.
నేరం రుజువైతేనే శిక్ష పడుతుంది. కాని పధ్నాలుగేళ్లు జైల్లో మగ్గిన తరువాత కోర్టులు నిర్దోషిగా విడుదల చేస్తాయి, లేదా నిర్దోషులకు విచారణ కాలపు శిక్ష తోపాటు తప్పుడు తీర్పుల పర్యవసాన శిక్షలు కూడా పడతాయి. దీనికి కారణం దర్యాప్తులో కావాలని ఆలస్యం చేయడం, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు లేని వారికి బెయిల్ దొరికే వాతావరణం లేకపోవడం, ఏండ్లు గడిచినా కేసులు త్వరగా విచారించే లక్షణం లేని కోర్టులు, విచారణనే శిక్షగా మార్చేసాయి. నేరం చేసినా శిక్ష పడదని గ్యారంటీ ఉన్న పోలీసులు ఈ పరిస్థితులను ఆసరాగా తీసుకుని నేరగాళ్లుగా మారుతున్నారు.
Also read: జలవివాదానికి ఉత్తమ పరిష్కారమార్గం సూచించిన ప్రధాన న్యాయమూర్తి
చివరకు అన్యాయపు కేసులు కొట్టి వేసింది మెజిస్ట్రేట్ లే, హైకోర్టు జడ్జిలే. వారిని అభినందించాల్సిందే. అయితే అమీర్ కోల్పోయిన జీవితాన్ని, 14 ఏళ్ల స్వేచ్ఛకు పరిహారం ఏమిటి? తప్పుడు కేసుల్లో ఇరికించిన గుప్తాజీ అనే నిఘా అధికారికి, అతనికి సాయం చేసి తప్పుడు కేసులు పెట్టిన పోలీసులకు, అతన్ని చిత్రహింసలు పెట్టిన రాక్షస పోలీసులను శిక్షించలేని వ్యవస్థ మారనంత వరకు అన్యాయమే. ఎప్పడికప్పుడు స్టాన్ స్వామి గురించి దేశంలో చర్చ జరుగుతూనే ఉన్నా, వేయికళ్లతో మీడియా చూస్తూనే ఉన్నా, కోర్టులు సుదీర్ఘంగా వింటున్నా బెయిల్ కేసులు విచారణ ముగియకముందే, ఎన్ ఐ ఎ దర్యాప్తు ముగియకముందే వ్యవస్థ చేతిలో దారుణంగా హతుడైపోయినాడు స్టాన్ స్వామి. అమీర్ జీవితాన్ని నాశనం చేసి తండ్రి చావుకు కారణమై తల్లిని నరకయాతన పెట్టి, షకీల్ ఉరికి కారకులైన వారిని ఎవరు బోనులో నిలబెడతారు?
డిల్లీ నగరంలో పోలీసు, న్యాయవ్యవస్థ ఎంతో దారుణంగా ఉందని సాక్ష్యాలతో రుజువు చేసే పుస్తకం Framed as a Terrorist ఫ్రేమ్డ్ యాస్ ఎ టెర్రరిస్ట్ అనే పేరుతో మహ్మద్ అమీర్ఖాన్(నందితా హక్సర్‌తో కలిసి) రాసిన పుస్తకం చదవక తప్పదు.
Also read: విశాఖ ఉక్కుపై నాయకుల తుప్పు రాజకీయాలు
మాడభూషి శ్రీధర్
Framed as a Terrorist…, My 14 Year Stuggle to Prove My Innocenceʹ ఇంగ్లీషు పుస్తకానికి ‘తీవ్రవాది’ముద్రʹ…..నిర్దోషిత్వ నిరూపణకుపధ్నాలుగేళ్ళ పోరాటం పేరుతో కె ఉషారాణి తెలుగు అనువాద౦ ప్రచురణ:మలుపు బుక్స్, దొరికే చోటు, తెలంగాణలో నవతెలంగాణ అన్నిశాఖల్లో, నవ చేతన, నవోదయ బుక్ హౌజ్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ : విశాలాంధ్ర అన్నిశాఖలలో, ప్రజా శక్తి అన్ని శాఖలలో, ʹఅనేకʹ విజయవాడ |