నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణా
ఖండల శస్త్ర తుల్యము, జగన్నుత! విప్రుల యందు, నిక్కమీ
రెండును రాజులందు విపరీతము గావున, విప్రుడోపు, నో
పండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్!
-నన్నయ భట్టారకుడు
ఉదంక మహర్షి పైల మహర్షి శిష్యుడు. పైలుడు వ్యాసమహర్షి శిష్యుడు. పైలమహర్షి పత్ని తన భర్తను ఒక కోరిక కోరుతుంది: పౌష్య మహారాజు దేవేరికి చెందిన కర్ణాభరణాలు తనకు కావాలని. పౌష్యమహాదేవి అభరణాలు తీసుకొని వచ్చి తన పత్ని కోరిక నెరవేర్చమని పైలమహర్షి ఉదంకుణ్ణి ఆదేశిస్తాడు.
Also read: మహాభారతంలో శునకాల ప్రసక్తి
ఉదంకుడు గురువు ఆదేశం మేరకు పౌష్య మహదేవి కర్ణాభరణాలు తీసుకొని రావడానికై అరణ్యమార్గాన వెళుతుంటాడు. త్రోవలో పెద్ద వృషభరాజంపై ప్రయాణిస్తున్న ఒక దేవతాపురుషుడు తారసిల్లుతాడు. ఆ దేవతాపురుషుని ఆజ్ఞతో అతడేర్పరచిన ఎద్దు పేడను తిని, ఆయన అనుగ్రహాన్ని పొంది, శీఘ్రగమనంతో పౌష్య మహారాజు వద్దకు వెళ్ళి, తాను వచ్చిన పనిని విన్నవిస్తాడు. పౌష్య మహారాజు ఆ విన్నపానికి ఆనందంగా అంగీకారం తెలిపి, ఉదంకుణ్ణి పౌష్య మహారాణి వద్దకు పంపుతాడు. ఉదంకుడు పౌష్య మహాదేవి అంతఃపురానికి వెళతాడు గానీ ఆమె అతని కంటికి కనిపించదు. అదే విషయాన్ని ఉదంకుడు రాజు వద్దకు వచ్చి చెబుతాడు. పౌష్యదేవి మహాపతివ్రత అనీ, పవిత్రురాలనీ, అపవిత్రుల కంటికి కనపడదనీ రాజు సమాధానం చెబుతాడు.
ఎద్దుపేడను తిన్న తర్వాత తాను ఆచమనం చేసి పరిశుభ్రం కాలేదని ఉదంకుడు పొరబాటు గ్రహిస్తాడు. ఆచమనం ఆచరించి మరొక్కమారు అంతఃపురానికి వెళతాడు. ఈ సారి ఆమె దృగ్గోచరమౌతుంది. పౌష్యరాణి సంతోషంతో ఉదంకుని ప్రార్థన మేరకు తన కర్ణాభరణాలు అతనికి అందజేసి ఇట్లా అంటుంది: “ఉదంక మహామునీ! ఈ ఆభరణాల కోసం తక్షకుడనే సర్పరాజు తహతహ లాడుతున్నాడు అతడు మాయావి, అభేద్యుడు. తిరిగి వెళ్ళే దారిలో అప్రమత్తంగా ఉండండి. లేకుంటే, తక్షకుడు తన మాయోపాయంతో వీటిని మీ నుండి దొంగిలించగలడు.”
పౌష్య మహారాజు అభ్యర్థనపై, ఆయన గృహంలో ఉదంకుడు భోజనానికి కూర్చుంటాడు. భోజనంలో ఒక చిన్న వెంట్రుక కనబడుతుంది. దానితో ఉదంకుడు విపరీతమైన కోపంతో “సరిగ్గా పరీక్షించక కేశదుష్టమైన అన్నం నాకు వడ్డించినావు. నీవు గ్రుడ్డివాడవు ఐపోదువు గాక” అని శాపం పెడతాడు. దానితో పౌష్య మహారాజు కూడా ఉదంక మునిని “నీవు సంతాన హీనుడవు అవుదువు గాక!” అని ఎదురు శాపమిస్తాడు. ఉదంకుడు ఆ శాపాన్ని ఉపసంహరించుకోమని పౌష్యుణ్ణి వేనోళ్ళ ప్రాధేయపడతాడు. దానికి పౌష్యుడు నిరాకరిస్తాడు. ఆ సందర్భంగా పౌష్య మహారాజు ఉదంకునికి చెప్పిన సమాధానమే పై పద్యం.
Also read: మహాభారత శోభ
పై పద్యం యొక్క భావమిది: “జగన్నుతుడవైన మహామునీ! బ్రాహ్మణులది నిండు మనస్సు. నవ్య నవనీతంతో సమానమైనది. వారి పలుకు మాత్రం దేవేంద్రుని వజ్రాయధం వలె కఠినమైనది. ఇందుకు విరుద్ధంగా క్షత్రియుల మనస్సు వజ్రాయధం వలె కఠినమైనది. వారి మాట మాత్రం వెన్నవలె మృదువైనది. ఈ కారణం చేత బ్రాహ్మణుడు తన శాపాన్ని పరిహరించుకోగలడు. క్షత్రియుడు ఉపసంహరించుకోలేడు”.
ఇట్లా సమాధానమిచ్చిన పిమ్మట పౌష్యమహారాజు: “శాపాన్ని ఉపసంహరించుకోమని ఉదంకుణ్ణి వేడుకుంటాడు. దానితో మనస్సు ద్రవించిన ఉదంకుడు: “నీకు త్వరలోనే శాపవిమోచనం కలుగుతుందని” ఆశీర్వదిస్తాడు.
ఈ శాపాలు ఉభయులు ఎందుకిచ్చుకున్నారు? సరిగ్గా కళ్ళతో పరీక్ష చేయకుండా అన్నం పెట్టినందుకు “నీవు గుడ్డివాడవు” కమ్మని ఉదంకుని శాపం. పౌష్య మహాదేవి కర్ణాభరణాలు ఉదంకుడు గురుదక్షిణ ఇవ్వడం కోసం. గురుదక్షిణ ఇవ్వడంచే సత్సంతానం కలుగుతుందని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. కనుక, సంతానహీనత అనే శాపంచే గురుదక్షిణ ఇచ్చిన ఫలం నెరవేరదు. ఇదే పౌష్యుడిచ్చిన శాపానికి హేతువు.
Also read: గంగిరెద్దు
ఇంతకన్న లోతుకు పోతే యీ శాపాలకు మరిన్ని కారణాలు గోచరిస్తాయి. ఆత్మసంయమనం లేనిది మహాముని పదవికి అనర్హుడు. ఉదంకుడు శాపం పెట్టడానికి ఎన్నుకున్న కారణం పసలేనిది. ఒక వెంట్రుక అన్నంలో పడడం చిన్న పొరపాటు. అది తెలిసి చేసింది కాదు. తనను మిక్కిలి అభిమానంతో ఆదరించి, నిజవాంఛను నెరవేర్చిన పౌష్య మహారాజును ఉదంకుడీ చిన్న పొరపాటు నెపంతో శిక్షించడం అన్యాయం. అట్లా శపించడం ఉదంకుని ఆత్మసంయమన శూన్యతను సూచిస్తుంది. నిజానికి పవిత్రమైన మునియై, ఆచమనం చేయకుండానే, అత్యంత పవిత్రురాలైన పౌష్య మహాదేవిని ఉదంకుడు చూడడానికి పోవడమే అపరాధం. దీన్ని దంపతులిద్దరు పెద్దమనస్సుతో పట్టించుకోలేదు.
Also read: మహాభారతం అవతారిక
పౌష్యమహారాజు సంతానహీనుడు కమ్మని ఉదంకుణ్ణి శపించడం వెనక ఒక గూఢార్థం ఉన్నది. జనమేజయుని కాలానికి కలియుగం ప్రవేశించింది. ధర్మాలు గాడి తప్పుతున్నాయి. ఉదంకునిలో మహామునికి ఉండవలసిన శుచి, ఆత్మ సంయమనం లోపించినవి. ఇతని సంతానం ఇట్టి గుణాలనే వారసత్వంగా పొంది భావి సమాజానికి శిరోభారం కావచ్చు. అందుచేతనే అనపత్యుడు కావలసిందని ఉదంకునికి శాపం.
పౌష్యుని పొరబాటు ఎన్నదగినది కాదు. అందుకే అతనికి శాపవిమోచనం లభించింది. ఉదంకుని పొరపాటు ఎన్నదగినది. అందుకే అతనికి శాప విమోచనం కలుగలేదు.
Also read: ఎవరి కోసం?
మనస్సు నవనీత సమానమైనప్నుడు, తిరుగులేని వజ్రాయుధాన్ని అట్టి మనస్సుతో ప్రయోగించడం అసంభవం. అందుకే ఎంత వేగంతో ఉదంకుని శాపం ఇవ్వబడిందో, అంతే వేగంతో అది పరిహరింపబడింది కూడా. పౌష్యుడు మహారాజు. రాజ్యపాలకుడు తన పౌరులను శిక్షిస్తాడు. సంతాన హీనుడవు కమ్మని ఉదంకుణ్ణి శపించడం ఒక శిక్ష. ఈ శిక్ష భావి తరాల అభ్యున్నతి కోసం. ముద్దాయిలకు శిక్ష వేయడం రాజధర్మం. ఆ శిక్ష ఎంతో ఆలోచించి వేస్తాడు ప్రభువు. వేసిన శిక్షను సరియైన కారణం లేకుండా ఉపసంహరించిన రాజు రాజ్యధర్మం తప్పిన వాడవుతాడు.
భారతం స్వర్గారోహణ పర్వంలో జ్ఞానియైన ధర్మరాజు తనతో సమానంగా ఒక కుక్కను భావిస్తాడు. అది లేకుండా స్వర్గధామం లోనికి పోవడానికి నిరాకరిస్తాడు. సరమ వృత్తాంతంలో జనమేజయుని కాలం వచ్చేసరికి, అదే శునకజాతిని జనమేజయుని సోదరులు అకారణంగా హింసిస్తారు. సరమ వృత్తాంతము, ఉదంకుని వృత్తాంతము, సామాజిక క్షీణ దశను తెలుపుతాయి.
నేటి పద్యం నన్నయ “నానా రుచిరార్థ సూక్తి నిధి” అనడానికొక నిదర్శనం. ఈ పద్యం ఒకవంక సమాజానికి అవసరమైన సుభాషితాలను (సూక్తులు), మరొక వంక లోనారసి చూస్తే గోచరించే నానారుచిరార్థాలను స్ఫురింపజేస్తుంది. తెలుగు వారి నాలుకలపై కలకాలం జీవించే పద్యమిది.
ఈ పద్యం సంస్కృత మూలానికి విధేయమైనది. అదే సమయంలో మూలం కన్న మనోహరమైనది. మూలంలో ఇట్లా వున్నది:
యథానవనీతం హృదయం బ్రాహ్మణస్య
వాచిక్షురో నిశిత తీక్ష్ణధారః
తదుభయమేత ద్విపరీతం క్షత్రియస్య
తదేవంగతేన శక్తోహం తీక్ష్ణహృదయ
త్వాత్తం శాతమన్యథా కర్తుం గమ్యతాం”
మూలంలో “క్షుర” అనే ప్రయోగాన్ని పరిహరించి “దారుణాఖండల శస్త్ర తుల్యము” అనే సమాసాన్ని ప్రయోగించడం లోనే ఆదికవి ప్రతిభ విశదమౌతున్నది. ప్రథమకోపం విప్రులకు ఎంత సహజమైనదో ఈ ప్రయోగం తెలుపుతుంది. అదే సమయంలో రాజు విప్రుల తొందరబాటు తనాన్ని ఎగతాళి చేయడం కూడా ఇందులో స్ఫురిస్తుంది.
నిండు మనంబు అనే పదప్రయోగంలో ఒక దేశీయాన్ని, ఒక తత్సమ శబ్దాన్ని, సంగమింప జేస్తున్నాడు ఆదికవి. ఈ ఒరవడి నన్నయ నుండే మొదలైనదని విశ్వనాథవారు అంటారు. కచదేవయాని ఘట్టంలోనూ ఇటువంటి ప్రయోగం కనబడుతుంది: “వాడి మయూఖముల్ కలుగు వాడపరాంబుధి గ్రుంకె”.
సరళమైన ఈ పద్యంలోని శబ్దగుణం మనలను రంజింపజేస్తుంది. “నిండు మనంబు” అనే పదప్రయోగంలోనే మూడు “న” లు కనబడతాయి (నిన్డు). ఇట్లా “న” అనే అక్షరం యీ పద్యంలో పునః పునః ప్రయోగింపబడింది. ముఖ్యంగా మొదటి పాదంలో. అందమైన “న” కార వృత్యనుప్రాస మొత్తం పద్యానికే వింత శోభను సంతరించింది.
Also read: మహాభారతం అవతారిక
నివర్తి మోహన్ కుమార్