వోలేటి దివాకర్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళా సాధికారిక సదస్సు ఘనంగా,ఉత్సాహంగా జరిగింది. గాయనీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సోదరి శైలజ సహా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి బ్రాహ్మణ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖులను ఆహ్వానించక పోవడం కొంత చర్చకు దారి తీసింది. ఈ సదస్సులో పలు తీర్మానాలు ఆమోదించారు.
రాబోయే ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీలు బ్రాహ్మణులకు చట్టసభలలో అవకాశం కల్పించాలని, తిరుపతి, గుంటూరు పశ్చిమ, విజయవాడ సెంట్రల్, కాకినాడ, విశాఖపట్నం దక్షిణ అసెంబ్లీ టిక్కెట్ల ను కేటాయించాలని డిమాండ్ చేసింది. మున్సిపల్ కార్పోరేషన్ లో రాజకీయ నిరాదరణకు గురైన బ్రాహ్మ సామాజిక వర్గానికి కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించేలా చట్ట సవరణకు డిమాండ్ చేసింది.
స్వాతంత్య్ర ఉద్యమంలో ధన, ప్రాణాలను పణంగా పెట్టిన బ్రాహ్మణ జాతి నాటి నుండి నేటి వరకు కూడా అగ్రవర్ణ జాబితాలో మొదటి వరుసలో ఉన్నా బ్రాహ్మణ జాతి ఆర్ధిక సామాజిక అంశంలో అణగారిపోయిన సంధర్బంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్రాహ్మణు లను మైనార్టీ వర్గంగా గుర్తించి, సామాజికంగా, రాజకీయంగా, విద్య, వైద్య ఉపాధి రంగాలలో అభివృద్ధి చెందడం కోసం ఈ.డబ్ల్యు.ఎస్ 10శాతం రిజర్వేషన్లలో బ్రాహ్మణ వర్గానికి 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానించింది.
కరోనా మహమ్మారి కారణంగా ఇంటి యజమానిని కోల్పోయిన పిల్లలు చదువులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలనీ, బ్రాహ్మణ మహిళలు ఆర్ధికంగా వారు స్వశక్తితో స్వయంగా ఎదగటానికి బ్రాహ్మణ కార్పోరేషన్ అధిక మొత్తంలో మహిళలకు చేయుత అందించాలని డిమాండ్ చేసింది.
ఎన్నో ఏళ్ళుగా దేవాదాయ శాఖలో వేదపారాయణ దారులుగా అతి తక్కువ జీతంతో, సంభావన పనిచేస్తున్న వేల మంది జీవితాలను దృష్టిలో ఉంచుకొని, వారికి తక్షణమే జీతం పెంచాలని డిమాండ్ చేసింది. సొంత గృహం లేని అర్హులైన నిరుపేద బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉచితంగా నివాస స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ మార్కెటింగ్ లో బ్రాహ్మణులు తయారు చేసే ఉత్పత్తులను ఎగుమతి చేసే విధంగా బ్రాహ్మణులకు అధిక అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలని డిమాండ్ చేస్తున్నాము.
బ్రాహ్మణులు ఐక్యంగా ముందుకు సాగాలి..
రాజకీయాలకు అతీతంగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఐక్యంగా ముందుకు సాగినప్పుడే ప్రాధాన్యత లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ మహిళా సదస్సులో వక్తలు పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు బ్రాహ్మణుల ఓట్లు ముఖ్యమేనని, తమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఎక్కడ పోటీచేసినా అందరూ ఐక్యంగా గెలిపించడానికి కృషిచేయాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు. బ్రాహ్మణ జాతి ఐక్యంగా ముందుకు నడిస్తే రాజకీయంగా, సామాజికంగా రావాల్సిన వాటా ఖచ్చితంగా వచ్చి తీరుతుందన్నారు.
ఈ సదస్సుకు తెలంగాణా శాసనమండలి సభ్యురాలు, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు కుమార్తె వాణిదేవి, ప్రముఖ గాయని ఎస్.పి.శైలజ, శ్రీ శక్తి పీఠాదీశ్వరి మంత్ర మహేశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామిణీ, తెలంగాణా ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర నాయకులు సత్యవాడ దుర్గాప్రసాద్, కోనూరు సతీష్ శర్మ, హెచ్‌కె మనోహర్, శిష్టా మనోహర్, రాష్ట్ర మహిళాధ్యక్షురాలు రెంటచింతల దీప్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ తోలేటి శిరీష, ప్రధాన కార్యదర్శి పప్పు సరోజిని, సుహాసినీ ఆనంద్, తిరునగరి జ్యోత్స్న తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని సూచించారు. బ్రాహ్మణులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నా అన్ని రంగాల్లో తమకు అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారన్నారు.
అనంతరం ముఖ్య అతిథులకు ఘనంగా సత్కారం చేసారు. నేపథ్య గాయని శైలజ ‘అఖిలాండేశ్వరి.. ’పాటను శ్రావ్యంగా అలపించి అలరించారు.