Sunday, December 22, 2024

రామకథ రచించమని వాల్మీకికి విరించి ఉద్బోధ

రామాయణమ్.. 2

ఆ విషయం ఎరుక పరచటానికే తాను వచ్చినాడు ,అదే విషయం వాల్మీకి మునిపుంగవుడడిగినాడు!

వాల్మీకి ముని ప్రశ్న విని ,నీలాకాశంలో పండువెన్నెల పరచుకున్నంత హాయిగా ఒక చిరునవ్వు వెలయించారు నారద మహర్షి!

అవును ! ఆ మహాపురుషుడిగురించి ఆలోచించగనే ఎవరి హృదయం వికసించదు!

(రమయతీ ఇతి రామః రాముడి గురించిన తలపురాగానే హృదయకవాటాలు భేదించుకొని ఆనందం బహిర్గతమవుతుంది)

తాను బ్రహ్మగారి వద్దనుండి తెలుసుకొన్న విషయాన్ని వాల్మీకి మహర్షికి విశదపరుస్తున్నారు విశ్వసంచారి!.

ఓ మహర్షీ నీవు అడిగిన గుణములతో కూడిన ఒకే ఒక మహాపురుషుని గురించి నీకు తెలియచేస్తాను! సావధానచిత్తంతో వినవయ్యా!

ఇక్ష్వాకు వంశ ప్రభవో రామోనామ జనైః శ్రుతః

నియతాత్మా మహవీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ!

ఇక్ష్వాకు వంశ ప్రభువులలో “రాముడు ” అనే పేరుగల మహాపురుషుడున్నాడని జనులంతా విని ఉన్నారు!

ఆయన కాంతిమంతము,శక్తివంతమూ అయిన శరీరం కలిగి అన్ని ఇంద్రియములను తన వశంలో ఉంచుకొన్నవాడు!

ఆయన బుద్ధిమంతుడు, నీతిమంతుడు, సర్వశాస్త్రపాండిత్యము,

మహదైశ్వర్యము గలవాడు!

ఆయన రూపం చూడచక్కనిది మనోహరమయినటువంటిది.

 ఏ శరీర భాగం ఎంత ఉండాలో అంత కొలిచి నట్లుగా సృష్టించాడు బ్రహ్మ!

ఉన్నతమైన మూపులు (వాటి ఎముకలు బయటకు కనపడవు)ఎంత పెద్ద విల్లునయినా మోయగల మూపులవి!

బాగా బలిసి మోకాళ్ళవరకు వ్రేలాడే బాహువులు,శంఖం వంటి కంఠము, ఎత్తైన చెక్కిళ్ళు,విశాలము, కఠినము అయిన వక్షస్థలము, సర్వ లక్షణ శోభితమైన శిరస్సు! 

చూడగనే ఆకర్షించి చూపులు కట్టిపడవేయగల మనోహర సుందర రూపము!.

ఆయన అరిందముడు! అంతర్గతశత్రువులను ,బాహ్యశత్రువులను మర్దించినవాడు.

( కామ,క్రోధ,లోభ,మద,మోహ,మాత్సర్యము లు అంతర్గత శత్రువులు).

రక్షితా జీవలోకస్య ధర్మస్యపరిరక్షితా! …సమస్త ప్రాణికోటిని కాపాడుతూ ధర్మాన్ని పరిరక్షించేవాడాయన!.

వేదవేదాంగ రహస్యములు ,ధనుర్వేదము ఆయనకు కరతలామలకము!.

తల్లి కౌసల్య ఆనందాన్ని పెంపొందించేవాడు ,సముద్రమంత గాంభీర్యము కలవాడు హిమాలయాలంత ధైర్యము కలవాడు!.

లోకంలోని నదులన్నీ ఏవిధంగా అయితే సముద్రాన్ని చేరటానికి ఆరాటపడుతూ పరుగులు పెడుతుంటాయో అదే విధంగా లోకంలోనిసమస్తమునిసంఘాలు, జానపదులూ, నాగరికులు, సమస్తప్రాణికోటి  ఆ మనోహర సౌందర్యమూర్తిని కనులారా దర్శించి తరించాలని ఆయన ఉన్న చోటికి ఉరుకులు పరుగుల మీద వెడుతుంటారు!

ఆయనే శ్రీ రాముడు!

రామకధ మొత్తం వాల్మీకి మహర్షికి వివరంగా చెప్పి ఆయన చేత పూజలందుకొని ఆకాశమార్గాన దేవలోకం చేరుకున్నారు నారద మహర్షి .

వాల్మీకి మౌని హృదయం అవధులులేని ఆనందంతో పొంగిపొర్లిపోయింది.

 అవును !!!!!

అతడే ఆనందం! అతడే పరబ్రహ్మము! ఆనందమే పరబ్రహ్మము!

ఆ రామ బ్రహ్మము గూర్చి విన్న ఎవరి మనసు మాత్రము ఆనందంతో నిండిపోదు! ఆనంద స్వరూపుడుగదా ఆయన!

శిష్యులతో కలసి ప్రాతఃసంద్యావందనమాచరించడానికి

తమసానదీ తీరం చేరుకున్నారు మహర్షి వాల్మీకి!

ఆ నదీ తీరం మనోహరంగా ఉన్నది! సమున్నతంగా పెరిగిన ఎన్నో జాతుల ఫలవృక్షాలు ,

వాటి మీద స్థిరనివాసమేర్పరచుకొన్న రకరకాల పక్షిజాతులు అవి చేసే కిలకిలారావాలు కడు రమణీయంగా ఉన్నది ఆ ప్రదేశం!

ప్రకృతికాంత ఎన్నో హొయలు ఒలకబోస్తున్నదక్కడ!

నిర్మలంగా, స్ఫటికమంతస్వచ్ఛమైన నీటిప్రవాహంతో కనులకింపుగా ఉన్నది తమసా నదీ ప్రవాహం!

తమస ఎలా ఉన్నదంటే.

అకర్దమిదం తీర్దం భరద్వాజ నిశామయ

రమణీయం ప్రసన్నామ్బు సన్మనుష్యమనో యధా

ఒక మంచి వాడి మనస్సు స్వచ్ఛంగా నిర్మలంగా ఏ కల్మషమూ లేకుండా ఎలా ఉంటుందో అలాగే ఏ మాత్రమూ బురదలేకుండా నిర్మలమనోహరంగా ఉన్నవట!  తమసాజలాలు!

అత్యంత రమణీయంగా కనపడుతున్న ఆప్రదేశంలో స్నానమాచరించాలని నిశ్చయించుకొన్నారు మహర్షి

అలా రేవులో దిగి చుట్టూ చూస్తున్నారాయన !

ఒక చెట్టుమీద రెండు క్రౌంచపక్షులు ప్రపంచాన్ని మరచి క్రీడిస్తున్నాయి సరససల్లాపాలలో మునిగి తేలుతున్నాయవి !

ఆ సమయంలో ఎక్కడనుండి వచ్చిందో రివ్వున  ఒకబాణం వచ్చివచ్చి మగపక్షి గుండెల్లో సర్రున దిగబడింది .

అంతే!అప్పటిదాకాఉన్న వాటి

ఆనందం క్షణాల్లో మటుమాయమయిపోయింది  మగపక్షి రక్తపుమడుగులో పడి విలవిలా తన్నుకుంటూ ప్రాణం విడిచింది .

మగని శరీరం చుట్టూతిరుగుతూ హృదయ విదారకంగా రోదిస్తున్నది ఆడపక్షి!

ఆ దృశ్యం మహర్షి మనస్సును తీవ్రంగా కలచివేసింది ! చుట్టూ చూశారాయన ఒక బోయవాడు విల్లమ్ములు చేతబూని ఏదోసాధించిన వానిలా విజయగర్వంతో వస్తూ కనపడ్డాడు !

అప్రయత్నంగా మహర్షి నోటి వెంట ఒక శ్లోకం వెలువడ్డది!

మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః

యత్ క్రౌఞ్చమిథునాదేకమ్ అవధీః కామ మోహితమ్

రతిసమయంలోఆనందంగా కూడి ఉన్న పక్షుల జంటను విడదీసి నీవు శాశ్వతమైన అప్రదిష్ట మూటకట్టుకున్నావు!

(అని అర్ధము)

అప్రయత్నంగా తన నోటినుండి వెలువడిన ఆ పదముల కూర్పునకు మహర్షి ఆశ్చర్యచకితులయ్యారు!

ఆ కూర్పును ఒక సారి పరిశీలించారు!

అవి నాలుగు పాదములతో కూర్చబడి వున్నాయి!

వీణపై కూర్చి నృత్యగీతవాద్యాదులతో పాడటానికి ఒక క్రమపద్ధతిలో లయబద్ధంగా కూడా ఉన్నాయి!

ఆ విషాద ఘటన మదిలో కదలాడుతూ ఉండగా భారమైన మనస్సుతో ఆశ్రమం చేరుకున్నారు మహర్షి!

ఆయన అలా వేదనలో ఉండగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయినారు!

బ్రహ్మదేవునకు నమస్కరించి అర్ఘ్యపాద్యాదులొసగి ఒక ఆసనముపై ఆయనను కూర్చుండబెట్టి వినయముగా ఆయన చెంతన మహర్షి నిలుచున్నారు.

ఈ పనులన్నీ చేస్తున్నా కూడా ఆయన మనసులో క్రౌంచపక్షులను బోయవాడుకొట్టిన ఉదంతం, తానుపలికిన పలుకులు మెదులుతూ వున్నాయి.

అన్యమనస్కంగా వున్నారు మహర్షి.

ఆయన అవస్థ గమనించిన విరించి చిరునవ్వు నవ్వుతూ ‘మహర్షీ నీ నోటినుండి వెలువడినది శ్లోకమే! సందేహములేదు!  అది నా ఇచ్ఛవలననే నీ నోటినుండి వెలువడినది!’

ఆ శ్లోకం ఉన్న రీతిలోనే నీవు రామకధను రచియించవయ్యా! ……..

అని చెపుతున్నారు చతుర్ముఖుడు!

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles