వోలేటి దివాకర్
రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎన్నికల బరి సిద్ధమైంది. అధికార వైఎస్సార్‌సిపి అభ్యర్థిగా ఎంపి మార్గాని భరత్ రామ్, తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు మధ్య ద్విముఖ పోటీ హోరాహోరీగా సాగనుంది. యువ నాయకులైన అభ్యర్థులిద్దరి వ్యవహారశైలి ఒక్కటేనని ఆయా పార్టీల కార్యకర్తలు చెబుతున్నారు. ఇద్దరికీ గర్వం, అహం వంటి విశేషణాలు ఉన్నాయని, డబ్బుతోనే ఏదైనా సాధించవచ్చని నమ్మే నాయకులని చెప్పుకుంటున్నారు. ఇద్దరూ మొన్నటి వరకు తండ్రి చాటు బిడ్డలే. ఇద్దరూ ప్రభుత్వ లబ్ధిదారులే. అయితే ఇద్దరికీ యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉందన్న మాట వాస్తవం. ఇద్దరూ ఏరికోరి ఎన్నికల బరిలో నిలిచారు. ఎంపిగా పనిచేసిన భరత్ గెలిస్తే ఒక రికార్డు. టిడిపికి కంచుకోటగా ఉన్న రాజమహేంద్రవరంలో వైఎస్సార్‌సిపికి గెలిచిన చరిత్ర లేదు. మరోవైపు భార్య భవానీ సీటును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాసుపై ఉంది. వాసు అభ్యర్థిత్వం ఖరారు కానంత వరకు భవానీని అభ్యర్థిగా భావిస్తూ అంచనాలన్నీ కాస్త అటుఇటుగా తెలుగుదేశం వైపే మొగ్గు చూపాయి. వాసు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగానే పోటీ హోరాహోరీగా మారిందని చెబుతున్నారు.
Also read: గోరంట్ల తగ్గేదేలే….
వాసు, భరత్‌కు వారి సొంత పార్టీల్లోనూ…బయట వ్యతిరేకతలు ఉన్నాయి. సీనియర్ పమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పొలిట్‌బ్యూరో సభ్యుడైనా రాజమహేంద్రవరం పొలిమేరలోకి అడుగుపెట్టకుండా, నగరంలో జరిగే కార్యక్రమాల్లో వేలుపెట్టకుండా ఆదిరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో నగరంలోని గోరంట్ల వర్గీయులు వాసుకు ఎంత వరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకమే.
మరోవైపు జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌కు రూరల్ సీటు రాకపోవడంతో టిడిపికి జనసైనికులు, కాపు సామాజిక వర్గీయులు టిడిపికి ఎంత వరకు మద్దతు ఇస్తారన్న అంశం కూడా వాసు గెలుపోటములను నిర్దేశించే అంశం కావచ్చు. వాసు తండ్రి, మాజీ ఎమ్మెల్సీ అప్పారావుకు కార్యకర్తల్లో ఉన్న పరపతి, పలుకుబడి, సామాజిక సేవా కార్యక్రమాలు, తల్లి మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన నగరాభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని వాసు భావిస్తున్నారు. భరత్ వ్యవహారశైలి, ఆయనకు ఇంటాబయటా ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని వాసు నమ్ముతున్నారు.
Also read: భారత చరిత్రలో ఈ’దుర్దినానికి’ నేటితో పదేళ్ళు!
ఇక భరత్ ఎంపి హోదాలో ఉన్నా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, కంబాలచెరువు సుందరీకరణ అంటూ నగరాన్ని అందంగా, ఆకర్షణీయంగా అభివృద్ధి చేసేందుకు కృషిచేశారు. ఈ అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని భరత్ భరోసాతో ఉన్నారు. ఈ అంశాలతోనే ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. అయితే వైఎస్సార్‌సిపి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎపిఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం వర్గాలతో సఖ్యత లేకపోవడం గమనార్హం. వారికి నగరంలో అంతోఇంతో కార్యకర్తల బలం ఉంది. వారు ఎంతవరకు పార్టీకి కట్టుబడి పనిచేస్తారన్నది ప్రశ్నార్థకం. ఏది ఏమైనా రాజమహేంద్రవరం సిటీ సీటు కోసం వాసు, భరత్ మధ్య హోరాహోరీ పోరు తప్పదు.
Also read: కాపుల ఆవేదన…కమ్మవారి ఆందోళన!