- గుజరాత్ నుంచి బారత్ పర్యటన మొదలు పెట్టిన బోరిస్ జాన్సన్
- రెండు రోజుల పాటు భారత్ పర్యటన
- మోదీ-జాన్సన్ చర్చలు ద్వైపాక్షిక సంబంధాలకు కీలకం
రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ వచ్చారు. మొదటగా గుజరాత్ లో కాలుమోపారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి, చరఖా తిప్పి, మహాత్మాగాంధీని ఆత్మీయంగా తలచుకున్నారు. మహాత్మాగాంధీ అందించిన ‘అహింసా సిద్ధాంతం’ ఎంత శక్తివంతమో, మన తర్వాత మొదటగా తెలుసుకున్నది బ్రిటిష్ వారే. మనల్ని దోచుకున్నవారిలో వారొకరు.ఇదంతా గతం. గాయాలు ఉన్నప్పటికీ, కాలప్రయాణంలో, కలిసి మెలిసి సాగక తప్పదు. ఆ సూత్రమే మళ్ళీ మనల్ని ఆ దేశంతో కలిపింది.
Also read: సంప్రదాయవైద్యం దేశానికి ఆయువుపట్టు
ప్రయాణం ఆరోగ్యప్రదం
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఆరోగ్యకరమైన ప్రయాణమే సాగుతోంది. అప్పుడప్పుడూ వారి ‘తనాన్ని’ వారు చూపిస్తూనే ఉంటారు. మన ‘రాజనీతి’తో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. నేడు బ్రిటన్ ప్రధాని రాకతో, ద్వైపాక్షిక సంబంధాలను మరోమారు సమీక్షించుకుంటున్నాం. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధాలు మరింత బలోపేతం కావాల్సిఉంది. ఈ రెండు రోజుల సమావేశాలు ఉభయతారకంగా ఫలవంతమవుతాయని ఆకాంక్షిద్దాం.మానవాళికి మార్గనిర్దేశం చేసిన మన మహాత్ముడు రాసిన పుస్తకాల్లో ఇంకా ప్రచురణ కాని ‘గైడ్ టు లండన్ ‘ ను జాన్సన్ కు జ్ఞాపికగా అందించాం. గాంధీ నుంచి సత్యవాక్పరిపాలన, అహింసలను ఆ దేశం అందుకుంటే మంచిదే. పలు అంతర్జాతీయ వేదికలలో ఇరు దేశాలు ఇప్పటికే భాగస్వామ్యులై ఉన్నాయి. రెండు దేశాల అధినాయకుల తాజా కలయికలో పరిశ్రమల్లో పెట్టుబడులు, వైద్య, పరిశోధనా రంగాల్లో జతకట్టి సాగడంపై ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు ఎంత స్థాయిలో కుదిరితే, ద్యైపాక్షిక వాణిజ్యం అంత స్థాయిలో పెరుగుతుంది. ఆ దిశగా ఇరుదేశాల మధ్య చర్చలు ఫలవంతం కావాలి. ఇండో – ఫసిఫిక్ ప్రాంతాల స్థితిగతులను పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంధన, భద్రత, రక్షణ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు సాగనున్నాయి. ఇటీవల కాలంలో బ్రిటన్ వెళ్లే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. మరిన్ని వీసాలను అందించే విధంగా ఆ దేశాన్ని కోరాల్సి ఉంది. ఉక్రెయిన్ -రష్యా మధ్య పోరు క్షణక్షణానికి భీకరరూపం దాలుస్తోంది. మనం తటస్థంగా ఉంటూనే, అవసరమైన సందర్భాల్లో గట్టిగానే నోరుచేసుకుంటున్నాం. అగ్రరాజ్యం, యూరప్ దేశాలు ఏమనుకున్నా, రష్యా వైఖరి ఎలా ఉన్నా, మనం దృఢంగా ఉన్నాం. హుందాగా ప్రవర్తిస్తున్నాం. మానవీయ కోణంలోనే మసలుతున్నాం. రెండు దేశాల అధినేతలు నరేంద్రమోదీ – బోరిస్ జాన్సన్ మధ్య… ఉక్రెయిన్ -రష్యా యుద్ధం – ప్రపంచ దేశాల ప్రవర్తన తప్పకుండా ప్రస్తావనలోకి వస్తుంది.
Also read: కొత్త రాష్ట్రపతిపై ఊహాగానాలు
గౌతమ్ అదానీతో బోరిస్ జాన్సన్ చర్చలు
భారత్ పర్యటనలో ఉన్న బ్రిటన్ అధినేతతో భారతీయ వ్యాపార దిగ్గజం గౌతమ్ ఆదానీ భేటీ కావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. పునరుత్పాదకత, నూతన శక్తి వనరులు మొదలైన విభిన్న రంగాల్లో యూకే సంస్థలతో కలిసి పనిచేసే అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. గ్రీన్ హైడ్రోజన్, రక్షణ, ఏరోస్పేస్ సాంకేతికత మొదలైన వాటిల్లో యూకే కంపెనీలతో కలిసి పనిచేస్తామని గౌతమ్ అదాని ట్విట్టర్ ద్వారా పంచుకోవడం గమనార్హం. వాణిజ్య, వ్యాపార, రక్షణ, భద్రత వంటి అంశాల్లో బ్రిటన్ -భారత్ మధ్య పరస్పర సహకారం కీలకం. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావాలన్నది ఇరు దేశాల ప్రధాన లక్ష్యం.ఒప్పందాలు, వాటి ఆచరణ సజావుగా సాగితే వ్యాపారులు, వినియోగదారులు, శ్రామికులు అందరికీ లబ్ధి చేకూరుతుంది. బోరిస్ కు పదవీగండం ఉందని ఆ మధ్య అంతర్జాతీయ మీడియాలో కథనాలు హల్ చల్ చేశాయి. బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ ఉన్నారని అప్పుడు ప్రచారం జరిగింది.బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా రిషి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రిషి సునక్ ఎవరో కాదు,మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి స్వయనా అల్లుడు. భవిష్యత్ లో బోరిస్ పదవిని కోల్పోతే ఆ స్థానంలో రిషికి అత్యధికుల మద్దతు ఉంటుందనే ప్రచారం ఉంది. ఈ ఊహాగానాలను పక్కన పెడితే, నేటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్- భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య జరిగే చర్చలు ఇరుదేశాల బంధాలను ద్విగుణీకృతం చేయాలని ఆకాంక్షిద్దాం.
Also read: కరోనా మళ్ళీ కాటేస్తుందా?