- రిషీ సునాక్ కు పోటీలో నిలిచే స్థాయి ఉంటుంది
- పోటీలో నిలబడితే కన్సర్వేటివ్ పార్టీ సభ్యుల చేతిలో రెండోసారి పరాజయం అనివార్యం
- లిజ్ ట్రస్ రాజీనామా
తాను ఈ భారం మోయలేనంటూ బ్రిటిష్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధాని అభ్యర్థికోసం నాలుగు మాసాల కిందట ప్రారంభమైన అన్వేషణ మళ్ళో మొదలయింది. ఆరు వారాల కిందట ప్రధానిగా నియమితురాలైన లిజ్ ట్రస్ తనకు వల్లకాదని గద్దె దిగిపోయారు. కొత్త ప్రధానిని ఈ సారి కన్సర్వేటివ్ పార్టీ సంస్థాగత సభ్యులూ, పార్లమెంటు సభ్యులూ ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తన్నాయి. ఇద్దరికంటే ఎక్కువమంది అభ్యర్థులు ఉన్నట్లయితే పార్లమెంటు సభ్యుల ఓటింగ్ లో వెళ్ళిపోతారు. సోమవారంనాడు పార్లమెంటు సభ్యులు ఓటు చేస్తారు. బహుశా రిషీ సునాక్, బోరిస్ జాన్సన్ లు రంగంలో మిగిలుతారు. వారిద్దరిలో ఎవరో ఒకరిని కన్సర్వేటివ్ పార్టీ ప్రాథమిక సభ్యులు వచ్చే శుక్రవారంనాడు, అంటే అక్టోబర్ 28న, ఎన్నుకుంటారు.
పోటీలో ఎవరు ఉంటారో ఇంకా స్పష్టంగా తెలియదు కానీ రెండు పేర్లు మాత్రం నిరవధికంగా వినిపిస్తున్నాయి. ఒకటి భారత సంతతికి చెందిన సునాక్. రెండవది మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్. సునాక్ రాజీనామా కారణంగానే తనపైన ఒత్తిడి విపరీతంగా పెరిగిన కారణంగా జాన్సన్ వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు సునాక్ ను తగ్గమని జాన్సన్ సూచిస్తున్నారు. ఎందకు అంటే, 2025లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో కన్సర్వేటివ్ పార్టీని గెలిపించే ఆకర్షణ శక్తి, వ్యూహరచనా సామర్థ్యం తనకు ఉన్నాయన్నది జాన్సన్ వాదన. ఇప్పటికీ కన్సర్వేటివ్ పార్టీలో జాన్సన్ అభిమానులు గణనీయంగా ఉన్నారు.
రిషీ సునాక్ కు పార్లమెంటులోని కన్సర్వేటివ్ పార్టీ సభ్యులలో అత్యధికుల మద్దతు ఉన్నది. పన్నుల కోత వల్ల దారుణమైన ఫలితాలు ఉంటాయని ట్రస్ ను సునాక్ హెచ్చరించారు. ఆర్థిక మార్కెట్ విశ్వాసం చూరగొన్న సునాక్ ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారన్న విశ్వాసం సాధారణ ప్రజలలో సైతం ఉన్నది. సునాక్ కు ప్రధానమైన అడ్డంకి పూర్వ ప్రధాని బోరిస్ జాన్సన్. తిరిగి ప్రధానమంత్రి కావాలనే గట్టి కోరిక జాన్సన్ కు ఉన్నది. ఇంత త్వరగా అవకాశం వస్తుందని ఆయన ఊహించి ఉండరు.
మన దేశంలో లాగా బ్రిటన్ లో లిఖిత రాజ్యాంగం లేదు. ఒక ప్రధాని అస్వస్థత కారణంగానో, ఉత్సాహం లేకనో, అవమానం వల్లనో, మరే కారణంగానో రాజీనామా చేస్తే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించరు. మరో వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకుంటారు. కనీసం వంద మంది కన్సర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుల మద్దతు ఉన్నవారే రెండో దశకు చేరుకుంటారు. రిషీ సునాక్ కు అంతమంది పార్లమెంటు సభ్యుల మద్దతు ఉంటుంది. పెన్నీ మోర్డాన్ట్ కు కూడా సమస్య ఉండకపోవచ్చు. బోరిస్ జాన్సన్ అంటే ఇష్టపడే వారు ఉన్నారుకానీ వందమంది ఎంపీలు ఉంటారా అన్నది సందేహమే. కానీ ముగ్గురిలో ఇద్దరిని మాత్రమే రంగంలోకి దింపుతారు. ఈ ఇద్దరిలో కనుక బోరిస్ జాన్సన్ ఉండగలిగితే కొత్త ప్రధానిగా ఎన్నిక కావడానికి ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఖరారు నిర్ణయం చేసే పార్టీ సభ్యులలో జాన్సన్ కి మంచి పలుకుబడి ఉంది. ట్రస్ వ్యవహారం చూసిన తర్వాత జాన్సన్ రాజీనామా చేసే విధంగా ఒత్తిడి తేవడం పొరబాటనే భావన కూడా పార్టీ సభ్యులలో పెరిగింది.
పోయినసారి పార్టీ సభ్యులు తనను కాదని లిజ్ ట్రస్ ను ఎన్నుకున్న తర్వాత రిషీ సునాక్ తగ్గి ఉన్నారు. ట్రస్ ఆర్థిక విధానాలు బెడిసి కొట్టినప్పుడు ‘‘నేను అప్పుడే చెప్పాకదా’’ అని అనకుండా మౌనంగా ఉండడం వల్ల ఆయనకు మంచి పేరు వచ్చింది. కానీ ప్రధాని కావాలన్న ఆకాంక్ష బలంగా ఉంది సునాక్ కు. తెల్లవారిని మాత్రమే బ్రిటిషర్లు ఒప్పుకుంటారనే మాటకు విలువ లేదు. పోయినసారి ఎన్నికలలో సునాక్ భారత సంతతివారనే విషయం చర్చనీయాంశమే కాలేదు. కానీ బాగా సంపద కలిగిన రాజకీయ నాయకులను బ్రిటిష్ పౌరులు విశ్వసించరు. ఈ రోజు చలిమంట వేసుకోవాలా, కడు పు నిండా భోజనం చేయాలా అనే విషయం తేల్చుకోవలసిన కుటుంబాల అర్థిక సమస్యలు అత్యంత సంపన్నవంతుడైన రిషీ సునాక్ కు అర్థం కావని వారి అభిప్రాయం.
సునాక్ డబ్బుతో వచ్చిన దర్పం ఉంది. ఎదుటివారు చెప్పేది వినిపించుకునే సహనం లేదు. తన భార్య అక్షత భారత దేశం నుంచి వచ్చిన సంపదపైన పన్ను చెల్లించకపోవడం వల్ల వచ్చిన చెడ్డపేరు మిగిలిపోయింది. ఆ వివాదం వల్ల సునాక్ విలువ కొంత తగ్గింది. పన్ను కట్టడానికి అక్షత అంగీకరించడంతో సమస్య సమసి పోయినప్పటికీ దాని తాలూకు ప్రభావం పూర్తిగా తొలగిపోలేదు.
ప్రధానిగా రిషీ సునాక్ ఎన్నికైనా, తిరిగి బోరిస్ జాన్సన్ టెన్ డ్రౌనింగ్ స్ట్రీట్ లో ప్రధాని గృహంలో ప్రవేశించినా అది పూలపాన్పు అయితే కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. బ్రిటన్ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది. కన్సర్వేటివ్ పార్టీలో ముఠాలు పెరిగాయి. వచ్చే ఎన్నికలలో కన్సర్వేటివ్ పార్టీని గెలిపించడం దాదాపు అసాధ్యం. గత మూడు సంవత్సరాలలో ఆ పార్టీ అంత బదనాం అయింది. రిషీ సునాక్ కు అవకాశాలు తక్కువ. తనకు మద్దతు ఇవ్వవలసిందిగా బోరిస్ జాన్సన్ సునాక్ ను అడుగుతున్నారు. అందుకు ఒప్పుకుంటే జాన్సన్ ప్రధాని కావచ్చు. సునాక్ ఆర్థికమంత్రిగా బాధ్యతలను మళ్ళీ స్వీకరించవచ్చు. నాలుగు నెలల కిందట రాజీనామాలు చేయకముందు ఎటువంటి పరిస్థితి ఉన్నదో తిరిగి అదే పరిస్థితి ఏర్పడుతుంది. అది సునాక్ కు క్షేమదాయకం. పార్లమెంటు సభ్యుల ఓటింగ్ లో గెలిచి, కన్సర్వేటివ్ పార్టీ సభ్యుల చేతిలో ఓడిపోవడం అంటే రెండో సారి అవమానం పాలు కావడం. అంత హైరానా ఎందుకు?