- రైతులకు నిత్యవసరాలు అందిస్తున్న ప్రజలు
- ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి సంఘీభావం లభిస్తోంది. హర్యానాలోని పలు జిల్లాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా దిల్లీ సరిహద్దులకు ఆనుకుని ఉన్న గ్రామస్థులు రైతులకు అండగా నిలిచేందుకు ముందుకొస్తున్నారు. ఆందోళనల్లో పాల్గొంటున్న రైతులకు కావాల్సిన నిత్యవసరసరుకులు, పాలు, కూరగాయలను సరిహద్దు గ్రామాల ప్రజలు అందిస్తున్నారు.
సింఘు సరిహద్దుకు సమీప జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ప్రతి రోజు
భారీ సంఖ్యలో ప్రజలు ట్రాక్టర్ లలో సరిహద్దులకు చేరుకుని రైతులకు మద్దతు పలుకుతున్నారు. సాయంత్రం తిరిగి స్వగ్రామాలకు వెళ్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే దినచర్యను పాటిస్తున్నారు.
Also Read: వ్యవసాయచట్టాలు, ఒక ఫార్ములా సినిమా కథ
రోజుకో గ్రామం నుంచి వస్తున్న ప్రజలు :
ఆందోళనలను ఉధృతం చేసేందుకు సరిహద్దు గ్రామాల ప్రజలు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రజలను పంపాలని ఒక్కో పంచాయతీకి ఒక్కో తేదీని కేటాయించారు. దీంతో రైతుల నిరసనల్లో పాల్గొనేందుకు రోజుకు ఒక్కో గ్రామంనుండి వందల సంఖ్యలో ప్రజలు సరిహద్దులకు చేరుకుంటున్నారు.