హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో అధికార పక్షం తెలంగాణ రాష్రసమితి సహా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు హమీల వరాల జాబితాలను ప్రకటించేశాయి. అంటే గురజాడ వారి మాటల్లో `తాంబూలాలు ఇచ్చేశాం … విజేతలు ఎవరైనా వాటిని ఎలా అమలు చేయగలరో అనే దానిపై ప్రజలు ఆలోచించుకోవాలి (గురజాడ వారి మాటల్లో అయితే `తన్నుకు చావాలి`). ఉచిత పథకాలను వ్యతిరేకించాలనే వారే వాటిని ఎంచుకొని తమ వాగ్దానంగా ప్రకటించడం మరో ప్రత్యేకత. మేనిఫెస్టోలజాబితాల్లోని అంశాలను ఇక్కడ ప్రస్తావిం చడం చర్వితచర్వణమే అవుతుంది.
తెలంగాణ ఎంత ధనిక రాష్ట్రమైనా, రాష్ట్ర ఆదాయంలో అత్యధిక శాతం హైదరాబాద్ నుంచే వస్తున్నా అక్కడి వారికే అన్ని వరాలా? మాకు అవసరం లేదా?అని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారు మధన పడుతున్నారట. అది అటుంచితే, పాలనా వ్యవహారాలకు, జీతభత్యాలకే ఒక్కొక్కసారి తడుముకోవలసి వస్తుందని తరచూ వార్తలు వస్తుండగా ఇన్ని `ఉచితాలు` ఎలా సాధ్యమని బుద్దిజీవులు ప్రశ్నిస్తున్నారు.
ఖర్చుసరే…రాబడి ఎలా?
ఆదాయం తలుపులు మూసేసి ఖర్చులనే సింహ ద్వారాలనే తెరిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నలు వస్తున్నాయి. అయితే `మోత` లేదా `తీత`అనేలా పద్దతి తయారైందని విమర్శలు వినిపిస్తున్నాయి. పన్నుల మోత ప్రజలకు భారమవుతున్నట్టే, పూర్తిగా రద్దు చేయాలనే యోచన కూడా ఖజానా నడ్డివిరుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. మధ్యేమార్గంగా తీసుకునే ఆర్థిక చర్యలు ఆమోదయోగ్యంగానే ఉంటాయని అంటున్నారు. అధిక పన్నులు, రుసుం చెల్లింపును వ్యతిరేకించే ప్రజలు సాధారణ స్థాయిలో భరించడానికి వెనుకాడబోరని అంటున్నారు.
ఉచితాలకు వ్యతిరేకం కాదు
ఉచితాలకు తాము వ్యతిరేకం కాదని, కానీ అది `అనుచితం`లా మారకూడదని నిపుణులు అంటున్నారు.పూర్తి ఉచితాలకంటే నామమాత్రం వసూళ్లతో హమీల అమలు చేస్తే అటు ఓటర్ల మనుసు గెలుచుకోవడంతో పాటు ఇలు ఖజానాను కొంతమేరకైనా కాపాడుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో, ఆయా ఎన్నికల ప్రణాళికలు రూపొందించిన వారికి ఆ మాత్రం అవగాహన ఉండదా?అని సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.
నిజమైనఅర్హులను ఆదుకుంటామనే భరోసా మంచిదే కానీ అందుకు రాబడి మార్గాలు ఏమిటన్నది కూడా జనానికి తెలియవలసి ఉంది. మేనిఫెస్టోలతో పాటు జీహెచ్ఎంసీ ప్రస్తుత ఆదాయ వ్యయాలను వివరిస్తూ,ఎన్నికల హమీల అమలుకు వనరుల సమీకరణ ఎలాగో చెప్పాల్సింది. అప్పుడు ఆయా పార్టీల పట్ల ఒక అంచనాకు ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది, విశ్వాసం కలుగుతుంది. ఆదాయం లేకుండా వ్యయం ఎలా అనే విషయం ప్రజలకైనా తట్టదా?