హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ
- పుస్తకం కొని చదివితే ప్రయోజనం
- గ్రంథాలయాలు విస్తరించాలి
- పుస్తకాలం పునఃముద్రణలో విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం
- ఉద్యమ సదృశంగా పుస్తక పఠనం పెరగాలి
దేశ వ్యాప్తంగా పుస్తకమహోత్సవాలు నిర్వహించడం ఎన్నో ఏళ్ళుగా సాగుతున్న అందమైన ఆనవాయితీ. తెలుగునాట కూడా ఆ సందడి, ఆ సంబరం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి మహా నగరాలు వేదికలుగా నిలుస్తున్నాయి. భాగ్యనగరంలో ’34 వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్’ డిసెంబర్ 18 వ తేదీన ప్రారంభమైంది. బుధవారంతో ముగిసింది. జనవరిలో విజయవాడలోనూ ఉత్సవాలు ఉండబోతున్నట్లు సమాచారం. ఒమిక్రాన్ కలకలం ఎలా ఉన్నా, హైదరాబాద్ లో పుస్తకఉత్సవం శోభాయమానంగానే సాగుతోంది. ప్రముఖులు మొదలు సామాన్యుల వరకూ ప్రతి పాఠకుడూ తమ పుస్తకప్రియత్వాన్ని చాటుకుంటూనే ఉన్నారు. పుస్తకాల ప్రదర్శన, అమ్మకంతో పాటు ఆవిష్కరణలు జరగడం మరో అదనపు ఆకర్షణ. నాటికాలం నుంచి నేటి కాలం వరకూ వచ్చిన పుస్తకాలు అందుబాటులో ఉండడం మరో ఆకర్షణ.
Also read: స్వర్గానికి నిచ్చెనలు
పెరుగుతున్న ఆన్ లైన్ అమ్మకాలు
సాంకేతికత పెరిగి, డిజిటల్ యుగం పరవళ్లు తొక్కుతున్న నేటి కాలంలో ఆన్ లైన్ అమ్మకాలు పెరుగుతూ వున్నాయి. ఈబుక్ రీడింగ్ కూడా పెరుగుతోంది. ఈ కొత్త సంస్కృతి, సరికొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా, పుస్తకాన్ని చేతిలో పట్టుకొని చదవడంలో ఉండే ఆ మజాయే వేరని ఎక్కువమంది భావన. సినిమా రిలీజైన కొద్ది గంటల్లోనే పైరసీ కాపీ అందుబాటులోకి వస్తున్నట్లుగా, కొత్త పుస్తకం ఆవిష్కరణ కూడా కాకముందే పిడిఎఫ్ లు సెల్ ఫోన్ లోకి వచ్చేస్తున్నాయి. ఈ దుష్ప్రభావం అమ్మకాలపై గణనీయంగా పడుతోందని రచయితలు, ప్రచురణకర్తలు ఎంతో ఆవేదన చెందుతున్నారు. పుస్తకం కొని చదివితే, ఆ రచయితను, తద్వారా రచనాప్రక్రియను ప్రోత్సహించినట్లవుతుంది. చాలామంది నిపుణులైన రచయితలు కూడా సొంతంగా పుస్తకాన్ని ముద్రించుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. ముద్రించినా, పంపిణీ చేసుకోలేకపోతున్నారు. ప్రచురణకర్తలు ఆ బాధ్యత తీసుకున్నా, ఆ సౌకర్యం అందరికీ అందదు. కొందరు రచయితలు, కొన్ని పుస్తకాలకు మాత్రమే ప్రచురణకర్తల నుంచి ఆదరణ లభిస్తోంది. పుస్తకప్రచురణ, పంపిణీ వ్యాపారంగా మారి కూడా చాలాకాలమైంది. వ్యాపారమంటేనే పెట్టుబడి, లాభనష్టాలు, ఖర్చులు మొదలైన వ్యయప్రయాసలు ఉంటాయి. అన్ని పుస్తకాలు లాభాలు తెచ్చిపెట్టవు. చదువరితనం ( రీడింగ్ హ్యాబిట్) కూడా తగ్గుముఖం పట్టిందని పరిశీలకుల అభిప్రాయం. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలు తప్ప మిగిలినవాటిని చదివే సంస్కృతి విద్యార్థుల్లో, యువతలో కొరవడిందన్న మాట వాస్తవమే. టీవీలు, కంప్యూటర్లు,లాప్ టాప్ లు, మొబైల్ ఫోన్స్ ప్రభావం పఠనం తగ్గడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు.గ్రంథాలయాలకు వెళ్లి చదివే రోజులు చాలా వరకూ పోయాయి. అందుకే గ్రంథాలయాల వ్యవస్థ నీరుగారి పోయింది. ప్రభుత్వాల నుంచి బడ్జెట్ల కేటాయింపు అంతంత మాత్రమే. నిరాదరణకు గురవుతున్న వ్యవస్థల్లో గ్రంథాలయాలు మొదటి వరుసలో ఉన్నాయి. ఈ కారణాలతోనే పుస్తకాల కొనుగోలు అనే ప్రక్రియకు గ్రంథాలయాలు దూరమైపోయాయి. ఈ ప్రక్రియ ప్రస్తుతం మొక్కుబడిగానే సాగుతోంది.
Also read: యథావిధిగా ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పరీక్ష
జ్ఞానమే సోపానం
మానవుని సర్వతోముఖాభివృద్ధికి జ్ఞానమే సోపానం. విద్యావంతులు సర్వత్రా పూజించబడతారు. ఆ పూజలు అందుకోవాలంటే, జీవితంలో పైకి రావాలంటే జ్ఞానమే ఏకైక మార్గం. ఎంచుకున్న రంగంతో పాటు సమాజంలోని, మనిషి జీవితంలోని మిగిలిన అంగాలను అర్థం చేసుకున్నప్పుడు తెలివి వికాసం చెందుతుంది, ఆ వికాసం వివేకం నేర్పుతుందని పెద్దలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. వికాసం, వివేకం సాధించాలంటే పుస్తక పఠనం ఉత్తమ మార్గం. మనుషులను ఎంత చదివినా, ప్రపంచాన్ని ఎంత చూసినా పుస్తకాల ద్వారా పొందే జ్ఞానం వేరు. పసిడికి తావి అబ్బినట్లు, అనుభవాలకు పఠనం అదనపు అందాన్ని చేకూరుస్తుంది. పుస్తకం హస్తభూషణం కాదు, మస్తకవిభూషణం. జ్ఞానం, సమాచారం రికార్డు అవ్వాలి. అనేక కారణాల వల్ల భారతీయ జ్ఞాన సంపద, చరిత్ర, కవిత్వం, సారస్వతం సంపూర్ణంగా నేడు అందుబాటులో లేదు. చాలామంది మహనీయుల రచనలు గ్రంథస్థం కాలేదు, గ్రంథస్థం జరిగిన రచనలు కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. మన చరిత్ర, సారస్వతం, సంస్కృతిని వక్రీకరించిన రచనలే ఎక్కువభాగం నేడు ప్రచారంలో ఉన్నాయని మేధావులు ఆవేదన చెందుతున్నారు. పూర్వ మహాకవుల రచనలు, పండితుల వ్యాఖ్యాన గ్రంథాలను ఎన్నింటినో పోగొట్టుకున్నాం. ఎన్నో మౌఖిక రచనలు ముద్రణకు నోచుకోలేదు.
Also read: వణికిస్తున్న ఒమిక్రాన్
పుస్తక ప్రచురణ విస్తృతి పెరగాలి
ప్రచురణా యంత్రాంగం, రవాణా సదుపాయాలు, కమ్యూనికేషన్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి. వీటిని ఎంత సద్వినియోగం చేసుకుంటే, అంతగా పుస్తకాల ప్రచురణ, పంపిణీ పెరుగుతాయి. ఆ విధంగా పఠనం కూడా పెరుగుతుంది. విలువైన రచనలు, పుస్తకాల పునఃప్రచురణలో విశ్వవిద్యాలయాలు భాగస్వామ్యం కావాలి. గ్రంథాలయాలకు పూర్వ వైభవం రావాలి. మరో గ్రంథాలయ ఉద్యమం రావాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. కరోనా కాలంలో ఎక్కువమంది ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో, పఠనాభిలాష పెరిగినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇది మంచి పరిణామమే. మిగిలిన కమ్యూనికేషన్ వ్యవస్థలు, వినోద రంగాలకు సమయం కేటాయిస్తూనే, పుస్తకపఠనంపై దృష్టి సారిస్తే సామాజిక వికాసం కొత్తరేకులు విప్పుకుంటుంది. అమెజాన్ అధ్యయనం ప్రకారం కరోనా కాలంలో పాఠకుల పఠనా సమయం గతంలో కంటే దాదాపు రెట్టింపయిందని సమాచారం. పుస్తక మహోత్సవాలు లాభసాటి కావాలి. రచనలు పెరగాలి. ముద్రణలు పెరగాలి. ప్రతిమనిషీ తనలోని రచయితను తట్టిలేపాలి. విలువైన పుస్తకాలను సేకరించే అభిరుచి పెరగాలి. పిల్లలను చిన్నప్పటి నుంచే వివిధ పుస్తకాల పఠనం వైపు మళ్లించాలి. పుస్తకాల ప్రచురణ, పంపిణీ, అమ్మకాలకు అందివచ్చిన ఆధునిక సదుపాయాలనన్నింటి సద్వినియోగం చేసుకోవాలి. కాగితపు ముద్రణలు కొనసాగిస్తూనే ఈ బుక్ వైపు ఎక్కువగా దృష్టి సారించాలి. అప్పుడు ప్రపంచంలోని ఏ మూలనుంచైనా పుస్తకాన్ని చదవగలిగే సౌకర్యం చెంతకు చేరుతుంది. మాతృభాషతో పాటు మిగిలిన భాషాలలోకి అనువాదాలు ఎక్కువగా జరిగితే జ్ఞానప్రసారం ఎక్కువగా జరుగుతుంది.పుస్తకాల పండుగలు జరుగుతూనే ఉండాలి. పుస్తకం మన జీవితంలో ఒక ముఖ్యభాగమై పోవాలి.
Also read:సర్వోన్నత న్యాయపీఠంపై తెలుగు తేజం