- వైద్యుల బృందం వరవరరావును పరీక్షించాలని ఆదేశించిన న్యాయస్థానం
- వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాలంటూ సుప్పీంకోర్టులో జస్టిస్ చంద్రచూడ్ చెప్పిన సూత్రం అమలు కావడం లేదు
ముంబయ్: కోరెగాం-భీమా కేసులో రెండేళ్ళకు పైగా జైలులో ఉంటున్న ప్రఖ్యాత కవి, హక్కుల నాయకుడు వరవరరావుకు బెయిల్ మంజూరు చేయడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది. ఆయనను వైద్యుల బృందం విడియో కాల్ ద్వారా పరీక్షిస్తుందని కోర్టు చెప్పింది. వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తున్న కారణంగా ఆయనను ఆస్పత్రికి పంపాలన్న అభ్యర్థనను పరిశీలించిన తర్వాత హైకోర్టు డాక్టర్లు పరీక్షిస్తారని తెలియజేసింది.
‘ఆయన మంచంపైన ఉన్నారు. డైపర్లమీద ఉన్నారు. అటువంటి మనిషి న్యాయం నుంచి పారిపోతాడా?’ అంటూ హక్కుల నాయకుడి తరఫున వాదించిన ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ న్యాయస్థానంలో గట్టిగా అడిగారు. ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తున్నదనీ, ఆయన మనుషులను గుర్తుపట్టలేకపోతున్నారనీ, మతిమరుపు వ్యాధి (డెమన్షియా) వచ్చిందనీ న్యాయవాది చెప్పారు.
విచారణ మంగళవారానికి వాయిదా
పిటిషన్ పైన విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. సాధ్యమైనంత త్వరలో ప్రైవేటు ఆస్పత్రి వైద్యులతో వీడియో కాల్ ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ‘వరవరరావు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యుల వీడియో పరీక్ష అవసరం. జులై 30 వ తేదీన వరవరరావుపైన నివేదిక సమర్పించిన నానావతి ఆస్పత్రి వైద్యులు నేడో, రేపో వీడియో కాల్ ద్వారా ఆయనను పరీక్షించడం సాధ్యమేనని అందరూ అంటున్నారు,’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.
80లో అడుగిడిన కవి
నాలుగు రోజుల కిందట 80వ ఏట అడుగుపెట్టిన వరవరరావును 2018లో అరెస్టు చేశారు. అత్యంత కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం – చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిరోదించే చట్టం (అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) – కింద కేసు పెట్టారు. విచారణ లేకుండా సంవత్సరాల తరబడి జైలులో పెట్టే వీలు ఈ చట్టం ప్రభుత్వానికి కల్పిస్తుంది. అరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ వరవరరావును జైలు నిర్బంధంలో కొనసాగించడం రాజ్యాంగం 21వ అధికరణ హామీ ఇచ్చిన జీవించే హక్కును హరించడమేనని ఆయన కుటుంబం ఒక పిటిషన్ లో నివేదించింది. జీవించే హక్కునూ, వ్యక్తి స్వేచ్ఛనూ ఈ అధికరణ పౌరులందరికీ ప్రసాదిస్తుంది. వరవరరావుకు జైలులో ఉండగానే కోవిద్ కూడా సోకింది. ఆస్పత్రిలో కిందపడితే తలకి దెబ్బతగిలింది.
వరవరరావు ఆరోగ్యం సరిగా లేదని స్టాన్ స్వామి చెప్పారు
ముంబయ్ సమీపంలోని తలోజా జైలులో వరవరరావు ఉన్నారు. ఆయనతోపాటు అదే జైలులో ఉన్నసహనిందితుడు స్టాన్ స్వామి న్యాయవాదులను పిలిచి వరవరరావు ఆరోగ్యం ఏ మాత్రం బాగాలేదని చెప్పారని జైసింగ్ అన్నారు. ‘వరవరరావును వెంటనే తలోజా జైలు నుంచి నానావతి ఆస్పత్రికి తరలించాలని నేను అత్యవసరంగా కోరుతున్నాను. ఆయన హక్కులకు భంగం కలుగుతున్నది కనుక ఆయనను విడుదల చేయవలసిందిగా అంతిమంగా నేను కోరుతున్నాను,’’అంటూ ఇందిరా జైసింగ్ కోర్టులో చెప్పారు.
వరవరరావు ఉన్న ఆనారోగ్య పరిస్థితిలో ఆయనకు సూపర్ స్పెషాలిటీ స్థాయి చికిత్స కావాలనీ, అటువంటి సదుపాయాలు తలోజా జైలులో లేవనీ, ఆయన కుటుంబంతో కలసి ఉండటం అవసరమనీ, ఈ పరిస్థితిలో ఆయన విచారణ ఎదుర్కొనడం కూడా సాధ్యం కాదనీ, ఆయనకు జరగరానిది జరిగితే అది నిర్బంధంలో సంభవించిన మరణంగానే చూడవలసి ఉంటుందని కూడా ఇందిరా జైసింగ్ కరాఖండిగా చెప్పారు.
అర్ణబ్ ఉన్నది ఈ జైలులోనే
ఇటీవల రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎగ్జిక్యుటీవ్ ఆఫీసర్ అర్ణబ్ గోస్వామిని 2018 నాటి ఆత్మహత్య కేసుకు సంబంధించి అరెస్టు చేసి తలోజా జైలులో ఉంచడం వల్ల ఈ జైలు పేరు వార్తలలోకి ఎక్కింది. గోస్వామికి బుధవారంనాడు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిలు విధాయకంగా ఇవ్వాలనీ, అసాధారణ పరిస్థితులలో జైలులో పెట్టాలనే న్యాయ, ధర్మ సూత్రాన్ని సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్రచూడ్ మొన్ననే చెప్పారు. వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించి పరిశీలించి తగు చర్యలు తీసుకోవలసిందిగా దేశంలోని అన్ని హైకోర్టులకూ జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ విజ్ఞప్తి చేసింది.
రిపబ్లిక్ టీవీ సీఈవోను ఏ సూత్రాలపైన సుప్రీంకోర్టు విడుదల చేసిందో అదే సూత్రాలువరవరరావుకీ, కోరేగాం-భీమా కేసులో సహనిందితులైన సుధా భరద్వాజ్ కీ, స్టాన్ స్వామికీ వర్తించవా అని హక్కుల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పుణె లో 31 డిసెంబర్ 2017న జరిగిన ఎల్గార్ పరిషత్ సమావేశంలో నిందితులు ప్రజలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారని పోలీసులు ఆరోపించారు. ఆ ఉపన్యాసాల కారణంగానే మరుసటి రోజు కోరేగాంలో హింసాకాండ జరిగిందని పోలీసుల వాదన. మావోయిస్టులతో కలసి వరవరరావూ, మరి తొమ్మిది మంది కార్యకర్తలూ కుట్ర పన్నారని పోలీసుల ఆరోపణ. కవి, రచయిత అయిన వరవరరావు ఈ ఆరోపణను గట్టిగా ఖండించారు.
అమానవీయ పరిస్థితులలో అసాధారణ వ్యక్తులు
వరవరరావు సహనిందితుడైనా స్టాన్ స్వామికి పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నది. ఆయన సవ్యంగా నీళ్ళు తాగలేకపోతున్నారు. అందుకని తనకు నీళ్ళు తాగడానికి ఒక స్ట్రా ఇవ్వాలని స్వామి అభ్యర్థించారు. ఇరవై రోజుల తర్వాత అతడి అభ్యర్థనను పరిశీలిస్తామని ఈ కేసలో దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పింది. ఇంత అమానవీయమైన వాతావరణంలో మేధావులూ, హక్కుల కార్యకర్తలూ అయిన వరవరరావూ, సుప్రీంకోర్టు న్యాయవాది సుధాభరద్వాజ్, తదితరులు రోజులు గడుపుతున్నారు. ప్రభుత్వాలకు చీమకుట్టినట్టయినా లేదు. దేశవ్యాప్తంగా ఎంతమంది మేధావులూ, హక్కుల కార్యకర్తలూ, మాజీ న్యాయమూర్తులూ విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ న్యాయస్థానాలు కానీ ప్రభుత్వాలు కానీ పట్టించుకోవడం లేదు.