ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ శుక్రవారంనాడు ఆదేశించింది. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అభియోగాన్ని న్యాయస్థానం తోసిపుచ్చి ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.
జస్టిస్ రోహిత్ దేవ్,జస్టిస్ అనిల్ పన్సారే లతో కూడిన బెంచ్ ట్రయల్ కోర్టు 2017లో ఇచ్చిన తీర్పును రద్దు చేయవలసిందిగా అభ్యర్థిస్తూ ప్రొఫెసర్ సాయిబాబా చేసుకున్నఅభ్యర్థనకు సకారాత్మకంగా కోర్టు స్పందించింది. ట్రయల్ కోర్టు ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు శిక్ష విధించింది.
అంగవైకల్యం మూలంగా తొంభై శాతం అశక్తుడైన దిల్లీ విశ్వవిద్యాలయం ఆచార్యుడు ప్రొఫెసర్ సాయిబాబా వీల్ చైర్ కే పరిమితమై ఉన్నారు. అర్ధాంగి వసంత సహకారంతో ఆయన పనులు చేసుకుంటూ ఉండేవారు. ఆయనను ప్రస్తుతం నాగపూర్ జైలులో ఉంచారు. ఇదే కేసులో మరో అయిదుగురు నిందితులను సైతం నిర్దోషులుగా నాగపూర్ బెంచ్ ప్రకటించింది.వారిని కూడా విడడుదల చేయాలని ఆదేశించింది. మరేదైనా కేసులు వారిపై ఉంటే తప్ప వారిని వెంటనే విడుదల చేయవలసిందిగా కోర్టు చెప్పింది. సాయిబాబానూ, మరి కొంతమందినీ మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లా సెషన్స్ కోర్టు నిందుతులుగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వారిలో ఒక జర్నలిస్టు, ఒక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి కూడా ఉన్నారు. ఉపా చట్టం కింద, భారత శిక్షాస్మృతి లోని అనేక సెక్షన్ల కింద వారిపైన కేసులు పెట్టారు. అనారోగ్య సమస్యలతో ప్రొఫెసర్ సాయిబాబా నరక యాతన అనుభవించారు.