హైదరాబాద్ లోని బోయిన్ పల్లి మార్కెట్ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ప్రధాని నరేంద్రమోదీ మన్ననలు అందుకుంది. అది అక్కడి జరిగే వ్యాపార లావాదేవీల విషయంలో కాదు. వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తున్న తీరు గురించి. సుమారు ఇరవై మూడు ఎకరాల్లో విస్తరించిన ఈ మార్కెట్ కు తెలంగాణలోని సుమారు 20 జిల్లాల నుంచి కూరగాయలు వస్తుంటాయి. వాటి నుంచి పోగయ్యే వ్యర్థాల నుంచి విద్యుత్, బయోగ్యాస్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ మార్కెట్లో రోజూ వస్తున్న కనీసం అయిదు టన్నుల వ్యర్థాలతో పాటు నగరంలోని ఇతర మార్కెట్ల నుంచి ఇంచుమించు అంతే పరిమాణంలో వస్తున్న చెత్త ను సేకరించి వీటిని ఉత్పత్తి చేస్తున్నారు.
ప్రధానమంత్రి రేడియో ద్వారా దేశప్రజలతో నెలవారీ పంచుకునే `మనసులో మాట’ (మన్ కీ బాత్) కార్యక్రమం కింద ఆదివారం నాటి కార్యక్రమంలో ఈ మార్కెట్ సాధిస్తున్న ఘనతను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
చెత్త నుంచి సిరి
`వ్యర్థ పదార్థాల నుంచి సంపద సృష్టిస్తూ, తన బాధ్యతను నిర్వర్తిస్తున్న బోయిన్ పల్లి మార్కెట్ గురించి విన్నంతనే నాకెంతో సంతోషం కలిగించింది. సాధారణంగా మార్కెట్ కు చేరే సరకు అనేక కారణాలతో పాడైపోతుంటుంది. అలాంటి వాటిని అక్కడే వదిలేయడం వల్ల అనారోగ్యానికి దారితీస్తుంటుంది కానీ ఈ మార్కెట్ యాజమాన్యం అందుకు భిన్నంగా, వినూత్నంగా వ్యవహరిస్తూ చెత్త సమస్యను పరిష్కరిస్తూనే విద్యుత్తు ఉత్పత్తి ద్వారా స్వయం పోషకత్వాన్ని సాధిస్తోంది. ఇదే నవకల్పన. అక్కడ ప్రతిరోజూ వెలువడే వ్యర్థాలను ఒక విద్యుత్తు ప్లాంటులో నిల్వ చేసి దానితో రోజూ 500 యూనిట్ల విద్యుత్తు, దాదాపు 30 కిలోల బయో ఇంధనం ఉత్పత్తి చేయడం అభినందనీయం. ఇతర మార్కెట్లకు ఆదర్శనీయం` అని ప్రధాని శ్లాఘించారు. ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును అక్కడి అవసరాలకు, బయోగ్యాస్ ను క్యాంటిన్ లో వంటకు వినియోగిస్తున్నారు.
శుభ్రతకు శుభ్రత…ఆదాయానికి ఆదాయం
మార్కెట్ వ్యర్థాలను ఇలా సద్వినియోగ పరచుకోవడం వల్ల పారిశుధ్యం, పరిశుభ్రతను పాటించడంతో పాటు ఆదాయం సమకూర్చుకోగలుగుతున్నారు. ఈ ప్రయోగానికి ముందునాటి పరిస్థితిని గమనిస్తే, మార్కెట్లోని వ్యర్థాల తరలింపునకు నెలకు సుమారు రెండున్నర లక్షల రూపాయలు చెల్లించాల్సివచ్చేది. అలాగే మూడున్నర లక్షల రూపాయల వరకు విద్యుత్ బిల్లు కట్టవలసి వచ్చేదని, అది ఇప్పడు మూడో వంతుకు తగ్గిందని మార్కెట్ కార్యదర్శి ఎల్.శ్రీనివాస్ వివరించారు.
ఇదీ చదవండి: నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ సరిహద్దులు
ఇతర మార్కెట్లలోనూ `బయో`ప్లాంట్లు
నగరంలోని గడ్డిఅన్నారం, ఎన్టీఆర్ నగర్, గుడిమల్కాపూర్, ఎర్రగడ్డ, అల్వాల్ మార్కెట్లలోనూ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర బయోటెక్నాలజీ విభాగం నిధులు సమకూర్చే ఈ పథకానికి ఐఐసీటీ సాంకేతిక సహాయం అందిస్తుంది.
ఇదీ చదవండి: రైతుల అభివృద్ధి కోసమే సాగు చట్టాలు