వోలేటి దివాకర్
- వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయం ఖాయం … చంద్రబాబును సిఎంను చేద్దాం … క్విట్ జగన్ …. సేవ్ ఆంధ్రప్రదేశ్ …
- మరో శ్రీలంకలా ఆంధ్రప్రదేశ్ …
ఆశించిన విధంగా ఎంతో ఉత్సాహంగా, అట్టహాసంగా సాగిన తెలుగుదేశం పార్టీ మూడు రోజుల మహానాడులో ప్రసంగాలన్నీ దాదాపు ఇదే రీతిలో సాగాయి.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతీ ఏటా మే 27,28,29 తేదీల్లో 3 రోజుల పాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం … ప్రజాసమస్యలు చర్చించి, వాటి పరిష్కారానికి కృషిచేయడం. ఇదే తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రధానోద్దేశం . అయితే పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు మరణించిన తరువాత మహానాడు ఉద్దేశమే పక్కదారిపడుతోంది. అధికారంలో ఉన్నా లేకపోయినా అట్టహాసంగా నిర్వహించే మహానాడులో ఆత్మస్తుతి … పరనింద తప్ప ప్రజాసమస్యలు , పార్టీ సంస్థాగత అభివృద్ధిపై లోతుగా చర్చించిన దాఖలాలు లేవు. మహానాడులో ఆమోదించిన తీర్మానాలను పూర్తిస్థాయిలో అమలు చేసిన సందర్భాలు కనిపించడం లేదు. ఒంటరిగా పోటీ చేసినా అధికారంలోకి వస్తామన్న భరోసా కార్యకర్తల్లో కల్పించలేకపోయారు. అయితే, బ్రహ్మాండం బద్దలై పోతున్నట్లు టిడిపి అనుకూల మీడియా మాత్రం ప్రత్యేక కథనాలు, ఫొటోలతో మహానాడుకు ఎక్కడలేని ప్రాధాన్యతను కల్పించడం మీడియా, రాజకీయరంగాల్లో ఉన్న వారికి పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.
ధరలు … ద్రవ్యోల్బణంపై తీర్మానాలేవీ!
టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సభలు, సమావేశాలకు వెళ్లే వారికి ఆయన ప్రసంగాలు కొట్టిన పిండిగా వచ్చేస్తాయి. చెప్పిందే చెప్పి … పార్టీ శ్రేణులు, విలేఖర్లకు కూడా సహన పరీక్ష పెడతారు. అధికారంలో ఉంటే సొంత డబ్బా కొట్టుకోవడం … ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని విమర్శించడం ఇదే ఆయన విధానం. ఆయన ప్రసంగాల్లో కొత్తదనాన్ని, ఆసక్తికర అంశాలను ఆశించలేం. గత కొద్దిరోజులుగా రాష్ట్రం శ్రీలంకలా దివాళా తీస్తుందంటూ ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు తమ పార్టీ ఏం చేస్తుందో మహానాడు వేదికగా ప్రజలకు వివరించలేకపోయింది. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పెట్రోలు, నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణంపై కనీసం మహానాడులో తీర్మానాలు చేయకపోవడం గమనార్హం. ఇటీవల అమలాపురంలో జరిగిన అల్లర్లపై, కోన సీమకు అంబేద్కర్ జిల్లాగా నామకరణంపై తమ విధానాన్ని కూడా స్పష్టం చేయలేకపోయింది. మహానాడును తమ ప్రభుత్వ గొప్పలు , ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలకే ప్రసంగాలు పరిమితం చేశారు.
లోకేష్ ఫార్ములా పనిచేస్తుందా!
వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కవని చంద్రబాబునాయుడు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొత్త ఫార్ములాను ప్రకటించారు. దీర్ఘకాలంగా పదవుల్లో ఉన్నవారిని పక్కన పెట్టనున్నట్లు కూడా చెప్పారు. 30 నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తామన్నారు. 40 శాతం మంది యువతకు కొత్తగా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు . ఈమేరకు మహానాడులో తీర్మానాలు చేస్తామని ప్రకటించినా ఆ తీర్మానాలను బహిరంగంగా ప్రకటించకపోవడం గమనార్హం. లోకేష్ ఫార్ములా ప్రకారం యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి సీనియర్లకు టిక్కెట్లు దక్కకపోవచ్చు. అసలు లోకేష్ ఫార్ములా పనిచేస్తుందా అన్నదే అనుమానం.
పవన్ తో పొత్తులపై మౌనమేల?
మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ టిడిపి పొత్తు అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టిడిపితో పొత్తుపై అవసరమైతే బిజెపిని ఒప్పిస్తానని పవన్ ప్రకటించారు. టిడిపితో పొత్తును బిజెపి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మహానాడులో కీలకమైన పొత్తుల అంశాన్ని వ్యూహాత్మకంగా టిడిపి పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. మరోవైపు 2024 ఎన్నికల్లో తమ పార్టీదే విజయమని ప్రకటించుకోవడం గమనార్హం. ఒక దశలో వచ్చే ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా పోటీ చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం కావడం సహజం. అయితే ఎన్నికల నాటికి బిజెపిని దూరం పెట్టి, టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి .